వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌ఈబీ అధికారులు
నెల్లూరు(క్రైమ్): కమీషన్లకు ఆశపడి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు నిందితులు రాష్ట్ర స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులకు దొరికిపోయారు. రూ.10 వేలు, రూ.30 వేలు కమీషన్లుగా ఇస్తామని చెప్పడంతో.. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ కటకటాలపాలయ్యారు. ఇందులో ఒకరు చదువు కోసం వక్రమార్గం పట్టిన తమిళనాడు విద్యార్థి కాగా, మరొకరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డబ్బులకు ఆశపడిన బెంగళూరు యువకుడు. ఈ వివరాలను గూడూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ ఎస్.రవికుమార్ మీడియాకు వెల్లడించారు.
కర్ణాటకలోని హోస్‌పేటకు చెందిన వి.హరీష్ అనే వ్యక్తి బెంగళూరులోని సిటీ మార్కెట్‌లో ఉన్న బట్టల దుకాణంలో పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన.. నరసింహులు అనే వ్యక్తి అతనికి డబ్బు ఆశ చూపించాడు. విశాఖ నుంచి బెంగళూరుకు గంజాయిని తీసుకువస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో హరీష్ విశాఖలో గంజాయిని కొనుగోలు చేసి.. బెంగళూరుకు బస్సులో పయనమయ్యాడు. మరోవైపు బుధవారం తెల్లవారుజామున జేడీ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.నరహరి తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని అయ్యప్పగుడి వద్ద ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. హరీష్ రూ.30 వేలు విలువ చేసే 6 కేజీల గంజాయితో దొరికిపోయాడు.
కాలేజీ ఫీజు కోసం..!
ఫీజు డబ్బుల కోసం.. గంజాయిని అక్రమంగా తరలించేందుకు తమిళనాడుకు చెందిన విద్యార్థి ఓ వ్యక్తి చేతిలో పావుగా మారాడు. చివరకు నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరుకు చెందిన ఎం.ప్రవీణ్‌రాజ్ తిరువారూరులో ఉన్న ఏసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకుంటున్నాడు. రూ.40 వేల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి కేరళకు చెందిన రహీంతో పరిచయం ఏర్పడింది. ఏపీలోని అన్నవరం నుంచి లిక్విడ్ (హాషిష్ ఆయిల్) గంజాయి తీసుకువస్తే రూ.30 వేలు కమీషన్ ఇస్తానని ప్రవీణ్‌కు రహీం చెప్పాడు. దీంతో ప్రవీణ్ అన్నవరం చేరుకొని బుచ్చి అనే వ్యక్తి వద్ద 2 కేజీల లిక్విడ్ గంజాయి కొనుగోలు చేశాడు. చెన్నైకి తీసుకెళ్తూ నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment