వివరాలు వెల్లడిస్తున్న సెబ్ జేడీ శ్రీలక్ష్మి
నెల్లూరు(క్రైమ్): ఓ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.10,45,500 స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) జేడీ కె.శ్రీలక్ష్మి మంగళవారం వివరాలను వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం అటవీ ప్రాంతంలో పేకాట సాగుతోందన్న సమాచారం సెబ్ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావుకు అందింది.
వారి ఆదేశాల మేరకు జేడీ, నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ (సెబ్) బృందం, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సీహెచ్ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ నెల 20వ తేదీన పేకాట కేంద్రంపై దాడులు చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన హరిబాబు, పి.జవహర్‌ఖాన్, షేక్ జమాల్, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, ఒ.రాంబాబు, విజయవాడకు చెందిన షేక్ మౌలాలీ, డి.వరప్రసాద్, వి.సంజీవ్, పి.అర్జున్, ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ పిచ్చయ్య, కె.శ్రీను, ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500, 16 సెల్‌ఫోన్లు, తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై త్వరలో సస్పెక్టెడ్ షీట్లు తెరవనున్నట్లు జేడీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పేకాట కేంద్రంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సెబ్, పోలీసులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. సెబ్ జేడీ టీమ్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment