ప్రతీకాత్మక చిత్రం
పిడుగురాళ్ల: మద్యం దుకాణంలో సుమారు రూ.50 లక్షలు గోల్‌మాల్ అయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని చెక్‌పోస్టు ఎదురుగా గల ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజులుగా లెక్కలు సక్రమంగా లేకపోవడాన్ని ఎస్‌ఈబీ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఎస్‌ఈబీ సీఐ బాషా ఆధ్వర్యంలో ఆ మద్యం దుకాణాన్ని పరిశీలించి స్టాక్‌ను తనిఖీ చేసి రూ.49,63,737 విలువ గల మద్యం సీసాలు మాయమైనట్టు నిర్ధారించారు. సీఐ బాషా మాట్లాడుతూ.. ఈ మద్యం షాపులో పని చేస్తున్న సూపర్‌వైజర్, ఓ సేల్స్‌మేన్ కనిపించలేదని చెప్పారు.
మిగిలిన ఇద్దరు సేల్స్‌మెన్‌లను విచారించామని చెప్పారు. 20 రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. షాపు సూపర్‌వైజర్ విజయ్ అందుబాటులో లేడని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అతన్నీ అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరమే గోల్‌మాల్‌కు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ అవినీతిలో కొందరు ఎస్‌ఈబీ సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో విచారణ పూర్తి చేసి నిందితులపై క్రిమినల్ కేసులు, ఆర్‌ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment