సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యాన్ని తెచ్చి అమ్మి సొమ్ముచేసుకొంటున్నారు. చెక్ పోస్టుల్లో నిఘా పెరగటంతో అడ్డదారులు ఏర్పాటు చేసుకొని పోలీసుల కళ్లుకప్పి దందా కొనసాగిస్తున్నారు. అయితే, అక్రమరవాణా దారుల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కొరడా ఝళిపిస్తోంది. మూడంచెల చెక్‌పోస్టు విధానంతో నాన్ డ్యూటీ పెయిడ్ అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది.
తాజాగా కృష్ణలంక,పెనమలూరు, నున్న ,గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చోట్ల ఏకకాలంలో ఎస్‌ఈబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .కొరియర్ సర్వీస్ ద్వారా తరలిస్తున్న 2,804 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .రవాణాకు ఉపయోగించిన ఆటో, లారీని సీజ్ చేశారు. మరోపక్క పరివర్తన పేరుతో ఎస్‌ఈబీ అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ సారా తయారీ దారుల్లో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టకపోతే పీడీ యాక్టులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు .
Comments
Please login to add a commentAdd a comment