పాత ఇనుమే బంగారమాయెగా.. | An Old Iron Goods Are Gold? | Sakshi
Sakshi News home page

పాత ఇనుమే బంగారమాయెగా..

Published Sun, Mar 10 2019 5:19 PM | Last Updated on Sun, Mar 10 2019 5:20 PM

An Old Iron Goods Are Gold? - Sakshi

వ్యాపారులు కొనుగోలు చేసిన పెద్ద మోటార్లు, పిండిమిల్లులు

పార్వతీపుం: ‘‘పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ప్లాస్టిక్‌ డబ్బాలు కొంటాం, మీకు పనికిరాని ఏ వస్తువునైనా కొంటాం’’ అంటూ వీధుల్లోకి వచ్చే వ్యాపారులను తరచూ చూస్తుంటాం. అలాంటివారిని చూసినప్పుడు మన ఇంటిలో ఉండే పాత వస్తువులు వారికి ఇచ్చి వారిచ్చే శనగలో, కొబ్బరి మిఠాయో లేక ఉల్లిపాయలో తీసుకుంటాం. వీడికి ఈ పాత సామాన్ల వల్ల ఏమొస్తుందా అనుకుంటాం కాని దీని వెనక జరుగుతున్న కథ వేరే ఉంది. పగటి పూట వీధుల్లో తిరుగే వ్యాపారులు ప్రతి వీధినీ, ప్రతి ఇంటినీ క్షుణ్నంగా పరిశీలిస్తారు.

ఆ తరువాత వారు ఇంటికి వెళ్లాక ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ వస్తువు చూశారో వారి అనుచరులకు చెబుతారు. వారు రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇలా దొంగిలించిన వస్తువులను పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తికి విక్రయిస్తుంటారు. పాత ఇసుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారులు దొంగిలించి తెచ్చిన వస్తువులు కాబట్టి సగానికి సగం రేటు తగ్గించి మరీ ఇస్తాడు. దీంతో ఇచ్చింది తీసుకుని వెళ్లిపోవడం దొంగల వంతౌతుంది. ఇది పాత ఇనుపసామానుల వ్యాపారం వెనుక జరుగుతున్న తంతు.

ప్రభుత్వ వాహనాలు, పరిశ్రమల పరికరాలు కొనుగోలు..

పాత సామానుల వ్యాపారులు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతబడి మూలకు చేరిన వాహనాలను ఆయా శాఖల్లో పనిచేసే అధికారులతో కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో మూలకు చేరిన వాహనాన్ని విక్రయించాలంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ముందుగా వేలం ప్రకటన ప్రకటించాల్సి ఉంటుంది. వేలంలో ఎవరు ఎవరు ఎక్కువ ధర ఇస్తామని పాట పాడితే వారికి ఆ వాహనాన్ని అప్పగించాలి.

కాని పాత ఇనుప సామానుల వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పాత వాహనాలను టెండర్‌ పిలవకుండా టోకున కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో పాతబడి మూలకు చేరిన జీపును పట్టణంలోని ఓ పాత ఇనుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారి కొనుగోలు చేసిన సంఘటన ఉంది. ఇలా ప్రభుత్వ వాహనాలు, విద్యుత్‌శాఖకు సంబంధించిన ఇనుప విద్యుత్‌ స్తంభాలను కొనుగోలు చేసిన సందర్భంలో వ్యాపారులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి.

దొంగ వస్తువులు కొనుగోలు..

వివిధ ప్రాంతాల్లో దొంగంలించిన వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.గ్రామాల్లో దొంగిలించిన సైకిళ్లు, పొలాల్లో రాత్రి వేళల్లో దొంగిలించిన విద్యుత్‌ మోటార్లు, ఐరన్‌ గేట్లు, ద్విచక్ర వాహనాలను వ్యాపారులు కొనుగోలు చేసి వెనువెంటనే వాటిని నుజ్జునుజ్జు చేస్తారు. ద్విచక్ర వాహనాల విడిభాగాలను విప్పేసి విక్రయిస్తుంటారు. ఇనుప రేకులు, ప్లాస్టిక్‌కుర్చీలు, విద్యుత్‌ తీగలు, పొల్లాల్లో ఉండే మోటార్లు ఇలా అనేక రాకాల ఇనుప వస్తువులను, దొంగ సరుకును కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు.

చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ...

జీఎస్‌టీ అమలు జరిగిన తరువాత ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఎత్తివేశారు. ఈ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో పాత ఇనుప సామాన్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ఒడిశా నుంచి లారీల్లో ఇనుప వస్తువులు దొంగతనంగా తెస్తే ఆంధ్రా ఒడిశా చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో దొరికిపోయేవారు. మరికొందరు చెక్‌పోస్టు అధికారులతో చేయి కలిపి దొంగతనంగా రవాణా చేసేవారు.  ప్రస్తుతం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో నేరుగా వ్యాపారుల చెంతకు దొంగ సరుకు చేరుతోంది. ఒడిశాలోని అనేక పరిశ్రమల నుంచి దొంగ ఇనుప సామాన్లు ఎప్పటికప్పుడు వ్యాపారుల అక్రమంగా వాహనాల్లో పార్వతీపురం తీసుకు వస్తుంటారు.

 కొరవడిన తనిఖీలు

పార్వతీపురం పట్టణంలో పాత ఇనుప సామాన్లు వ్యాపారం చేసేవారు పది మంది వరకు ఉంటారు. ఇందులో చిన్నా చితకా వ్యాపారులు ఆరుగురు వరకు ఉండగా ప్రతి నెలా లక్షల్లో వ్యాపారం చేసేవారు నలుగురు ఉన్నారు. వారానికి రెండు లారీల్లో ఒక్కో వ్యాపారి పాత ఇనుప సామన్లును విజయవాడకు తరలిస్తున్నారంటే పాత ఇనుప సామన్లు ఎక్కడినుంచి పుట్టికొస్తున్నాయో అర్థమౌతోంది. వీరి వద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన మోటర్లు, యంత్రాలు, మెషిన్లు, పెద్దపెద్ద ఇనుప  కమ్మెలు, సిలెండర్లు ఉన్నా అవి ఏవిధంగా వస్తున్నాయి.ఎలా కొనుగోలు చేస్తున్నారో పోలీసులు ప్రశ్నించిన సందర్భాలు లేవు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement