టీడీపీ అధినేత చంద్రబాబు, నరసరావుపేట పార్టీ ఇన్‌చార్జ్ అరవిందబాబుతో నిందితురాలు
నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి, దుండిగల్ (హైదరాబాద్): గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితురాలు, పరారీలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. 2013లో నమోదైన ఈ కేసులో జాహ్నవిపై హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నరసరావుపేటలో అరెస్టు చేసి తరలించారు. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
డ్రైవర్ దొరకడంతో పరార్..
జాహ్నవి కొన్నేళ్ల క్రితంవరకు హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో ఉండేది. 2013లో ఆమె విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయిని అక్రమంగా తరలించేందుకు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డి, కిషోర్ గంజాయిని తరలిస్తుండగా సూరారం చౌరస్తా వద్ద దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాహ్నవి పరారు కావడంతో ఎల్బీనగర్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాయర్‌నని చెప్పుకుంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు జాహ్నవిపై ఆరోపణలున్నాయి.
దిక్కుతోచని టీడీపీ నేతలు..
గంజాయి అక్రమ రవాణా కేసులో మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించినా కక్ష సాధింపు అంటూ నిత్యం గగ్గోలు పెట్టే టీడీపీ నాయకులకు ఈసారి ఏం మాట్లాడాలో దిక్కు తోచడం లేదు. చివరకు జాహ్నవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చి నిజానిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment