పచ్చనేతల కనుసన్నల్లో.. | Paccanetala feelings .. | Sakshi
Sakshi News home page

పచ్చనేతల కనుసన్నల్లో..

Published Thu, Sep 18 2014 3:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

పచ్చనేతల కనుసన్నల్లో.. - Sakshi

పచ్చనేతల కనుసన్నల్లో..

కుప్పం నియోజకవర్గంలో 36 కిలోమీటర్ల మేర పాలారు నది పరీవాహక ప్రాంతం ఉంది.  కిలోమీటరుకు ఓ గ్రామం చొప్పున 36 గ్రామాల పరిధిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోని పొలాల్లో ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తుంటారు. ఒక్కో ట్రిప్పర్‌కు 12,000రూపాయలు చెల్లించాలి. రోజూ 20-30 ట్రిప్పర్లు వెళుతుంటాయి. ట్రాక్టర్ల సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ లెక్కన ఇసుకాసురులు రోజుకు.. నెలకు ఏ స్థాయిలో అక్రమార్జన సాగిస్తున్నారో ఇట్టే తెలుస్తుంది. ఈ దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతోంది. ఈ ఒక్క ఉదాహరణతో జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతుందో స్పష్టమవుతోంది.
 
సాక్షి, చిత్తూరు: నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపితే భూగర్భజలాలు అడుగంటిపోతాయనే కారణంతో తవ్వకాలపై హైకోర్టు నిషేధం విధించింది. ఇదే ఇసుకాసురుల పాలిట వరంగా మారింది. ఇసుక రవాణా చాలా కష్టంగా ఉందనే సాకు తో ఒక్కసారిగా ఇసుక బాడుగ భారీగా పెంచేశారు. గతంలో 500 రూపాయల లోపు ఉన్న బాడుగను ఒక్కసారిగా 2వేల రూపాయల దాకా పెంచేశారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇసుకాసురులు మాత్రం ప్రతినెలా లక్షల రూపాయలు అర్జిస్తున్నారు.

ఈ తతంగమంతా పోలీసులు, రెవెన్యూ అధికారులకు పూర్తి మద్దతు ఉంది. ఎందుకంటే వీరికి ఆయా ప్రాంతాన్ని బట్టి రోజువారీ, నెలవారీ మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు కొన్ని ట్రాక్టర్లపై నామమాత్రపు కేసులు నమోదు చేసి మైనింగ్ అధికారులకు సిఫార్సు చేస్తారు. అక్కడ వారు చేతులు తడుపుకుని వీలైనంత జరిమానా తగ్గించి పంపేస్తారు.

పైగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది కాబట్టి అక్కడక్కడా నిక్కచ్చిగా ఉండే అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. కొంతమంది అధికారులు ఇసుక తవ్వకాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు కోరి పోస్టింగ్‌లు వేయించుకుంటున్నారు. ఇంకొందరు అధికార పార్టీ నేతలకు డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్‌లు వేయించుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇసుక దందా ఇలా..
 
ఇసుక దందా రెండు రకాలుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లు, సర్కారు అవసరాల కోసం అంటూ తహశీల్దార్ వద్ద సిఫార్సు లేఖలు పొందుతారు. సిఫార్సు లేఖలో రెండు ట్రిప్పులు రాసి ఉంటే వీరు మాత్రం రెండింత లు ఎక్కువగా రవాణా చేసుకుంటారు. ఇది కాకుండా టీడీపీ నేతల ఆధ్వర్యంలో ‘ఇసుకాసురులు’ ఓ ముఠాగా ఏర్పడతారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో రవాణా సాగిస్తున్నారు. వాహనాల కంటే ముందు ద్విచక్ర వాహనాలు, కార్లలో ముందుగా ఓ బ్యాచ్ వెళుతుంది.

దారి వెంట అధికారులు ఉన్నారా? లేదా? అనే విషయాలను వీరు సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం చేరవేస్తే ఆ ప్రకారం వాహనాలు వస్తుంటాయి. దారిలోని పోలీసుస్టే షన్లకు మామూళ్లు మామూలే! మన రాష్ట్ర సరిహద్దు దాటితే ఆపై రవాణా సులభతరమే! శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు నుంచి తమిళనాడుకు, కుప్పం, పలమనేరు నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమంగా తరలుతోంది. అధికారులు అడ్డుపడితే వారిపై భౌతిక దాడులు చేసేందుకు కూడా మాఫియా వెనుకాడటం లేదు.
 
కొన్ని ప్రాంతాల్లో అక్రమ రవాణా ఇలా..
 
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల్లోని పుల్లారెడ్డికండ్రిగ, అమ్మపాళెం, చుక్కలనిడిగల్లు, గోనుపల్లి, చేమూరు, పెద్దకనపర్తి, గోవిందపురం, పెనగడ్డం, వికృతమాలతో పాటు చాలా గ్రామాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. స్థానికంగా ట్రాక్టర్ 2వేల రూపాయలతో, చెన్నైకి ట్రిప్పర్ ద్వారా 35వేల రూపాయలతో ఇసుకను విక్రయిస్తున్నారు. అక్రమ రవాణా నివారణకు వేసిన కమిటీ అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉంది.
 
 నగరి నియోజకవర్గంలోని కుశస్థలి నదిలో తవ్వకాలు సాగుతున్నాయి. విజయపురం, ఇళ్లట్లూరు, శ్రీరామపురం పరిధిలోని గ్రామాలకు కిలోమీటరు దూరంలోనే తమిళనాడు సరిహద్దు ఉంది. ఇసుకను సరిహద్దు దాటించి, తమిళనాడులో విక్రయాలు సాగిస్తున్నారు. స్థానికంగా అయితే ట్రాక్టర్ రూ.2,500, తమిళనాడులో 4,500 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ కూడా మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అనుచరుల కనుసన్నల్లో దందా సాగుతోంది.
 
పలమనేరు నియోజకవర్గంలోని గంగవరంలో టీడీపీ సర్పంచ్ కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. ఇసుకాసురుల దాటికి కౌండిన్య నదిలో ఇసుక పూర్తిగా కనుమరుగైంది. దీంతో నది సమీపంలోని పొలాలను దౌర్జన్యంగా వేలం వేసి, పొలాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా కర్ణాటకకు ఇసుక తరలుతోంది. ఈ దందాకు సహకరించినందుకు అక్కడి వీఆర్వోకు నెలకు 10వేల రూపాయలు ప్రతిఫలంగా దక్కుతోంది.
 
 జీడీనెల్లూరు పరిధిలోని నీవానదిలోనూ అక్రమపర్వం సాగుతోంది. ఇక్కడి పోలీసు, రెవెన్యూ అధికారులకు ఇద్దరికీ ట్రాక్టర్‌కు 500 రూపాయలు ముట్టజెబితే చాలు రోజూ ఎన్ని ట్రాక్టర్ల ఇసుకైనా రవాణా చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement