
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం డీఆర్‌ఐ అధికారులు చేపట్టిన తనిఖీలో భాగంగా...దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన మైక్రోఓవెన్‌ను పరిశీలించారు.
అందులోని బ్యాటరీలో మొత్తం 46 వెండి పలకలు కనిపించాయి. వీటి పైపూతను తీసివేయడంతో మొత్తం 2.46 కిలోల బంగారం బయటపడింది. వీటి విలువ సుమారు రూ.66 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.