
సాక్షి, అమరావతి: మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత దూకుడు పెంచింది. గడచిన పది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నది. గత నెల 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన దాడులు, కేసుల వివరాలను ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్లలో ఎన్నికల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎస్‌ఈబీకి చెందిన ఏఎస్పీలకు నోడల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 11,034 మందిని బైండోవర్ చేశారు. మద్యం, నగదు తరలిస్తున్న వారిని గుర్తించి 1,728 కేసులు నమోదు చేసి 1,262 మందిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించారు. 39 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 3.799 కిలోల బంగారు ఆభరణాలు, 3.42కిలోల బంగారం, 439.11 కెరట్స్ వజ్రాలను స్వాదీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.2.47కోట్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ఎగువపల్లి చెక్‌పోస్టు వద్ద కారులో రూ.30 లక్షలు తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేశారు. కర్నూలు జిల్లాలో మరొక ప్రాంతంలో రూ.36.5లక్షలను సీజ్ చేశారు. ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాల దాడుల్లో 10,137 లీటర్ల నాటుసారా , 5,068 లీటర్ల మద్యం, 2,981 లీటర్ల బీరును స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment