మార్పు వైపు మరో అడుగు | AP Government Established Special Enforcement Bureau Over Illegal Liquor | Sakshi
Sakshi News home page

మార్పు వైపు మరో అడుగు

Published Tue, Jun 23 2020 4:59 AM | Last Updated on Tue, Jun 23 2020 9:25 AM

AP Government Established Special Enforcement Bureau Over Illegal Liquor - Sakshi

పోలవరం మండలం కొమ్ముగూడెంలో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెల్లం ఊటను ఒలకబోస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది (ఫైల్‌) 

సాక్షి, అమరావతి :  మద్య రహిత సమాజం కోసం, ఇసుక కొరతలేని నిర్మాణ రంగం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన మరో అడుగు మంచి ఫలితాన్నిస్తోందని స్పష్టమవుతోంది. ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటుతో చేసిన కొత్త ప్రయోగం దేశానికే ఆదర్శం కాబోతోంది. అవిర్భవించిన నెల రోజుల్లోనే అద్భుత పనితీరును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అనుమతి లేని మద్యం ప్రవాహానికి చెక్‌ పెడుతోంది. ఇసుక అక్రమాలకు బ్రేక్‌ వేస్తోంది. మరోవైపు గొంతులో గరళం నింపుతున్న నాటుసారా, గంజాయిలకు చెల్లుచీటీ రాసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల తరబడి నాటుసారా కాస్తున్న గ్రామాల్లో మంచి మార్పు తీసుకురావడంలో తనదైన ముద్ర వేస్తోంది. ఎస్‌ఈబీ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో స్పష్టమైంది. 

నెల రోజుల్లోనే ఎస్‌ఈబీ ముద్ర..
► గత నెల 12న ఏర్పాటైన ఈ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మద్యం అక్రమాలపై గత నెల 15వ తేదీ వరకు క్షేత్ర స్థాయి సమాచారం సేకరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 పోలీస్‌ యూనిట్లలో పోలీస్‌ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని గత నెల 16 నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టింది. 
► రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని అన్ని యూనిట్లు వాటి పరిధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు, నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్‌ తెరవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎస్‌ఈబీ దాడుల ఫలితాలివి..
► 75,731 లీటర్ల నాటుసారా, దీని తయారీలో ఉపయోగించే 45,969 కిలోల బెల్లం స్వాధీనం. 
► సారా తయారీకి ఉపయోగించే 13,04,022 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.
► అక్రమంగా తరలిస్తున్న 59,161.6 లీటర్ల మద్యం, 1,957.99 లీటర్ల బీరు, 10,530.302 కిలోల గంజాయి స్వాధీనం.
► 18,961 మందిపై 14,200 కేసుల నమోదు. 4,872 వాహనాల స్వాధీనం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న 2,837 మందిపై 1,545 కేసుల నమోదు.
► ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 1,924 వాహనాలు, 3,82,636.855 టన్నుల ఇసుక స్వాధీనం.

ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం..
► రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక అక్రమాలను నిలువరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా ఎస్‌ఈబీ ఏర్పాటు చేశారు. మద్యం, ఇసుక అక్రమాలకు చెక్‌ పెట్టాలనే ప్రభుత్వ ఆశయాన్ని సాధిస్తాం. డీజీపీ సవాంగ్‌ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లతో బలమైన పోలీస్‌ టీమ్‌లు ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగుతున్నాం. 
► ప్రత్యేక కొరియర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణా, సారా తయారీని అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం.
► పలు జిల్లాల్లో ఇసుక, సిలికా, గ్రావెల్‌ నిల్వలు ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘాను తీవ్రతరం చేశాం. రాత్రివేళల్లోనూ గస్తీ ముమ్మరం చేశాం. మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. – వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ కమిషనర్‌

‘పరివర్తన’ వచ్చింది..
► అవి కృష్ణా జిల్లా సముద్ర తీరంలోని గ్రామాలు. తీరంలోని ఇసుక తిన్నెలపై అడుగడుగునా నాటు సారా పాతరలుండేవి. ఆ పక్కనే సర్వే తోటల్లోకి వెళితే చెట్టుకొకటి అన్నట్టుగా నాటుసారా బట్టీలు పొగలు కక్కుతుండేవి. పోలీసులు దాడులు, నాటుసారా తయారీ దారుల ప్రతిదాడులు అక్కడ నిత్యకృత్యం.
► చినగొల్లపాలెం, పెదగొల్లపాలెం, పోడు, పడతడిక, నిడమర్రు తదితర గ్రామాలలో ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్‌ మారింది. ప్రస్తుతం సముద్రతీరం ప్రశాంతంగా ఉంది. నాటుసారా తయారీకి దూరంగా ఉంటామంటూ ఆ గ్రామాలు ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
► లాఠీకి పని చెప్పినా వినని వారిని లౌక్యంతో మంచి మాటలు చెప్పి దారికి తెచ్చారు. ఇందుకు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సామాజిక చైతన్యాన్ని తెచ్చారు. 
► కృత్తివెన్ను, పెడన మండలాల్లోని పలు గ్రామాలతోపాటు మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తండాల్లోను నాటుసారా తయారీ సాగుతున్నట్టు గుర్తించిన పోలీసులు పక్కా కార్యాచరణతో అక్కడి ప్రజల్లో మార్పు తేగలిగారు. 
► కృష్ణా జిల్లాలో తరతరాలుగా (దాదాపు 60 ఏళ్లకుపైగా) నాటుసారా తయారీని కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్న 16 గ్రామాల్లోని 140 కుటుంబాలు ఆ ఊబి నుంచి బయట పడటంలో ఎస్‌ఈబీ పాత్ర ఘనమైనది. 
► కృష్ణా జిల్లాలో చేసిన ప్రయోగం ఫలించడంతో చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరితోపాటు అనేక జిల్లాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా రొంపి నుంచి బయటపడేలా ఎస్‌ఈబీ ప్రయత్నం చేసింది. 
► దశాబ్దాల తరబడి నాటు సారా కాయడంలో నిమగ్నమైన కుటుంబాలకు రోజుల తరబడి ఓపికగా కౌన్సెలింగ్‌ ఇచ్చి మార్పు తెస్తున్నారు. రాష్ట్రంలో 436 కుటుంబాల్లో మార్పు తెచ్చి ఇక నాటుసారా జోలికి వెళ్లం అంటూ ప్రతిజ్ఞ చేయించడం విశేషం.

ఆ ఉపాధి ఇక మాకొద్దు 
ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో నాటుసారా కాచి అమ్మి కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. ఒక విధంగా చెప్పాలంటే నాటుసారా తయారీయే మాకు ఉపాధి అయ్యింది. పోలీసులంటేనే కేసులు పెట్టి వేధిస్తారని మాకు తెలుసు. కానీ అందుకు భిన్నంగా వారు రోజుల తరబడి తిరిగి మా చుట్టూ తిరిగి సారా తయారీ జోలికి వెళ్లకుండా మార్పు తెచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసిన మాకు ఇకపై ఆయన ఏదో ఒక ఉపాధి చూపకపోతారా అనే నమ్మకంతో నాటుసారా తయారీ నిలిపివేశాం. ఇకపై సారా తయారీ జోలికి వెళ్లం. – ఆరేపల్లి వెంకటేశ్వరరావు, సావిత్రి, చినగొల్లపాలెం, కృష్ణా జిల్లా

నాకు గౌరవం పెరిగింది 
సమాజంలో మద్యం లేకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయం నాకు బాగా నచ్చింది. కేసులు పెట్టి వేధించకుండా మా కోసం, మా బిడ్డల భవిష్యత్‌ కోసం పోలీసులు పడిన తాపత్రయం ఆలోచింపజేసింది. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే సారా కాయకూడదని నిర్ణయం తీసుకున్నాను. దీంతో సంఘంలో నాకు గౌరవం పెరిగింది. మంచి నిర్ణయం తీసుకున్నావంటూ చుట్టు పక్కల వారు కూడా ఇప్పుడు నన్ను మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంది. – పడమట శ్రీనివాసరావు, నిడమర్రు, కృష్ణా జిల్లా

ఇసుక కష్టాలు తీరుతున్నాయి 
ఇసుక సమస్యతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ఇసుక అక్రమాల నివారణకు ప్రత్యేకంగా ఎస్‌ఈబీ ఏర్పాటు చేయడం బాగుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పుడిప్పుడే ఇసుక కష్టాలు తీరుతున్నాయి.
– కె.నాగేశ్వరరావు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement