illegal bussiness
-
అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్
సాక్షి, అమరావతి: అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోంది. అమల్లోకొచ్చిన కొద్ది రోజుల్లోనే సెబ్ స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా మారింది. అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బెండు తీస్తోంది. మూడునెలల్లోనే ముప్పై వేలకు పైగా కేసులు నమోదుచేసి ధోనంబర్ దందాగాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తోంది. శాండ్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్, సారా తయారీదారుపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అర్తమూరులో ఎస్సై తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో 500 లీటర్ల బెల్లం ఊటలను ఎస్ఈబీ బృందం ధ్వంసం చేసింది. దీంతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎక్సైజ్ పరిధిలో సెబ్ అధికారులు దాడులు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశామని అక్రమరవాణా ఆపకపోతే కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా సెబ్ డైరెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. (చదవండి: మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపు దాడి) -
గట్టుగా గుట్కా దందా !
సాక్షి, కరీంనగర్ :జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండల కేంద్రానికి చెందిన షంషొద్దీన్ గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో అక్టోబర్ 28న ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు ఇంటిపై దాడి చేశారు. రూ.64,645 విలువైన గుట్కా సంచులను పట్టుకున్నారు. గుట్కా విక్రేతల గురించి పక్కా సమాచారం అందితేనే వారిపై పోలీసులు దాడి చేసి పట్టుకోగలుగుతున్నారు.కేశవపట్నం మండలంలో గుట్కా దందా సాగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్, తిరుపతిలను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. రూ.1.50లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. మారుమూల పల్లెల్లోని ఏ కిరాణ దుకాణంలో అడిగినా.. పట్టణాల్లోని ఏ పాన్‌షాపులో సైగ చేసినా నిషేధిత గుట్కా ప్యాకెట్ క్షణాల్లో చేతిలో పడుతోంది. కాస్త తెలిసినవారైతే చాలు.. అసలు ధరకు రెట్టింపు ధరలతో గుట్కాలు విక్రయిస్తూ కొనుగోలుదారుల జేబులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. రాష్ట్ర ఎల్లలు దాటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా దందా సాగిస్తున్న తీరు పోలీస్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం, రాజకీయ అండదండలతో ఈ దందా మూడు అంబార్లు(పొగాకు ప్యాకెట్), ఆరు గుట్కాలతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో గుట్కా కింగ్‌లుగా పేరుపడ్డ ఇద్దరు వ్యక్తులు కేంద్రంగా ఈ దందా కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఏజెంట్ల రూపంలో విస్తరించింది. ఎక్కడ గుట్కా నిల్వలు కనుగొన్నా... వాటికి సంబంధించిన మూలాలు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనే కనిపిస్తుండడం గమనార్హం. ఈ అక్రమ దందా ద్వారా గుట్కా కింగ్‌లుగా పేరున్న వ్యక్తులు కోట్లకు పడగలెత్తారు. వీరిలో ఒకరు ఇటీవలే జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఏకంగా అధికార పార్టీ జెడ్పీటీసీగా గెలిచి సత్తా చాటాడు. రామగుండం కమిషనరేట్ ‘గుట్కాకింగ్’లే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా యథేచ్ఛగానే గుట్కా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కా, ఖైనీ, అంబర్(పొగాకు) వంటి ప్యాకేజ్డ్ పొగాకుతో కూడిన పాన్‌మసాలాల విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకున్న గుట్కాకింగ్లు అక్రమ వ్యాపారం ద్వారా రూ.కోట్లు గడిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో అక్రమంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరిఖనిలో ‘కింగ్’గా పిలవబడే వ్యక్తితోపాటు అతని సోదరుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ప్రాంతాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కేశవపట్నం నుంచి ధర్మారం దాకా దందా సాగిస్తున్నారు. పోలీసులతో కూడా మంచి సంబంధాలే నిర్వహిస్తారనే పేరుంది. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న దందా జగిత్యాల, మానకొండూరు, కరీంనగర్, కాల్వ శ్రీరాంపూర్ మొదలుకొని మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గత మూడేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాతో సదరు గుట్కా అక్రమ రవాణాదారుడు రాజకీయంగా ఎదిగిపోయాడు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని ఓ మండలం నుంచి అధికార పార్టీ జెడ్పీటీసీగా కూడా ఎన్నికయ్యాడు. అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యే కావాలనేది అతని కోరిక. జెడ్పీటీసీ కాకముందు అతనిని అరెస్టు చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసే పరిస్థితి. ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడంతో అతని అనుచరులు, సోదరుడి ద్వారా దందా నడిపిస్తున్నాడని సమాచారం. కరీంనగర్ గంజిలో శ్రీనివాస్ అనే ఓ గుట్కా వ్యాపారి గతంలో పెద్ద ఎత్తున దందా సాగించాడు. రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల సరుకు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో విక్రయించేవాడు. అతడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన తరువాత దందా నుంచి వైదొలిగి, వరంగల్ వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేసినవాళ్లే ఇప్పుడు కరీంనగర్ గుట్కా రాకెట్‌ను సాగిస్తున్నారు. బీదర్ నుంచే ఎందుకంటే.. జిల్లాకు పొగాకు పొట్లాలు(అంబార్), గుట్కా ప్రధానంగా కర్నాటక, తెలంగాణ సరిహద్దుల్లోని బీదర్ నుంచే సరఫరా సాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో పొగాకు వినియోగంపై నిషేధం లేదు. ఈ మార్గంలో చెక్‌పోస్టులు పెద్దగా లేకపోవడం, రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోనే ఉండడంతో రవాణా సులువు కావడంతో అక్కడి నుంచే ఎక్కువగా సరఫరా అవుతోంది. ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే ధర కంటే బీదర్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులకు ఇక్కడి నుంచి తీసుకువస్తే మరింత ఎక్కువ గిట్టుబాటవుతోంది. అక్కడ బస్తాల చొప్పున అంబార్, గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలోని రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. అనుమానం రాకుండా ఇళ్లలోనే బస్తాలను భద్రపర్చి తక్కువ మొత్తంలో ఆటోలు, కార్లు, బైక్‌ల్లో జిల్లాలోని నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. 200 గుట్కా ప్యాకెట్ల చొప్పున ఉండే ఒక్కో బస్తాకు రూ.12వేల నుంచి రూ.15 వేలకు బీదర్‌లో కొనుగోలు చేసి రైళ్లు, కార్ల ద్వారా జిల్లాకు తీసుకొచ్చాక ఒక్కో బస్తాను రూ.20 నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. కార్లలో పదుల సంఖ్యలో సంచులను తరలిస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. సులువుగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ అందులోంచి కొంత మొత్తాన్ని స్థానికంగా పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమర్పించడంతోనే వారు మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా సమాచారం అందితేనే దాడులు నిర్వహించి అక్రమ వ్యాపారులను పోలీసులు పట్టుకుంటున్నారు. కొందరిని కేసులు నమోదు చేయకుండానే విడిచిపెడుతుండడంతో వారు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుపడిన అక్రమార్కులకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. తెలిసినా గప్‌చుప్ జిల్లాలో గత కొద్దికాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటోంది. ఉన్నతాధికారులకు విషయాన్ని పొక్కనీయకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో నడుస్తున్న గుట్కా దందాలో కిందిస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా కార్లు, ఆటోలు, బైకుల ద్వారా పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా దందా సాగించేందుకు అక్రమార్కులు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నారు. ప్యాసెంజర్ ఆటోలు, కార్లలో గుట్కా సంచులను తరలిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలకు పంపిణీ చేసేందుకు బైక్‌లను వినియోగిస్తున్నా రు. పట్టపగలే ఈ దందా సాగుతున్నా నిఘా మాత్రం కరువైంది. జిల్లాకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల నుంచే గుట్కా సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీదర్ కేంద్రంగా ఎక్కువ పొగాకు, గుట్కా ప్యాకెట్లు జిల్లాకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి జిల్లాకు గుట్కా చేరుకుంటోంది. అక్కడి నుంచి కార్లు, ఆటోలు, బైక్‌లు, అశోక్ లైలాండ్, అప్పి ఆటోల్లో పట్టపగలే ఎల్లలు దాటిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం.. జిల్లాలోని అక్రమ వ్యాపారాలపై పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
పాత ఇనుమే బంగారమాయెగా..
పార్వతీపుం: ‘‘పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, మీకు పనికిరాని ఏ వస్తువునైనా కొంటాం’’ అంటూ వీధుల్లోకి వచ్చే వ్యాపారులను తరచూ చూస్తుంటాం. అలాంటివారిని చూసినప్పుడు మన ఇంటిలో ఉండే పాత వస్తువులు వారికి ఇచ్చి వారిచ్చే శనగలో, కొబ్బరి మిఠాయో లేక ఉల్లిపాయలో తీసుకుంటాం. వీడికి ఈ పాత సామాన్ల వల్ల ఏమొస్తుందా అనుకుంటాం కాని దీని వెనక జరుగుతున్న కథ వేరే ఉంది. పగటి పూట వీధుల్లో తిరుగే వ్యాపారులు ప్రతి వీధినీ, ప్రతి ఇంటినీ క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఆ తరువాత వారు ఇంటికి వెళ్లాక ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ వస్తువు చూశారో వారి అనుచరులకు చెబుతారు. వారు రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇలా దొంగిలించిన వస్తువులను పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తికి విక్రయిస్తుంటారు. పాత ఇసుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారులు దొంగిలించి తెచ్చిన వస్తువులు కాబట్టి సగానికి సగం రేటు తగ్గించి మరీ ఇస్తాడు. దీంతో ఇచ్చింది తీసుకుని వెళ్లిపోవడం దొంగల వంతౌతుంది. ఇది పాత ఇనుపసామానుల వ్యాపారం వెనుక జరుగుతున్న తంతు. ప్రభుత్వ వాహనాలు, పరిశ్రమల పరికరాలు కొనుగోలు.. పాత సామానుల వ్యాపారులు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతబడి మూలకు చేరిన వాహనాలను ఆయా శాఖల్లో పనిచేసే అధికారులతో కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో మూలకు చేరిన వాహనాన్ని విక్రయించాలంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ముందుగా వేలం ప్రకటన ప్రకటించాల్సి ఉంటుంది. వేలంలో ఎవరు ఎవరు ఎక్కువ ధర ఇస్తామని పాట పాడితే వారికి ఆ వాహనాన్ని అప్పగించాలి. కాని పాత ఇనుప సామానుల వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పాత వాహనాలను టెండర్ పిలవకుండా టోకున కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో పాతబడి మూలకు చేరిన జీపును పట్టణంలోని ఓ పాత ఇనుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారి కొనుగోలు చేసిన సంఘటన ఉంది. ఇలా ప్రభుత్వ వాహనాలు, విద్యుత్‌శాఖకు సంబంధించిన ఇనుప విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేసిన సందర్భంలో వ్యాపారులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి. దొంగ వస్తువులు కొనుగోలు.. వివిధ ప్రాంతాల్లో దొంగంలించిన వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.గ్రామాల్లో దొంగిలించిన సైకిళ్లు, పొలాల్లో రాత్రి వేళల్లో దొంగిలించిన విద్యుత్ మోటార్లు, ఐరన్ గేట్లు, ద్విచక్ర వాహనాలను వ్యాపారులు కొనుగోలు చేసి వెనువెంటనే వాటిని నుజ్జునుజ్జు చేస్తారు. ద్విచక్ర వాహనాల విడిభాగాలను విప్పేసి విక్రయిస్తుంటారు. ఇనుప రేకులు, ప్లాస్టిక్కుర్చీలు, విద్యుత్ తీగలు, పొల్లాల్లో ఉండే మోటార్లు ఇలా అనేక రాకాల ఇనుప వస్తువులను, దొంగ సరుకును కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ... జీఎస్టీ అమలు జరిగిన తరువాత ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఎత్తివేశారు. ఈ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో పాత ఇనుప సామాన్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ఒడిశా నుంచి లారీల్లో ఇనుప వస్తువులు దొంగతనంగా తెస్తే ఆంధ్రా ఒడిశా చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో దొరికిపోయేవారు. మరికొందరు చెక్‌పోస్టు అధికారులతో చేయి కలిపి దొంగతనంగా రవాణా చేసేవారు. ప్రస్తుతం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో నేరుగా వ్యాపారుల చెంతకు దొంగ సరుకు చేరుతోంది. ఒడిశాలోని అనేక పరిశ్రమల నుంచి దొంగ ఇనుప సామాన్లు ఎప్పటికప్పుడు వ్యాపారుల అక్రమంగా వాహనాల్లో పార్వతీపురం తీసుకు వస్తుంటారు. కొరవడిన తనిఖీలు పార్వతీపురం పట్టణంలో పాత ఇనుప సామాన్లు వ్యాపారం చేసేవారు పది మంది వరకు ఉంటారు. ఇందులో చిన్నా చితకా వ్యాపారులు ఆరుగురు వరకు ఉండగా ప్రతి నెలా లక్షల్లో వ్యాపారం చేసేవారు నలుగురు ఉన్నారు. వారానికి రెండు లారీల్లో ఒక్కో వ్యాపారి పాత ఇనుప సామన్లును విజయవాడకు తరలిస్తున్నారంటే పాత ఇనుప సామన్లు ఎక్కడినుంచి పుట్టికొస్తున్నాయో అర్థమౌతోంది. వీరి వద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన మోటర్లు, యంత్రాలు, మెషిన్లు, పెద్దపెద్ద ఇనుప కమ్మెలు, సిలెండర్లు ఉన్నా అవి ఏవిధంగా వస్తున్నాయి.ఎలా కొనుగోలు చేస్తున్నారో పోలీసులు ప్రశ్నించిన సందర్భాలు లేవు. -
460 కిలోల ఆల్ఫ్రాజోలం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ ల్యాబ్ ముసుగులో ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న తండ్రీకొడుకులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం 460 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ 4.60 కోట్లు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ ఇన్చార్జ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అజయ్‌రావు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పాశంమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఒక గోదాంలో నిషేధిత ఆల్ఫ్రాజోలం ఉందనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందింది. గోదాంపై దాడి చేసి 10 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి లో మరో గోదాంపై దాడులు చేశారు. అక్కడ ఎనిమిది డబ్బాల్లో నిల్వ చేసిన దాదాపు 450 కిలోల ఆల్ఫ్రాజోలం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి దీన్ని దిగుమతి చేసుకొని అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సీఆర్పీ లైఫ్ సెన్సెస్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సిద్ధార్థరెడ్డి, ఆతని తండ్రి సీపీరెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్‌రావు, ట్రేడింగ్ బిజినెస్ ఆడిటర్ సెల్వకుమార్‌పై కేసులు నమోదు చేశారు. -
ఇసుక అక్రమ వ్యాపారం
సాక్షిప్రతినిధి, నల్లగొండ ఇసుక అక్రమ వ్యాపారులు ఇప్పటికే కావాల్సినంత వెనకేసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల్లోని కొందరు అధికారుల అండదండలతో రెచ్చిపోయిన ఇసుకాసురులు కోట్లకు పడగలెత్తారు. అర్వపల్లి, శాలిగౌరారం మండలాల పరిధిలో మూసీనది, మునుగోడు వాగు, కనగల్ వాగు, హాలియా వాగు, పాలేరు వాగులు ఇప్పటికే బొందల గడ్డలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వాగుల్లో నీరు బాగా ప్రవహించింది. దీంతో ఇసుకనిల్వలు పెరిగాయి. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు, దళారులు దృష్టి సారించారు. ‘వాల్టా’ చట్టం ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను (సీ1/3316/2013) చూపి మునుగోడు మండలంలోని ఎల్గలగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు (ఉదయసముద్రం ఎత్తిపోతల) నిర్మాణ పనుల కోసం 40వేల ఘనపు మీటర్ల ఇసుక కావాలని కాంట్రాక్టు కంపెనీ కోరింది. ఈ ప్రాజెక్టు సరిహద్దు మండలాలైన మునుగోడు, కనగల్తోపాటు నార్కట్‌పల్లి మండలాల్లో స్వాధీనం చేసుకున్న ఇసుక డంపులను నిర్ణీత ధరకు విక్రయించమని కలెక్టర్ గత నెల 28వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో బి.వెల్లంల పనుల కోసం 248 ఘన పు మీటర్లు, నల్లగొండలోకి కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులకు మరో 240ఘనపు మీటర్ల ఇసుక కేటాయించారు. ఇక్కడి వరకు ఎలాంటి వివాదమూ లేదు. అయితే, ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఇసుక అక్రమ తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థకు అసవరమైన ఇసుకను విజయవాడ నుంచి తెచ్చుకోనేందుకు అగ్రిమెంటులో పేర్కొన్న విధంగా అధికారులు ప్రతిపాదనలు చేసి అందుకు అవసరమైన బిల్లును అందిస్తున్నారు. కానీ తక్కువ ధరకు ఇసుకను ఏర్పాటు చేసుకునేందుకు సదరు కాంట్రాక్టు సంస్థ నార్కట్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడొకరికి ఇసుక ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు ఇచ్చినట్టు సమాచారం . నార్కట్‌పల్లికి చెందిన నాయకుడితో పాటు, మునుగోడుకు చెందిన మరో కాంగ్రెస్ నేతా ఇద్దరు కలిసి వాగులు తవ్వేసే ప్రణాళిక రచించారు. ఎల్గలగూడెం వాగు వెంట ఉన్న భూమిని కొద్ది సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ నిరుపేద కుటుంబానికి కేటాయించి అసైన్డ్ పట్టా ఇచ్చింది. ఐదేళ్ల కిందట సదరు పట్టాదారు ఈ భూమిని మరొకరికి విక్రయించారు. నిబంధనల ప్రకారమైతే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. ఈ భూమిని కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఇటీవల ఎకరానికి *6 లక్షల చొప్పున 3 ఎకరాల భూమిని ఒక ఇసుక అక్రమ వ్యాపారికి తిరిగి అమ్మేశాడు. అదేవిధంగా మరో ఇద్దరు కూడా ఒక్కో ఎకరం చొప్పున ఇదే రీతిన తమ అసైన్డ్ భూములను విక్రయించారు. ఇపుడు ఈ భూముల నుంచే ట్రాక్టర్ల ద్వారా దాదాపు 10 వేల ట్రిప్పుల ఇసుకను తరలించేందుకు యత్నిస్తున్నారు. ఎవరూ తమను అడ్డుకోకుండా ఉండేందుకు తాము కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చుకోన్నామని బుకాయిస్తున్నారు. అయితే, కలెక్టర్ అనుమతి ఇచ్చింది వాస్తవమే అయినా, అది అక్రమంగా తరలిస్తూ పట్టుబడగా నిల్వ చేసిన ఇసుకను వేలం ద్వారా ఇవ్వమని ఇచ్చిన ఉత్తర్వులు కావడం గమనార్హం. కాగా, రెవెన్యూ, పోలీసు అధికారులు తమ జోలికి రాకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలోనే వీరు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం గతేడాది ఆగస్టు 12వ తేదీన జారీ చేసిన రాష్ట్ర ఇసుక పాలసీ ఉత్తర్వు (జీఓ నం.570)ల్లో నిబంధనలను పరిశీలిస్తే.., జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం ఈ నిబంధనలను తోసిరాజని ఎలా జరుగుతుందో ఇట్టే తెలిసిపోతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వాలంటేనే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. పట్టాభూమిలో ఇసుక తవ్వుకుని అమ్ముకోవాలంటే ముందుగా మండల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత తహసీల్దారు పర్మిట్ ఇవ్వాలి. ముందుగానే ఫారం-ఎస్8ని సమర్పించడంతో పాటు సీనరేజీ చెల్లించాలి. మినరల్ డీలర్ లెసైన్సు ఉండాలి. అపుడే పట్టా భూమి యజమాని ఇసుక తవ్వి అమ్ముకోవాడానికి వీలుంది. ఇక, ఆ పట్టాభూమి రివర్ బెడ్లో ఉంటే ఇసుక తవ్వకమే పూర్తిగా నిషిద్ధం. ఇక, ప్రభుత్వ అసైన్డ్ భూమిలో తవ్వకాలు ఎలా అనుమతిస్తారు. అదీగాక ఈ వాగుపైనే మునుగోడు, చీకటిమామిడి, కొరటికల్, పలివెల, ఇప్పర్తి ప్రజల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వాగులోనే వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. అధికారులు స్పందించి వాగువెంట అసైన్డ్ భూమి నుంచి ఇసుక తవ్వకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తే ఇప్పటికే ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి మరింత ముప్పు కలగనుంది. ఎలాంటి సాగు నీటి వనరులూ లేని 10 గ్రామాలను ఆనుకోని ఈ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాగువెంట అతి తక్కువ లోతులో బోర్లు పడటంతో 5వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసుకుంటున్నారు. మూడేళ్ల పాటు ఎండిపోయి కనిపించిన ఈ వాగు ఈ ఏడాదే పారింది.