శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోలి టోల్ ప్లాజా వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తయారీ.. హైదరాబాద్ మీదుగా చెన్నైకి తరలింపు.. కొంతకాలంగా ఇలా యథేచ్ఛగా సాగుతున్న ఓ భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా కారులో మహారాష్ట్ర నుంచి చెన్నై తరలిస్తున్న 46 కేజీల మెథక్వాలోన్(మాన్‌డ్రాక్స్)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) బృందం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.
పేరుకే కారు..
కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతీ సుజుకీ బ్రెజా కారులో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. శనివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోలి టోల్ ప్లాజా వద్ద వారు కాపు కాశారు. పక్కా సమాచారంతో కారును ఆపి.. తనిఖీలు చేశారు. అయితే డిక్కీలోగానీ, సీట్లలోగానీ ఎక్కడా డ్రగ్ దొరకలేదు. దీంతో కారు వెనుకభాగంలో ఉన్న సీట్లను తొలగించి చూస్తే.. వాటి కింది భాగంలో స్టీల్ ప్లేట్‌తో కవర్ చేసిన రెండు రహస్య ప్రాంతాలను గుర్తించారు. వీటిని తెరిచి చూడగా ఒక్కొక్కటీ కేజీ చొప్పున ఉన్న 46 ప్యాకెట్ల మెథక్వాలోన్ కనిపించింది. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా బెంగళూరుకు చెందిన ఓ గ్యాంగ్ ఈ దందా నడుపుతోందని, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా ఓమెర్గాలో డ్రగ్స్ తయారీకి ఫ్యాక్టరీ కూడా ఉందని, ఓ వ్యక్తి ఫ్యాక్టరీ నుంచి కారులో ఇవి లోడ్ చేసి పంపించాడని వెల్లడించారు. డీఆర్‌ఐ అధికారులు తమ బృందాలను మహారాష్ట్రలోని ఫ్యాక్టరీకి పంపి దాడులు చేయగా డ్రగ్స్ తయారీ ఎక్విప్‌మెంట్‌తో పాటు అరకేజీ డ్రగ్స్ దొరికినట్టు తెలిపారు. ప్రధాన నిందితులు పరారయ్యారని, ప్రస్తుతం పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
లైంగిక శక్తిపై ప్రభావం..
మెథక్వాలోన్ డ్రగ్‌ను అధిక పరిమాణంలో తీసు కోవడం వల్ల ప్రధానంగా లైంగిక శక్తిని ప్రేరేపిస్తుందని, అయితే హార్ట్‌బీట్ పెరగడం, గుండెపోటు, కోమాలోకి వెళ్లడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, నరాల బలహీనత కూడా సంభవిస్తాయని వైద్య నిఫుణులు చెపుతున్నారు. ఈ మత్తుకు అలవాటుపడితే వికారం, వాంతులు, కడుపు
నొప్పి, మానసిక ఒతిడి తదితర లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు.
చెన్నై నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు..
బెంగళూరుకు చెందిన గ్యాంగ్ మహారాష్ట్రలో డ్రగ్స్ తయారుచేయడం.. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై ఎందుకు తీసుకెళుతోందనే దానిపై డీఆర్‌ఐ విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్‌కు ఈ డ్రగ్స్‌కు ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. చెన్నై నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి పంపేందుకు వీటిని తరలిస్తున్నట్టు అనుమానిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ ఉండటంతో సీపోర్ట్ ద్వారా విదేశాలకు పంపాలని ముఠా ప్రయత్నిç స్తున్నట్టు డీఆర్‌ఐ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment