
గంజాయి దందా
⇒ జిల్లాలో గుట్టుగా రాకెట్
⇒ యువత, కూలీలే టార్గెట్
⇒ స్లమ్ ఏరియాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో విక్రయాలు
⇒ ఆదిలాబాద్ కేంద్రంగా మహారాష్ట్ర, ఢిల్లీకి రవాణా
⇒ అటవీ ప్రాంతాల్లో అంతర పంటగా సాగు
⇒ నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు
ఆదిలాబాద్: జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా చేయడం, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు బయటపడడం జిల్లాలో కలకలం రేపుతోంది. శుక్రవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించగా గంజాయి రాకెట్ గుట్టు వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా చేసుకొని మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు గంజాయి సరఫరా స్మగ్లింగ్ సాగడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఏడాది గంజాయి సరఫరాలో రెండు కేసులు నమోదు చేశారు. జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎవరికీ అనుమానం రాకుండా పొలాల్లో ఇతర పంటల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. జిల్లాతోపాటు మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారు. అమాయక రైతులను – మిగతా కొందరు వ్యాపారులు వారి స్వార్థం కోసం డబ్బులు ఆశ చూపించి గంజాయి సాగు చేయిస్తున్నారు. దీంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేస్తున్న దాడుల్లో అమాయకులు పట్టుబడుతున్నారు.
యువత, కూలీలే లక్ష్యం..
ఆదిలాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాకు యువత, కూలీలే బానిసలు అవుతున్నట్లు అధికారుల నిఘాలో తేలింది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని మురికి వాడలైన పిట్టల్‌వాడ, ఖానాపూర్, మహాలక్ష్మీవాడ, ఖుర్షిద్‌నగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో చిన్నచిన్న దుకాణాల్లో గంజాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 5 గ్రాముల ప్యాకెట్‌ను రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఇందులో ఆయా కాలనీల యువకులు, కూలీలు ఎక్కువగా గంజాయిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. గతేడాది ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు చేసిన దాడుల్లో మొత్తం 38 కేసులు నమోదుకాగా 56 మందిని అరెస్టు చేశారు. 5 క్వింటాళ్ల 30 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకోగా, సుమారు 6 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
ఆదిలాబాద్ కేంద్రంగా..
జిల్లాలో చాలామంది గంజాయి తరలింపును జీవనోపాధిగా ఎంచుకున్నారు. గంజాయి వ్యాపారులు అమాయక మహిళలు.. పేదలకు డబ్బు ఆశచూపి గంజాయిని తాము సరఫరా చేసే ప్రాంతాలకు తరలించేలా చూస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందెడ్, అమరావతి, యావత్‌మాల్, ఛత్తీ‹స్‌ఘడ్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గంజాయి స్మగ్లర్లు జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు.
ఇక్కడ ఉన్న గంజాయి ముఠా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఆయా ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి స్మగ్లర్లను రప్పించి దందా నడిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మట్కా, పేకాట జోరుగా సాగుతుందనుకుంటే, అంతకు మించి గంజాయి దందా సాగిస్తున్నట్లు అధికారుల నిఘాలో తెలిసింది. జిల్లా కేంద్రానికి వచ్చిన గంజాయిని రైలు మార్గం, బస్సుల్లో, కారుల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గంజాయికి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధర ఉంటుంది. ఇక్కడ గంజాయి సాగు చేసిన వారికి కిలో రూ.3 వేల నుంచి 5 వేలు చెల్లిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి వ్యాపారం చేయడం గమనార్హం.
జిల్లాలో అంతరపంటగా సాగు..
జిల్లాలో గంజాయి జోరుగా సాగవుతోంది. గంజాయిని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాపారులు ఇక్కడి గిరిజన అమాయకులను మచ్చిక చేసుకుని వారి పంటపొలాల్లో అంతర్‌పంట సాగు చేసేందుకు గంజాయి విత్తనాలు అందిస్తున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో పత్తి, కంది, పసుపు తదితర పంటలు వేసి అందులో గంజాయి మొక్కలు పెట్టి సాగు చేస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో అవి బయటపడుతున్నాయి.
జిల్లాలో ఆదిలాబాద్, తలమడుగు మండలం నందిగామ, బజార్‌హత్నూర్ మండలం భూతాయి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తున సాగవుతోంది. పక్క జిల్లాలైన నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా, మన జిల్లాలోని పల్లెలు, తండాల్లో వీటిని పొడి గంజాయిగా చేసి విక్రయిస్తున్నారు.
20 కిలోల గంజాయి పట్టివేత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి గుట్టు రట్టయింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు శుక్రవారం 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సీఐలు సుంకరి రమేష్, వెంకట్ వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం పీలేరు గ్రామానికి చెందిన భాషా, విజయ్‌భరత్‌లు 20 కిలోల గంజాయితో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన కైసర్, ప్రీతమ్‌లను కలుసుకుని.. ఢిల్లీ నుంచి వచ్చిన స్మగ్లర్ తారీఫ్‌కు ఇచ్చేందుకు ఇక్కడే మకాం వేశారు.
ఐదుగురూ కలిసి ప్రీతమ్ ఇంటి నుంచి ఆటోడ్రైవర్ హుస్సేన్ ఆటోలో బయల్దేరగా.. అప్పటి నిఘా వేసి ఉంచిన ఎౖక్సైజ్ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రీతమ్, కైసర్ పారిపోయారు. నిందితుల నుంచి రూ.2లక్షలు విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐలు వివరించారు. ప్రధాన నిందితులైన కైసర్, ప్రీతమ్ ఇతర జిల్లాల నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నరేష్, విఠల్, నరేందర్, ప్రకాశ్, కార్తీక్, మహ్మద్ పాల్గొన్నారు.