సాక్షి, అమరావతి: మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) ఇప్పుడు నాటుసారా కట్టడిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ? ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? వంటి వివరాలను సేకరించింది.
ఎస్‌ఈబీ చేపట్టిన కార్యాచరణలో కీలక అంశాలు ఇవి.
⇔ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు.
⇔ నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఈబీ బృందాలు జరిపిన దాడుల్లో 19,567 మందిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా 2,58,448 లీటర్లు, సారా తయారీ కోసం సిద్ధం చేసిన ఊట 57,21,704 లీటర్లు ధ్వంసం చేశారు. సారాను తరలించేందుకు ఉంచిన 2,956 వాహనాలు, సారా తయారీ కోసం ఉంచిన 2,08,795 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు.
⇔ ఎస్‌ఈబీ బృందాలు సారా తయారీదార్లను గుర్తించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలు వద్దంటూ మొదట కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మాట విని సారా తయారీకి జోలికివెళ్లని కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆసరా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. చెప్పినా మాట వినకుండా సారా తయారు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
⇔ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1,500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు.
సారా తయారీ ఆపకుంటే కఠిన చర్యలు తప్పవు: వినీత్‌బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ డైరెక్టర్
ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం. సమాజంలో పరువు పోగొట్టుకుని బతకడం కంటే సారా తయారీ ఆపేసి మంచి జీవనం గడపాలని కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అయినా వినకుండా సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అటువంటి వారికి 8 ఏళ్లు జైలు శిక్ష , రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లు తప్పవు.
జిల్లాల వారీగా నాటుసారా తయారీ కేంద్రాలు:
జిల్లా | ఎన్ని మండలాలు | నాటుసారా కేంద్రాలు |
శ్రీకాకుళం | 13 | 90 |
విజయనగరం | 10 | 28 |
విశాఖపట్నం | 21 | 89 |
తూర్పుగోదావరి | 36 | 186 |
పశ్చిమగోదావరి | 12 | 20 |
కృష్ణా | 6 | 27 |
గుంటూరు | 6 | 14 |
ప్రకాశం | 9 | 21 |
నెల్లూరు | 2 | 7 |
చిత్తూరు | 20 | 39 |
వైఎస్సార్ కడప | 4 | 8 |
అనంతపురం | 20 | 46 |
కర్నూలు | 32 | 107 |
Comments
Please login to add a commentAdd a comment