cannabis smuggling
-
గం‘జాయింట్’గా కొడదామా?
‘హాయ్ మామా.. బాగా గ్యాప్ వచ్చింది. జాయింట్ కొడదాం పద..’.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మాటలివి..‘ఏం స్ట్రెస్రా బాబూ ఇది. టార్గెట్లతో తలపగిలిపోతోంది. చలో బయటికి వెళ్లి కాస్త స్కోర్ చేసొద్దాం’.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ ఇది.... వాళ్లు ఏదో టీ తాగడానికో, టిఫిన్ చేయడానికో వెళ్లడం లేదు. గంజాయి తాగేందుకు వెళదామని కోడ్ భాషలో చెప్పుకొంటున్నారు. ఇక్కడా, అక్కడా అని కాదు హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్‌గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయాన్ని గంజాయి విక్రేతలు ఆసరాగా తీసుకుని, మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మత్తుకు బానిస అవుతున్న వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. గతంలో కొన్నివర్గాలకే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా పాకింది. పెద్ద పెద్ద ఆస్పత్రుల వైద్యులు సైతం గంజాయి మత్తుకు బానిస అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు గంజాయి వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మందలించి వదిలేయడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. మత్తు దందాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కానీ వివిధ విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం, కొందరు అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోకపోవడం, గంజాయి సరఫరా దారులు కొత్తకొత్త మార్గాలు అనుసరిస్తూ, వినియోగదారులనే విక్రేతలుగా మారుస్తుండటం వంటివి గంజాయి దందా యథేచ్ఛగా సాగిపోవడానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వాడుతున్న వారి సంఖ్య 10లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. దందాలోకి దిగుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతోంది. తొలుత ఒకరిద్దరితో మొదలయ్యే ఈ వ్యసనం స్నేహితుల మధ్య విస్తరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్‌లకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలకు ఒకింత తలనొప్పిగా మారింది. ఈజీ మనీకి గంజాయి మార్గం! చాలా మంది కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో (ఈజీ మనీ) గంజాయి అమ్మకాలకు దిగుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల (ఏఓబీ)కు వెళితే ఏడెనిమిది వేల రూపాయలకే రెండు కిలోల గంజాయి దొరుకుతుంది. దాన్ని హైదరాబాద్ వరకు తెస్తే.. ఆ రెండు కిలోల ప్యాకెట్ రూ.15 వేలకు కొంటారు. అదే ఒక్కో కిలో గంజాయిని 10 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లు చేసి.. ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 చొప్పున అమ్ముతారు. అంటే కిలోకు రూ.30 వేలు వస్తాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్‌ను రూ.15 వేలు పెట్టి కొంటే.. దాన్ని విక్రయించడం ద్వారా..రూ.45 వేలు మిగిలించుకుంటారు. ఇలా ఈజీ మనీ కోసం కొందరు గంజాయి అమ్మకంలోకి దిగుతున్నారు. నియంత్రణపై హడావుడికే పరిమితం హైదరాబాద్‌లో గంజాయికి ప్రధానంగా ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, సీతాఫల్మండి, ఫతేనగర్ హబ్‌లుగా ఉండేవి. ఇప్పుడు చాలా ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంగోరి భాయ్, గాంజా కిశోర్, సునీతభాయ్, ముఖేశ్‌సింగ్, దీపు, సట్టా కిశోర్, రౌడీ గోపాల్, రౌడీ విశాల్ వంటి 25 మంది వరకు గంజాయి విక్రేతలు ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారు 30, 40 కిలోల చొప్పున గంజాయి తెప్పించి.. రిటైల్‌గా విక్రయించేవారికి సరఫరా చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందుతున్నా పైపైన హడావుడికే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గంజాయి కట్టడిలో టీజీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వంటి విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా గంజాయి స్మగ్లర్లకు కలిసి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఓబీ టు నార్త్ ఇండియా.. వయా తెలంగాణ! ఏఓబీ (ఆంధ్రా– ఒడిశా బార్డర్), ఛత్తీస్‌గఢ్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పండించే గంజాయిని.. ఉత్తర భారతదేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ కారిడార్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి. స్మగ్లర్లు రైలు, రోడ్డు మార్గాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ రవాణా చేస్తున్నారు. టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది స్వల్పమేనని, అంతకు ఎన్నో రెట్లు తరలుతోందని సమాచారం. ఇక వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ గంజాయి ఏజెంట్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని.. వారి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని తెలిసింది. డ్రగ్స్‌పై ఫోకస్ పెరగడంతో గంజాయి వైపు.. కొకైన్, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్ ఫోకస్ పెరగడంతో.. చాలా మంది తక్కువ ధరకు, వెంటనే అందుబాటులో ఉండే గంజాయివైపు దృష్టి పెడుతున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు, రాజీవ్ గృహకల్ప, సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ, ధూల్‌పేట్, జీడిమెట్ల, చింతల్, సూరారం కాలనీ, దుండిగల్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్‌బీనగర్‌లతోపాటు హాస్టళ్లు ఎక్కువగా ఉన్న అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్, ఇతర పార్కులు వంటి చోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలిసింది. శిక్షల భయం లేకపోవడంతో.. గంజాయి కేసులలో నిందితులపై శిక్షలు సరిగా లేకపోవడంతో వారిలో భయం ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. కిలోకుపైన గంజాయి పట్టుబడితేనే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా గుర్తిస్తారు. ఆ కేసులలోనే కఠిన శిక్షలుంటాయి. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లు చిన్నచిన్న ప్యాకెట్లలో విడివిడిగా సరఫరా చేస్తున్నారు. వారు పట్టుబడినా బలమైన కేసులు ఉండటం లేదు. సరైన దర్యాప్తు లేని కారణంగా కూడా చాలా వరకు కేసులు వీగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులకు చిక్కిన గంజాయి విక్రేతలు.. బెయిల్‌పై వచ్చాక మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ నేరం చేస్తున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో.. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’ చట్టాన్ని నమోదు చేస్తున్నారు. దీనితో రెండేళ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు. అంతేగాక స్థానిక కోర్టుల అనుమతితో ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ (సఫెమా)’ ప్రయోగించేందుకూ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయవచ్చు. గతేడాది నమోదైన నాలుగు కేసుల్లో నిందితులకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను టీన్యాబ్ జప్తు చేసింది. గంజాయి చాక్లెట్లు... రాజస్థాన్, ఒడిశా నుంచి గాంజా, బంగ్ చాక్లెట్లు హైదరాబాద్ వస్తున్నాయి. కూరగాయలు, పండ్ల రవాణా వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ 5 కిలోల బరువు గల 2,000 గాంజా బంగ్ చాక్లెట్స్ స్వా«దీనం చేసుకుంది. నాలుగు కేసులు రిజిస్టర్ చేసింది. -
గంజాయి స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు
నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి, దుండిగల్ (హైదరాబాద్): గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితురాలు, పరారీలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. 2013లో నమోదైన ఈ కేసులో జాహ్నవిపై హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నరసరావుపేటలో అరెస్టు చేసి తరలించారు. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ దొరకడంతో పరార్.. జాహ్నవి కొన్నేళ్ల క్రితంవరకు హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో ఉండేది. 2013లో ఆమె విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయిని అక్రమంగా తరలించేందుకు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డి, కిషోర్ గంజాయిని తరలిస్తుండగా సూరారం చౌరస్తా వద్ద దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాహ్నవి పరారు కావడంతో ఎల్బీనగర్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాయర్నని చెప్పుకుంటూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు జాహ్నవిపై ఆరోపణలున్నాయి. దిక్కుతోచని టీడీపీ నేతలు.. గంజాయి అక్రమ రవాణా కేసులో మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించినా కక్ష సాధింపు అంటూ నిత్యం గగ్గోలు పెట్టే టీడీపీ నాయకులకు ఈసారి ఏం మాట్లాడాలో దిక్కు తోచడం లేదు. చివరకు జాహ్నవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చి నిజానిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా
సాక్షి, విశాఖపట్నం: అమెజాన్ ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేశారు. డయాబెటీస్ వ్యాధి నివారణకు తయారయ్యే ఆయుర్వేద మెడిసిన్‌లో వాడే ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్’ పేరిట రవాణా చేస్తున్న ఐదుగురు ముఠాను అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ వెల్లడించారు. చదవండి: రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకి వెల్లడించారు. గత ఏడు లేదా ఎనిమిది నెలల నుంచి అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురు వ్యక్తులను విశాఖ ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు అమెజాన్ ఆన్లైన్ యాప్ ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని మధ్యప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21వ తేదీన కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో తనిఖీలు నిర్వహించామని సతీష్‌కుమార్ తెలిపారు. ఇంటిలో 48 కేజీల డ్రై గంజాయితో పాటు ఓ ఎలక్ట్రానిక్ వెయిట్మిషన్, గంజాయి ప్యాకెట్లకు ఉపయోగించే రెండు కార్డ్ బోర్డు బాక్స్‌లు, అమెజాన్ బ్లాక్ అండ్ గ్రే కలర్ పాలిథీన్ బ్యాగ్స్, అమెజాన్ టేప్స్ దొరికాయని చెప్పారు. శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురజ్ పావయ్య, ముకుల్ జైశ్వాల్ ఇద్దరూ ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్’ పేరిట అమెజాన్ యాప్‌లో బుక్ చేసినట్లు చెప్పాడని తెలిపారు. చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్‌రాజు, అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేశామని సతీష్‌కుమార్ వివరించారు. -
కమీషన్లకు ఆశపడి కటకటాలపాలు
నెల్లూరు(క్రైమ్): కమీషన్లకు ఆశపడి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు నిందితులు రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులకు దొరికిపోయారు. రూ.10 వేలు, రూ.30 వేలు కమీషన్లుగా ఇస్తామని చెప్పడంతో.. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ కటకటాలపాలయ్యారు. ఇందులో ఒకరు చదువు కోసం వక్రమార్గం పట్టిన తమిళనాడు విద్యార్థి కాగా, మరొకరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డబ్బులకు ఆశపడిన బెంగళూరు యువకుడు. ఈ వివరాలను గూడూరు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్.రవికుమార్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని హోస్పేటకు చెందిన వి.హరీష్ అనే వ్యక్తి బెంగళూరులోని సిటీ మార్కెట్లో ఉన్న బట్టల దుకాణంలో పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన.. నరసింహులు అనే వ్యక్తి అతనికి డబ్బు ఆశ చూపించాడు. విశాఖ నుంచి బెంగళూరుకు గంజాయిని తీసుకువస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో హరీష్ విశాఖలో గంజాయిని కొనుగోలు చేసి.. బెంగళూరుకు బస్సులో పయనమయ్యాడు. మరోవైపు బుధవారం తెల్లవారుజామున జేడీ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ఆర్.నరహరి తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని అయ్యప్పగుడి వద్ద ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. హరీష్ రూ.30 వేలు విలువ చేసే 6 కేజీల గంజాయితో దొరికిపోయాడు. కాలేజీ ఫీజు కోసం..! ఫీజు డబ్బుల కోసం.. గంజాయిని అక్రమంగా తరలించేందుకు తమిళనాడుకు చెందిన విద్యార్థి ఓ వ్యక్తి చేతిలో పావుగా మారాడు. చివరకు నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరుకు చెందిన ఎం.ప్రవీణ్‌రాజ్ తిరువారూరులో ఉన్న ఏసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకుంటున్నాడు. రూ.40 వేల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి కేరళకు చెందిన రహీంతో పరిచయం ఏర్పడింది. ఏపీలోని అన్నవరం నుంచి లిక్విడ్ (హాషిష్ ఆయిల్) గంజాయి తీసుకువస్తే రూ.30 వేలు కమీషన్ ఇస్తానని ప్రవీణ్‌కు రహీం చెప్పాడు. దీంతో ప్రవీణ్ అన్నవరం చేరుకొని బుచ్చి అనే వ్యక్తి వద్ద 2 కేజీల లిక్విడ్ గంజాయి కొనుగోలు చేశాడు. చెన్నైకి తీసుకెళ్తూ నెల్లూరు బస్టాండ్‌లో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు. -
గంజాయి దందా
⇒ జిల్లాలో గుట్టుగా రాకెట్ ⇒ యువత, కూలీలే టార్గెట్ ⇒ స్లమ్ ఏరియాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో విక్రయాలు ⇒ ఆదిలాబాద్ కేంద్రంగా మహారాష్ట్ర, ఢిల్లీకి రవాణా ⇒ అటవీ ప్రాంతాల్లో అంతర పంటగా సాగు ⇒ నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు ఆదిలాబాద్: జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా చేయడం, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు బయటపడడం జిల్లాలో కలకలం రేపుతోంది. శుక్రవారం ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించగా గంజాయి రాకెట్ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా చేసుకొని మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు గంజాయి సరఫరా స్మగ్లింగ్ సాగడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఏడాది గంజాయి సరఫరాలో రెండు కేసులు నమోదు చేశారు. జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎవరికీ అనుమానం రాకుండా పొలాల్లో ఇతర పంటల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. జిల్లాతోపాటు మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారు. అమాయక రైతులను – మిగతా కొందరు వ్యాపారులు వారి స్వార్థం కోసం డబ్బులు ఆశ చూపించి గంజాయి సాగు చేయిస్తున్నారు. దీంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేస్తున్న దాడుల్లో అమాయకులు పట్టుబడుతున్నారు. యువత, కూలీలే లక్ష్యం.. ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాకు యువత, కూలీలే బానిసలు అవుతున్నట్లు అధికారుల నిఘాలో తేలింది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని మురికి వాడలైన పిట్టల్‌వాడ, ఖానాపూర్, మహాలక్ష్మీవాడ, ఖుర్షిద్‌నగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో చిన్నచిన్న దుకాణాల్లో గంజాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 5 గ్రాముల ప్యాకెట్‌ను రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయా కాలనీల యువకులు, కూలీలు ఎక్కువగా గంజాయిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతేడాది ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేసిన దాడుల్లో మొత్తం 38 కేసులు నమోదుకాగా 56 మందిని అరెస్టు చేశారు. 5 క్వింటాళ్ల 30 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకోగా, సుమారు 6 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఆదిలాబాద్ కేంద్రంగా.. జిల్లాలో చాలామంది గంజాయి తరలింపును జీవనోపాధిగా ఎంచుకున్నారు. గంజాయి వ్యాపారులు అమాయక మహిళలు.. పేదలకు డబ్బు ఆశచూపి గంజాయిని తాము సరఫరా చేసే ప్రాంతాలకు తరలించేలా చూస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందెడ్, అమరావతి, యావత్మాల్, ఛత్తీ‹స్ఘడ్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గంజాయి స్మగ్లర్లు జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ ఉన్న గంజాయి ముఠా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఆయా ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి స్మగ్లర్లను రప్పించి దందా నడిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మట్కా, పేకాట జోరుగా సాగుతుందనుకుంటే, అంతకు మించి గంజాయి దందా సాగిస్తున్నట్లు అధికారుల నిఘాలో తెలిసింది. జిల్లా కేంద్రానికి వచ్చిన గంజాయిని రైలు మార్గం, బస్సుల్లో, కారుల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గంజాయికి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధర ఉంటుంది. ఇక్కడ గంజాయి సాగు చేసిన వారికి కిలో రూ.3 వేల నుంచి 5 వేలు చెల్లిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి వ్యాపారం చేయడం గమనార్హం. జిల్లాలో అంతరపంటగా సాగు.. జిల్లాలో గంజాయి జోరుగా సాగవుతోంది. గంజాయిని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాపారులు ఇక్కడి గిరిజన అమాయకులను మచ్చిక చేసుకుని వారి పంటపొలాల్లో అంతర్‌పంట సాగు చేసేందుకు గంజాయి విత్తనాలు అందిస్తున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో పత్తి, కంది, పసుపు తదితర పంటలు వేసి అందులో గంజాయి మొక్కలు పెట్టి సాగు చేస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో అవి బయటపడుతున్నాయి. జిల్లాలో ఆదిలాబాద్, తలమడుగు మండలం నందిగామ, బజార్హత్నూర్ మండలం భూతాయి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తున సాగవుతోంది. పక్క జిల్లాలైన నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా, మన జిల్లాలోని పల్లెలు, తండాల్లో వీటిని పొడి గంజాయిగా చేసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గంజాయి పట్టివేత ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి గుట్టు రట్టయింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు శుక్రవారం 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సీఐలు సుంకరి రమేష్, వెంకట్ వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం పీలేరు గ్రామానికి చెందిన భాషా, విజయ్భరత్లు 20 కిలోల గంజాయితో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన కైసర్, ప్రీతమ్‌లను కలుసుకుని.. ఢిల్లీ నుంచి వచ్చిన స్మగ్లర్ తారీఫ్‌కు ఇచ్చేందుకు ఇక్కడే మకాం వేశారు. ఐదుగురూ కలిసి ప్రీతమ్ ఇంటి నుంచి ఆటోడ్రైవర్ హుస్సేన్ ఆటోలో బయల్దేరగా.. అప్పటి నిఘా వేసి ఉంచిన ఎౖక్సైజ్ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రీతమ్, కైసర్ పారిపోయారు. నిందితుల నుంచి రూ.2లక్షలు విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు వివరించారు. ప్రధాన నిందితులైన కైసర్, ప్రీతమ్ ఇతర జిల్లాల నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నరేష్, విఠల్, నరేందర్, ప్రకాశ్, కార్తీక్, మహ్మద్ పాల్గొన్నారు. -
బెంజ్‌లో గంజాయ్
-
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్, 7కిలోల స్వాధీనం
వరంగల్ : అక్రమంగా గంజాయి తరలింపులు నిరాఘటంగా కొనసాగుతున్నాయి. అక్రమంగా గంజాయిని తరలించడానికి రైల్వేస్టేషన్ లను అనువుగా ఎంచుకుంటున్నారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని డోర్నకల్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి 7కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. -
విశాఖలో అక్రమంగా గంజాయి రవాణా, నలుగురు అరెస్ట్
విశాఖపట్నం: అక్రమంగా గంజాయి రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. విశాఖ జిల్లాలోని ఆరులోవలో సోమవారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అక్రమ గంజాయి తరలిస్తున్న వారిలో ముగ్గురు ఒరిస్సాకు చెందిన కోరాపుట్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
గంజాయి స్మగ్లింగ్ ముఠాకు చెక్
హయత్‌నగర్, న్యూస్‌లైన్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. నలుగురి అరెస్టు చేసి రూ. 60 లక్షల విలువైన 10 క్వింటాళ్ల ‘సరుకు’తో పాటు డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును జల్సాలకు ఖర్చు చేయడంతో పాటు గత పంచాయితీ ఎన్నికల్లోను ఖర్చు చేశామని నిందితులు చెప్పడం గమనార్హం. ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్దన్‌రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన పాల్ మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన గణేష్‌కు రెండేళ్లుగా గంజాయిని సరఫరా చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా తిప్పాయిగూడెంకు చెందిన డీసీఎం డ్రైవర్ వీరేష్గౌడ్తో పాల్‌కు వైజాగ్‌లో పరిచయమైంది. వీరేష్ తన వ్యాన్‌లో ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తన గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్‌గౌడ్, మహ్మద్ జాని, బోయ రవిల సహకారంతో ‘సరుకు’ను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు. పాల్ ఇతనికి ట్రిప్పుకు రూ. 50 వేలు కిరాయితో పాటు మరో రూ. లక్ష అదనంగా చెల్లిస్తున్నాడు. నెలకు రెండు లేదా మూడు ట్రిప్పులను వీరు తరలిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులకు ఈ సమాచారం అందడటంతో రెండు నెలలుగా వీరిపై దృష్టి పెట్టారు. గురువారం ఉదయం 7 గంటలకు పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద మాటువేసి... డీసీఎం వ్యాన్ (ఏపీ24ఎక్స్4533)లో తరలిస్తున్న 10 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. డ్రైవర్ వీరేష్గౌడ్తో పాటు వెంకటేశ్‌గౌడ్, జాని, రవిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు పాల్, గణేష్‌లు పరారీలో ఉన్నారని, నిందితులపై మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓఎస్డీ చెప్పారు. ఈ ముఠా గుట్టురట్టు చేసిన సిబ్బందికి రివార్డు ఇస్తామన్నారు. కాగా, గంజాయి స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేసినట్లు నిందితులు తెలిపారు. గత పంచాయితీ ఎన్నికల్లోనూ కొంతడబ్బును ఖర్చు చేశామని చెప్పారు. -
గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా ముంబైకి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 148 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా పాలెం మండలం సుబ్లాదే గ్రా మానికి చెందిన రైతు కొండా ఉపేందర్ (28), ప్రైవేట్ సెక్యూరిటీగార్డు గంధా శ్రీనాగరాజు (27), టైలర్ వేదులపరుపు వీరాంజనేయులు (35) త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని గంజాయి స్మగ్లింగ్ మొదలెట్టారు. విశాఖపట్నం, అన్నవరం, జీముదుల్లా ప్రాంతాల నుంచి గంజాయిని నగరానికి తెచ్చి.. ఇక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నారు. పది, ఐదు కిలోల చొప్పున లగేజీ బ్యాగులలో గంజాయిని నింపి.. ఎవరీ అనుమానం రాకుండా ప్ర యాణికుల్లా ప్రైవేట్ బస్సుల్లో నగరానికి తెస్తున్నారు. ఈ ‘సరుకు’ను బాలానగర్ రాజుకాలనీలో అద్దెకు తీసుకున్న గదిలో భద్రపర్చి.. ఆ తర్వాత ముంబైకి తరలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్.రమేష్‌లు శుక్రవారం అర్ధరాత్రి రాజుకాలనీలోని స్మగ్లర్ల గదిపై దాడి చేశారు. ఉపేందర్, వీరాంజనేయులు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 148 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బాలానగర్ పోలీసులకు అప్పగించారు.