నెల్లూరు (మినీ బైపాస్): ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌల్లో రూ.కోటిన్నర విలువ చేసే బంగారం అమర్చి రైల్లో తరలిస్తుండగా నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం డీఆర్‌ఐ అధికారులు మీడియాకు వివరాలు తెలియజేశారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా అక్రమంగా రైల్లో బంగారాన్ని రవాణా చేస్తున్నారని డీఆర్‌ఐ అధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ఆ శాఖ అధికారులు రైళ్లలో తనిఖీలు చేశారు. ఆదివారం సాయంత్రం గౌహతి నుంచి తాంబరంకు గౌహతి ఎమ్మెస్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు రైల్వేస్టేషన్ చేరుకుంది.
తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి వద్ద ఊదా రంగు బ్యాగ్‌లో అల్యూమినియంతో తయారు చేసిన ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌలను కనుగొన్నారు. వాటి బరువు భారీగా ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాటిని పరిశీలించి, వాటిపై ఉన్న ప్లేట్లను తొలగించారు.
వాటి కింద ఉన్న మైనపు తొడుగును తొలగించడంతో అందులో దాచిన బంగారం బయటపడింది. రెండు స్టౌల్లో 4 భాగాలుగా బంగారాన్ని తయారు చేసి అమర్చారు. రూ.1.43 కోట్లు విలువ చేసే 4.658 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. అయితే బంగారం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది అధికారులు విచారిస్తున్నారు.
స్టౌల్లో కోటిన్నర బంగారం
Published Tue, Feb 6 2018 1:22 AM | Last Updated on Tue, Feb 6 2018 1:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment