సాక్షి, అమరావతి: అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోంది. అమల్లోకొచ్చిన కొద్ది రోజుల్లోనే సెబ్ స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా మారింది. అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బెండు తీస్తోంది. మూడునెలల్లోనే ముప్పై వేలకు పైగా కేసులు నమోదుచేసి ధోనంబర్ దందాగాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తోంది. శాండ్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్, సారా తయారీదారుపై ఉక్కుపాదం మోపుతోంది.
తాజాగా కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అర్తమూరులో ఎస్సై తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో 500 లీటర్ల బెల్లం ఊటలను ఎస్‌ఈబీ బృందం ధ్వంసం చేసింది. దీంతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎక్సైజ్ పరిధిలో సెబ్ అధికారులు దాడులు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశామని అక్రమరవాణా ఆపకపోతే కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా సెబ్ డైరెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు.
(చదవండి: మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపు దాడి)
Comments
Please login to add a commentAdd a comment