dri officers
-
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
అపోహల సృష్టికే ఏపీలో వదంతులు
సాక్షి, అమరావతి: గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఇటీవల జప్తుచేసిన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అయినా.. ప్రతిపక్ష పార్టీలు, ఓ సీనియర్ నాయకుడు (చంద్రబాబును ఉద్దేశించి) పదేపదే వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా అపోహలు సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలతో ప్రజలు అభద్రతాభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజనిజాలు బేరీజు వేసుకోవాలన్న విచక్షణను ప్రతిపక్ష పార్టీలు మరచిపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముంద్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో విజయవాడకు, రాష్ట్రానికిగానీ అస్సలు సంబంధం లేదని విజయవాడ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకులు ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ముంద్రా, చెన్నై, ఢిల్లీ, నోయిడాలలోనే హెరాయిన్ స్వాధీనాలు, అరెస్టులు చేశారని జాతీయ పత్రికలు, చానళ్లు కూడా ప్రముఖంగా ప్రసారం చేసిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గుర్తుచేశారు. ఆ నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవని డీఆర్ఐతోపాటు కేంద్ర సంస్థలు ధ్రువీకరిస్తున్నా సరే సీనియర్ నాయకుడినని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది తప్ప రాష్ట్రంలో ఇసుమంతైనా కార్యకలాపాలు జరపలేదని పునరుద్ఘాటించారు. అసత్య ప్రకటనలు మానుకోవాలి హెరాయిన్‌ను విజయవాడకుగానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకుగానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఆర్ఐ అధికారులు స్పష్టంచేసిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకుంటుండగా తనిఖీలు చేసి జప్తు చేశామని మాత్రమే డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, ఇతర కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని కూడా సవాంగ్ చెప్పారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పుదోవపట్టించడం మానుకోవాలని ఆయన కోరారు. హెరాయిన్ స్మగ్లింగ్ వంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు రాష్ట్రంలో బహిరంగ మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మహిళల భద్రత, ఘర్షణల నివారణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి డీజీపీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగ నియామవళిలో బహిరంగ మద్యసేవనం నిరోధాన్ని కూడా చేర్చాలని కోరారు. దీనిపై సవాంగ్ స్పందిస్తూ.. బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను పటిష్టపరిచామన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ వద్ద దాదాపు 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుండి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా మహిళ ప్రయాణికురాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ ఆధికారులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ దాదాపు రూ. 21 కోట్లు ఉంటుందని డీఆర్ఐ ఆధికారులు అంచనా వేశారు. -
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత!
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 800 గ్రాములు, మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 700 గ్రాములు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కేజిన్నర బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారి వద్ద ఉన్న బంగారానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
స్వీట్ బాక్సుల్లో రూ.1.48 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా రవాణా చేస్తున్న దుబాయ్ కరెన్సీని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కరెన్సీని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న మిఠాయి బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. అలాగే ఎయిరిండియా విమానం నుంచి దిగిన మరో ప్రయాణికుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న ఉస్మానియా బిస్కెట్‌బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. భారత కరెన్సీలో వీటి విలువ రూ.1,48,75,000 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరు ఈ మొత్తాన్ని దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్నందుకు వీరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
నైజీరియన్ల అక్రమ దందాకు తెర
సాక్షి, హైదరాబాద్ : రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నైజీరియన్లు కొత్త రకం దందాతో రంగంలోకి దిగారు . ఎయిర్పోర్ట్ కార్గోలో లాగోస్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా నిషేధిత పదార్థాలు దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా నిషేధిత పదార్థాలను పట్టుకున్నారు. నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ భారీ పార్సల్‌లో 13 టన్నులు ఉన్న కాస్మోటిక్స్, బీర్, విస్కీ, జిన్‌తోపాటు ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. వీటి విలువ 52 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా అనుమతి లేకుండా వీటిని నగరానికి తీసుకు వచ్చిన నిందితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. ఆ మహిళ నుంచి 11.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న 7 క్లాత్ ప్యాకెట్స్‌తో పాటు, సాక్స్లలో ఆమె బంగారం తీసుకోచ్చినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఆ మహిళ నివాసం ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌లో సైతం తనిఖీలు చేపట్టిన అధికారులు స్మగుల్డ్ గూడ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
విమానాల సర్వీస్ మార్పిడితో స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి... దేశంలోకి ప్రవేశించాక దేశీయ సర్వీసులుగా మారే విమానాలను ఎంచుకొని సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని పట్టుకుని రూ.66 లక్షల విలువైన 1.99 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన కేరళ వాసిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ విభాగం దీని వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠా కోసం లోతుగా విచారిస్తోంది. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితరదేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా ఉండే విమానాలు దేశంలో డొమెస్టిక్‌గా మారుతాయి. వీటి ఆసరాగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. పట్టుబడింది ఇలా... తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుంచి ఇండిగో సంస్థకు చెందిన 6ఈ–648 విమానం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయానికి వచ్చింది. అందులో హైదరాబాద్‌కు వచ్చిన ఓ కేరళ వాసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐకు సమాచారం అందింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో కాపుకాసిన అధికారులు అతనిని పట్టుకొని నాలుగు బంగారం బిస్కెట్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66.27 లక్షలు ఉంటుందని డీఆర్ఐ ప్రకటించింది.అతను ప్రయాణించిన విమానం షార్జా నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తోంది. ఆపై దేశీయ సర్వీసుగా మారి మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌కు వెళ్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తుంది. ఇలా సూత్రధారుల ఆదేశాల ప్రకారం షార్జా నుంచి బంగారాన్ని తీసుకువచ్చిన వారు దాన్ని ఆ విమానం బాత్రూమ్స్లోని రహస్య ప్రదేశాల్లో దాచి దేశంలోకి ప్రవేశించగానే దాన్ని వదిలేసి తనిఖీల్లో చిక్కకుండా దిగి వెళ్లిపోతాడు.ఆపై అదే విమానంలో దేశీయంగా ప్రయాణించే వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి అదే విమానంలో ప్రయాణించేలా చేశారు. ఆ వ్యక్తి అదను చూసుకుని టాయ్‌లెట్స్‌లో ఉన్న బంగారం తీసుకుంటాడు.ఆపై గమ్య స్థానం చేరగానే కస్టమ్స్ తనిఖీలు లేకుండా బయటకు వచ్చేస్తాడు. ఈ తరహాలోనే ప్రస్తుతం పట్టుబడిన కేరళ వాసి ఇండోర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాడు. ఈ స్మగ్లర్‌కు ఓ మారు పేరు పెట్టి, బోగస్ ఆధార్‌కార్డు సృష్టించి సూత్రధారులు ఇచ్చారు. డీఆర్ఐ అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో... ఇలాంటి వ్యవహారమే కిందటి గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి ఇంటర్నేషనల్ సర్వీసుగా బెంగళూరు వరకు వచ్చి ఆపై కొలంబియా వెళ్లి చెన్నైకు తిరిగి వచ్చి డొమెస్టిక్ సర్వీస్‌గా ఆ విమానం మారింది. ఇందులోని టాయిలెట్స్‌లోని అద్దాల వెనుక స్మగ్లర్లు రూ.60 లక్షల విలువైన 30 బంగారం కడ్డీలను అమర్చారు. ఇది జనవరి 13న చెన్నై నుంచి పుణేకు వెళ్లింది. ఆ తర్వాత పుణే–చెన్నై, చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్–రాయ్‌పూర్, రాయ్‌పూర్–ఢిల్లీ, ఢిల్లీ–శ్రీనగర్, శ్రీనగర్–అమృత్సర్, అమృత్సర్–బెంగళూరుల్లో దేశీయంగా తిరిగింది. అయినా విమానంలోని బంగారాన్ని ఎవరూ గుర్తించలేదు, చివరకు గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నప్పుడు దీనిపై అక్కడి కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు స్మగ్లింగ్ల వెనుక ఒకే సూత్రధారులు ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
విమానాశ్రయంలో రెండు కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం డీఆర్ఐ అధికారులు చేపట్టిన తనిఖీలో భాగంగా...దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన మైక్రోఓవెన్‌ను పరిశీలించారు. అందులోని బ్యాటరీలో మొత్తం 46 వెండి పలకలు కనిపించాయి. వీటి పైపూతను తీసివేయడంతో మొత్తం 2.46 కిలోల బంగారం బయటపడింది. వీటి విలువ సుమారు రూ.66 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో కేజీ బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఇద్దరు ప్రయాణికుల నుంచి డీఆర్ఐ అధికారులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో గురువారం తెల్లవారుజామున గువహటి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. వారి వద్ద వెండి పూతతో ఉన్న రెండు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డీజిల్ స్మాగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..
సాక్షి, కాకినాడ : మినరల్ స్పిరిట్ పేరుతో డీజిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న భారీ రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ అక్రమ దందా దుబాయ్ నుంచి కొనసాగిస్తున్నారు. కాకినాడ, చెన్నై కేంద్రంగా డీజిల్ అక్రమ దందా సాగుతున్నట్లు సమాచారం. దాదాపుగా 12 ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ కంపెనీలు, తప్పుడు డాక్యుమెంట్లతో డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. 40 శాతం ధర తక్కువ చూపించి కస్టమ్స్ డ్యూటీ పన్ను ఎగవేస్తున్నారు. రూ. 17.7 కోట్ల విలువైన 285 కంటైనర్తు దిగుమతి అయినట్లు అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన డీఆర్ఐ బృందం నలుగురిని అరెస్టు చేసింది. అంతేకాక హవాల ఆపరేటర్‌ను కూడా అరెస్టు చేశారు. కోటి విలువైన 14 కంటైనర్ల డీజిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. -
రుస్తుం.. రెండున్నరేళ్లు!
సాక్షి, హైదరాబాద్: అసోం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్ వాసి రుస్తుం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు 2015లో రట్టు చేశారు. రూ.5 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. అప్పటి నుంచి రుస్తుం వాంటెడ్‌గా మారాడు. ఈ కేసు డీఆర్ఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు రుస్తుంను మంగళవారం పట్టుకుంది. అసోం నుంచి ఇతర ప్రాంతాలకు.. నోట్ల రద్దు ముందు వరకు బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిన నకిలీ కరెన్సీని పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుండేవి. ఇక్కడ నిఘా ముమ్మరం కావడంతో అంతర్జాతీయ ముఠాలు పంథా మార్చాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన మరో రాష్ట్రం అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో డీఆర్ఐ నిఘా ముమ్మరం చేయడంతో సద్దాం హోసేన్ వ్యవహారంపై ఉప్పందింది. 2015 సెప్టెంబర్‌లో విశాఖలో అతడిని అరెస్టు చేశారు. కమీషన్ పేరిట వల.. అసోంలోని మణిక్పూర్కు చెందిన హోసేన్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. నిరుద్యోగిగా ఉన్న ఇతడికి పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది. ఫోన్ ద్వారా హోసేన్తో సంప్రదింపులు జరిపిన రుస్తుం.. తాను అందించే ఓ ప్యాకెట్‌ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానని వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్‌కు న్యూఫరాఖా రైల్వేస్టేషన్లో అమ్రుల్ ద్వారా ఓ ప్యాకెట్ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉందని, గువాహటి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. కరెన్సీని బెంగళూరులో ఎవరికి అందించాలనే విషయాన్ని హోసేన్‌కు చెప్పని రస్తుం.. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్ నంబర్లు ఇచ్చాడు. దీంతో రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్ విశాఖలో డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. ఇతడి నుంచి రూ.5.01 లక్షల విలువైన 803 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ, నిరక్షరాస్యులైన యువతకు ఎరవేసి భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ ఆధారాలు సేకరించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ యూనిట్ ముమ్మరంగా గాలింపు చేపట్టింది. నోట్ల రద్దు తర్వాత రుస్తుం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల మళ్లీ మాల్దాలో అతడి కదలికలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారం పాటు వలపన్నిన ప్రత్యేక బృందం మంగళవారం అతడిని పట్టుకుంది. నకిలీ కరెన్సీ నెట్వర్క్ వివరాలు సేకరించి దాన్ని ఛేదించాలని భావిస్తున్న ఎన్ఐఏ.. దీనికోసం రుస్తుంను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. -
స్టౌల్లో కోటిన్నర బంగారం
నెల్లూరు (మినీ బైపాస్): ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌల్లో రూ.కోటిన్నర విలువ చేసే బంగారం అమర్చి రైల్లో తరలిస్తుండగా నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం డీఆర్ఐ అధికారులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా అక్రమంగా రైల్లో బంగారాన్ని రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ఆ శాఖ అధికారులు రైళ్లలో తనిఖీలు చేశారు. ఆదివారం సాయంత్రం గౌహతి నుంచి తాంబరంకు గౌహతి ఎమ్మెస్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు రైల్వేస్టేషన్ చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి వద్ద ఊదా రంగు బ్యాగ్‌లో అల్యూమినియంతో తయారు చేసిన ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌలను కనుగొన్నారు. వాటి బరువు భారీగా ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాటిని పరిశీలించి, వాటిపై ఉన్న ప్లేట్లను తొలగించారు. వాటి కింద ఉన్న మైనపు తొడుగును తొలగించడంతో అందులో దాచిన బంగారం బయటపడింది. రెండు స్టౌల్లో 4 భాగాలుగా బంగారాన్ని తయారు చేసి అమర్చారు. రూ.1.43 కోట్లు విలువ చేసే 4.658 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. అయితే బంగారం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది అధికారులు విచారిస్తున్నారు. -
భారీగా బంగారం పట్టివేత
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు 4 కేజీల 658 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో తనిఖీలు చేయగా రూ. కోటి 43 లక్షల విలువైన బంగారం బయటపడింది. గ్యాస్ స్టౌలో బంగారం నింపి తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టురు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విజయవాడ డీఆర్ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. -
మహారాష్ట్ర టు చెన్నై వయా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తయారీ.. హైదరాబాద్ మీదుగా చెన్నైకి తరలింపు.. కొంతకాలంగా ఇలా యథేచ్ఛగా సాగుతున్న ఓ భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా కారులో మహారాష్ట్ర నుంచి చెన్నై తరలిస్తున్న 46 కేజీల మెథక్వాలోన్(మాన్డ్రాక్స్)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) బృందం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. పేరుకే కారు.. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతీ సుజుకీ బ్రెజా కారులో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోలి టోల్ ప్లాజా వద్ద వారు కాపు కాశారు. పక్కా సమాచారంతో కారును ఆపి.. తనిఖీలు చేశారు. అయితే డిక్కీలోగానీ, సీట్లలోగానీ ఎక్కడా డ్రగ్ దొరకలేదు. దీంతో కారు వెనుకభాగంలో ఉన్న సీట్లను తొలగించి చూస్తే.. వాటి కింది భాగంలో స్టీల్ ప్లేట్‌తో కవర్ చేసిన రెండు రహస్య ప్రాంతాలను గుర్తించారు. వీటిని తెరిచి చూడగా ఒక్కొక్కటీ కేజీ చొప్పున ఉన్న 46 ప్యాకెట్ల మెథక్వాలోన్ కనిపించింది. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా బెంగళూరుకు చెందిన ఓ గ్యాంగ్ ఈ దందా నడుపుతోందని, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా ఓమెర్గాలో డ్రగ్స్ తయారీకి ఫ్యాక్టరీ కూడా ఉందని, ఓ వ్యక్తి ఫ్యాక్టరీ నుంచి కారులో ఇవి లోడ్ చేసి పంపించాడని వెల్లడించారు. డీఆర్ఐ అధికారులు తమ బృందాలను మహారాష్ట్రలోని ఫ్యాక్టరీకి పంపి దాడులు చేయగా డ్రగ్స్ తయారీ ఎక్విప్మెంట్తో పాటు అరకేజీ డ్రగ్స్ దొరికినట్టు తెలిపారు. ప్రధాన నిందితులు పరారయ్యారని, ప్రస్తుతం పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. లైంగిక శక్తిపై ప్రభావం.. మెథక్వాలోన్ డ్రగ్‌ను అధిక పరిమాణంలో తీసు కోవడం వల్ల ప్రధానంగా లైంగిక శక్తిని ప్రేరేపిస్తుందని, అయితే హార్ట్‌బీట్ పెరగడం, గుండెపోటు, కోమాలోకి వెళ్లడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, నరాల బలహీనత కూడా సంభవిస్తాయని వైద్య నిఫుణులు చెపుతున్నారు. ఈ మత్తుకు అలవాటుపడితే వికారం, వాంతులు, కడుపు నొప్పి, మానసిక ఒతిడి తదితర లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. చెన్నై నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు.. బెంగళూరుకు చెందిన గ్యాంగ్ మహారాష్ట్రలో డ్రగ్స్ తయారుచేయడం.. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై ఎందుకు తీసుకెళుతోందనే దానిపై డీఆర్ఐ విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్‌కు ఈ డ్రగ్స్‌కు ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. చెన్నై నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకి పంపేందుకు వీటిని తరలిస్తున్నట్టు అనుమానిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ ఉండటంతో సీపోర్ట్ ద్వారా విదేశాలకు పంపాలని ముఠా ప్రయత్నిç స్తున్నట్టు డీఆర్ఐ వర్గాలు భావిస్తున్నాయి. -
విదేశీ కరెన్సీ అక్రమ రవాణా!
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి దుబాయ్, షార్జాలకు విదేశీ కరెన్సీని అక్రమ రవాణా చేయ డానికి యత్నించిన ఇద్దరికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెక్ చెప్పారు. వీరిచ్చిన సమాచారంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధీనం లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మహారాష్ట్ర వాసుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ప్రధాన రాకెట్లో కమీషన్ తీసుకుని పనిచేసే పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరినీ కస్టమ్స్ అధికారులకు అప్పగించిన డీఆర్ఐ ఈ రాకెట్ మూలాలు అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో లోతుగా ఆరా తీస్తోంది. పక్కా ప్లాన్‌తో.. మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఉల్లాస్‌నగర్‌కు చెం దిన ఓ గ్యాంగ్ దుబాయ్, షార్జాల నుంచి భారీగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లను భారత్‌కు స్మగ్లింగ్ చేస్తోంది. వీటిని అక్కడ ఖరీదు చేయడానికి అవసరమైన విదేశీ కరెన్సీ ఇక్కడే సమకూర్చుకుంటోంది. ఈ రాకెట్ ఇక్కడి నుంచి విదేశీ కరెన్సీని ఆయా దేశాలకు తరలించడానికి, ఖరీదు చేసిన బంగారం, ఇతర వస్తువుల్ని ఇక్కడికి తీసుకురావడానికి కమీషన్ పద్ధతిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. అలాంటి ఏజెం ట్లలో ఉల్లాస్‌నగర్‌కి చెందిన బంటి రామ్నాని, రాజేంద్రప్రసాద్ గుప్త ఉన్నారు. ఈ రాకెట్ ఏ కోణంలోనూ తమపై అనుమానం రాకుండా, ఏ ఆధారాలు చిక్కకుండా పక్కాగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరూ ముంబై నుంచి విదేశీ విమానాలు ఎక్కకుండా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఇద్దరికీ ఆదివారం ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్స్, ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్‌ల్లో హైదరాబాద్ నుంచి దుబాయ్, షార్జాలకు టికెట్లు బుక్ చేసింది. శనివారం అర్ధరాత్రి రామ్నాని, గుప్తలను డొమెస్టిక్ విమానంలో ముంబై నుంచి హైదరాబాద్ పంపింది. రూ. 99 లక్షల విలువైన యూరోలు, డాలర్లను చాకచక్యంగా ప్యాక్ చేసింది. ఈ కరెన్సీని రోల్స్‌గా చుట్టి ఇద్దరి మల ద్వారాలు (రెక్టమ్), ట్రాలీబ్యాగ్స్ హ్యాండిళ్లతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన చెప్పుల అడుగు భాగంలో దాచింది. సోదాల్లో పట్టుబడ్డ నిందితులు ఏజెంట్లు ఇద్దరూ తమ లగేజీతో ఆదివారం ఉదయం శంషాబాద్ విమానా శ్రయం నుంచి దుబాయ్, షార్జాలకు వెళ్లడా నికి విమానం ఎక్కనున్నారని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన డీఆర్ఐ యూనిట్‌కు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో హైదరా బాద్ విమానాశ్రయంలో ఉన్న ఏఐయూ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకు న్నారు. సోదాలు నిర్వహించి రహస్యంగా దాచిన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నా రు. రూ.20 వేల కమీషన్ కోసమే తాము ఈ కరెన్సీని అక్రమ రవాణా చేస్తున్నట్లు నిందితు లు అంగీకరించారు. కస్టమ్స్ అధికారులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. -
శంషాబాద్‌లో 3.8 కిలోల బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానశ్రయంలో ఓ వ్యక్తి నుంచి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ నుంచి సుమారు 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.