సాక్షి, అమరావతి: గుజరాత్‌లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఇటీవల జప్తుచేసిన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినా.. ప్రతిపక్ష పార్టీలు, ఓ సీనియర్ నాయకుడు (చంద్రబాబును ఉద్దేశించి) పదేపదే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా అపోహలు సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజనిజాలు బేరీజు వేసుకోవాలన్న విచక్షణను ప్రతిపక్ష పార్టీలు మరచిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముంద్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో విజయవాడకు, రాష్ట్రానికిగానీ అస్సలు సంబంధం లేదని విజయవాడ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ముంద్రా, చెన్నై, ఢిల్లీ, నోయిడాలలోనే హెరాయిన్ స్వాధీనాలు, అరెస్టులు చేశారని జాతీయ పత్రికలు, చానళ్లు కూడా ప్రముఖంగా ప్రసారం చేసిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. ఆ నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవని డీఆర్‌ఐతోపాటు కేంద్ర సంస్థలు ధ్రువీకరిస్తున్నా సరే సీనియర్ నాయకుడినని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది తప్ప రాష్ట్రంలో ఇసుమంతైనా కార్యకలాపాలు జరపలేదని పునరుద్ఘాటించారు.
అసత్య ప్రకటనలు మానుకోవాలి
హెరాయిన్‌ను విజయవాడకుగానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకుగానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఆర్‌ఐ అధికారులు స్పష్టంచేసిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకుంటుండగా తనిఖీలు చేసి జప్తు చేశామని మాత్రమే డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై డీఆర్‌ఐ, ఇతర కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని కూడా సవాంగ్ చెప్పారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలని ఆయన కోరారు. హెరాయిన్ స్మగ్లింగ్ వంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు
రాష్ట్రంలో బహిరంగ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మహిళల భద్రత, ఘర్షణల నివారణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి డీజీపీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగ నియామవళిలో బహిరంగ మద్యసేవనం నిరోధాన్ని కూడా చేర్చాలని కోరారు. దీనిపై సవాంగ్ స్పందిస్తూ.. బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను పటిష్టపరిచామన్నారు.
Gautam Sawang అపోహల సృష్టికే..
Published Fri, Sep 24 2021 1:58 AM | Last Updated on Fri, Sep 24 2021 8:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment