సాక్షిప్రతినిధి, నల్లగొండ
ఇసుక అక్రమ వ్యాపారులు ఇప్పటికే కావాల్సినంత వెనకేసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల్లోని కొందరు అధికారుల అండదండలతో రెచ్చిపోయిన ఇసుకాసురులు కోట్లకు పడగలెత్తారు. అర్వపల్లి, శాలిగౌరారం మండలాల పరిధిలో మూసీనది, మునుగోడు వాగు, కనగల్ వాగు, హాలియా వాగు, పాలేరు వాగులు ఇప్పటికే బొందల గడ్డలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వాగుల్లో నీరు బాగా ప్రవహించింది. దీంతో ఇసుకనిల్వలు పెరిగాయి. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు, దళారులు దృష్టి సారించారు. ‘వాల్టా’ చట్టం ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను (సీ1/3316/2013) చూపి మునుగోడు మండలంలోని ఎల్గలగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు (ఉదయసముద్రం ఎత్తిపోతల) నిర్మాణ పనుల కోసం 40వేల ఘనపు మీటర్ల ఇసుక కావాలని కాంట్రాక్టు కంపెనీ కోరింది. ఈ ప్రాజెక్టు సరిహద్దు మండలాలైన మునుగోడు, కనగల్‌తోపాటు నార్కట్‌పల్లి మండలాల్లో స్వాధీనం చేసుకున్న ఇసుక డంపులను నిర్ణీత ధరకు విక్రయించమని కలెక్టర్ గత నెల 28వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో బి.వెల్లంల పనుల కోసం 248 ఘన పు మీటర్లు, నల్లగొండలోకి కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులకు మరో 240ఘనపు మీటర్ల ఇసుక కేటాయించారు. ఇక్కడి వరకు ఎలాంటి వివాదమూ లేదు. అయితే, ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఇసుక అక్రమ తవ్వకాలకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థకు అసవరమైన ఇసుకను విజయవాడ నుంచి తెచ్చుకోనేందుకు అగ్రిమెంటులో పేర్కొన్న విధంగా అధికారులు ప్రతిపాదనలు చేసి అందుకు అవసరమైన బిల్లును అందిస్తున్నారు. కానీ తక్కువ ధరకు ఇసుకను ఏర్పాటు చేసుకునేందుకు సదరు కాంట్రాక్టు సంస్థ నార్కట్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడొకరికి ఇసుక ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు ఇచ్చినట్టు సమాచారం
. నార్కట్‌పల్లికి చెందిన నాయకుడితో పాటు, మునుగోడుకు చెందిన మరో కాంగ్రెస్ నేతా ఇద్దరు కలిసి వాగులు తవ్వేసే ప్రణాళిక రచించారు. ఎల్గలగూడెం వాగు వెంట ఉన్న భూమిని కొద్ది సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ నిరుపేద కుటుంబానికి కేటాయించి అసైన్డ్ పట్టా ఇచ్చింది. ఐదేళ్ల కిందట సదరు పట్టాదారు ఈ భూమిని మరొకరికి విక్రయించారు. నిబంధనల ప్రకారమైతే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. ఈ భూమిని కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఇటీవల ఎకరానికి *6 లక్షల చొప్పున 3 ఎకరాల భూమిని ఒక ఇసుక అక్రమ వ్యాపారికి తిరిగి అమ్మేశాడు. అదేవిధంగా మరో ఇద్దరు కూడా ఒక్కో ఎకరం చొప్పున ఇదే రీతిన తమ అసైన్డ్ భూములను విక్రయించారు. ఇపుడు ఈ భూముల నుంచే ట్రాక్టర్ల ద్వారా దాదాపు 10 వేల ట్రిప్పుల ఇసుకను తరలించేందుకు యత్నిస్తున్నారు. ఎవరూ తమను అడ్డుకోకుండా ఉండేందుకు తాము కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చుకోన్నామని బుకాయిస్తున్నారు. అయితే, కలెక్టర్ అనుమతి ఇచ్చింది వాస్తవమే అయినా, అది అక్రమంగా తరలిస్తూ పట్టుబడగా నిల్వ చేసిన ఇసుకను వేలం ద్వారా ఇవ్వమని ఇచ్చిన ఉత్తర్వులు కావడం గమనార్హం. కాగా, రెవెన్యూ, పోలీసు అధికారులు తమ జోలికి రాకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలోనే వీరు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం గతేడాది ఆగస్టు 12వ తేదీన జారీ చేసిన రాష్ట్ర ఇసుక పాలసీ ఉత్తర్వు (జీఓ నం.570)ల్లో నిబంధనలను పరిశీలిస్తే.., జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం ఈ నిబంధనలను తోసిరాజని ఎలా జరుగుతుందో ఇట్టే తెలిసిపోతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వాలంటేనే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి.
పట్టాభూమిలో ఇసుక తవ్వుకుని అమ్ముకోవాలంటే ముందుగా మండల వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత తహసీల్దారు పర్మిట్ ఇవ్వాలి. ముందుగానే ఫారం-ఎస్8ని సమర్పించడంతో పాటు సీనరేజీ చెల్లించాలి. మినరల్ డీలర్ లెసైన్సు ఉండాలి. అపుడే పట్టా భూమి యజమాని ఇసుక తవ్వి అమ్ముకోవాడానికి వీలుంది. ఇక, ఆ పట్టాభూమి రివర్ బెడ్‌లో ఉంటే ఇసుక తవ్వకమే పూర్తిగా నిషిద్ధం. ఇక, ప్రభుత్వ అసైన్డ్ భూమిలో తవ్వకాలు ఎలా అనుమతిస్తారు. అదీగాక ఈ వాగుపైనే మునుగోడు, చీకటిమామిడి, కొరటికల్, పలివెల, ఇప్పర్తి ప్రజల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వాగులోనే వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. అధికారులు స్పందించి వాగువెంట అసైన్డ్ భూమి నుంచి ఇసుక తవ్వకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తే ఇప్పటికే ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి మరింత ముప్పు కలగనుంది. ఎలాంటి సాగు నీటి వనరులూ లేని 10 గ్రామాలను ఆనుకోని ఈ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాగువెంట అతి తక్కువ లోతులో బోర్లు పడటంతో 5వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసుకుంటున్నారు. మూడేళ్ల పాటు ఎండిపోయి కనిపించిన ఈ వాగు ఈ ఏడాదే పారింది.
ఇసుక అక్రమ వ్యాపారం
Published Tue, Oct 8 2013 4:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement