Government liquor stores
-
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
Fact Check: అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఓ పార్టీ నేత చేసిన ఆరోపణలను సోమవారం ఓ ప్రకటనలో ఖండించింది. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టామని.. సక్రమంగా అమలవుతోందని వెల్లడించింది. మద్యం నియంత్రణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని కూడా పేర్కొంది. కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహిస్తుండగా మరికొన్ని దుకాణాల్లో ఎస్బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. జూలై 8న ఒక్కరోజే అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం 67,818 డిజిటల్ చెల్లింపులు చేశారు. దాదాపు రూ.1.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను డిజిటల్ చెల్లింపుల ద్వారానే నిర్వహించారు. నగదు చెల్లింపులకు అనుమతి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులతో పాటు నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. పేదలు తక్కువ ధర ఉన్న మద్యం కొనుగోలు చేసేందుకు గాను నగదు చెల్లింపులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు స్మార్ట్ ఫోన్లు, యూపీఐ యాప్‌లు ఉండవు. అందువల్ల నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. -
మద్యం షాపులో రూ.50 లక్షల గోల్మాల్
పిడుగురాళ్ల: మద్యం దుకాణంలో సుమారు రూ.50 లక్షలు గోల్మాల్ అయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని చెక్‌పోస్టు ఎదురుగా గల ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజులుగా లెక్కలు సక్రమంగా లేకపోవడాన్ని ఎస్ఈబీ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఎస్ఈబీ సీఐ బాషా ఆధ్వర్యంలో ఆ మద్యం దుకాణాన్ని పరిశీలించి స్టాక్‌ను తనిఖీ చేసి రూ.49,63,737 విలువ గల మద్యం సీసాలు మాయమైనట్టు నిర్ధారించారు. సీఐ బాషా మాట్లాడుతూ.. ఈ మద్యం షాపులో పని చేస్తున్న సూపర్వైజర్, ఓ సేల్స్‌మేన్ కనిపించలేదని చెప్పారు. మిగిలిన ఇద్దరు సేల్స్మెన్లను విచారించామని చెప్పారు. 20 రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. షాపు సూపర్వైజర్ విజయ్ అందుబాటులో లేడని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అతన్నీ అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరమే గోల్‌మాల్‌కు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ అవినీతిలో కొందరు ఎస్ఈబీ సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో విచారణ పూర్తి చేసి నిందితులపై క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. -
మద్యం దుకాణాల్లో స్టాక్ ఆడిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, డిపోలలో స్టాక్ ఆడిట్ చేయాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రతి నెలా ఈ స్టాక్ ఆడిట్ నిర్వహిస్తారు. అందుకోసం మూడు సంస్థలను ఎంపిక చేశారు. డిపోలను ఓ సంస్థ ఆడిట్ చేస్తే.. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఆడిట్ నిర్వహిస్తాయి. బేవరేజస్ సంస్థల నుంచి డిపోలకు వస్తున్న నిల్వలు, అక్కడ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అవుతున్న వాటిని సెంట్రల్ డిపో నుంచే ఆడిట్ చేస్తారు. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని 2,975 ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి స్టాక్ ఆడిట్ నిర్వహిస్తాయి. ఆ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం, అక్కడి విక్రయాలు, ఇంకా అందుబాటులో ఉన్న నిల్వలను తనిఖీ చేస్తాయి. రికార్డులను పరిశీలిస్తాయి. ఈ విధంగా మద్యం డిపోలు, దుకాణాల్లోని స్టాక్ ఆడిట్ మొత్తాన్ని పరిశీలించి విక్రయాలు సక్రమంగా సాగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. అవకతవకలను గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. -
కాపలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు!
నూజివీడు: ఓ పోలీస్ దొంగలా మారాడు. పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తుకు కాపాలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ జనార్దన్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించిన నగదు సుమారు రూ.16 లక్షలను గత నెల చివరి వారంలో బ్యాంకులకు సెలవులు కావడంతో పోలీస్‌స్టేషన్‌లోని ఓ పెట్టెలో భద్రపరిచారు. దాని తాళాలను ఆయన వద్దే ఉంచారు. అయితే ఈ నగదుతో పాటు, వేరే కేసులో రికవరీ చేసిన నగలను కూడా తీసుకుని 29వ తేదీ రాత్రి జనార్దన్ వెళ్లిపోయాడు. అతను వెళ్లిన రెండు రోజుల తర్వాత విషయం వెలుగు చూడటంతో సీఐ వెంకటనారాయణ, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లిన కానిస్టేబుల్ స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీపురం కావడంతో అక్కడకు ఒక బృందం వెళ్లింది. జనార్దన్ తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. ఈ సంఘటనపై సీఐ వెంకటనారాయణను వివరణ కోరగా.. కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. సొత్తు తీసుకుని వెళ్లాడా, లేక ఇంకెక్కడైనా దాచాడా.. అనే విషయం అతను దొరికితేగానీ తెలియదన్నారు. -
మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అద్దె టెండర్లలో గోల్మాల్ కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు. విజయవాడలో రూ.లక్షల్లో అద్దె విజయవాడలో గతంలో లిక్కర్ మార్ట్లు నిర్వహించిన చోట ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. -
1,095 మద్యం దుకాణాలు రద్దు!
సాక్షి, అమరావతి : ఈ ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న నూతన మద్యం విధానంపై నిర్ణయాన్ని దాదాపు ఖరారు చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలని ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదిలావుంటే.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం పాలసీలను ఎక్సైజ్ అధికారుల బృందాలు ఇటీవలే అధ్యయనం చేశాయి. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంఎం నాయక్‌కు గురువారం నివేదికలు సైతం అందజేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు మద్యం షాపుల్ని నిర్వహిస్తున్న తీరును పరిశీలించిన అధికారులు సుదీర్ఘ నివేదికలను అందించగా, ఎక్సైజ్ కమిషనర్ వాటిని ప్రభుత్వానికి పంపించారు. కేరళలో 306 దుకాణాలే కేరళ రాష్ట్రంలో కేవలం 306 మద్యం షాపులు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో 36, ప్రభుత్వ అధీనంలో 270 దుకాణాలు ఉన్నాయి. కేరళలోని నగరాల్లో వాకింగ్ షాపుల ద్వారానే అధికంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇదిలావుంటే.. తమిళనాడులో అమలవుతున్న మద్యం పాలసీనే ఇంచుమించు ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడులోనూ అక్కడి ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిద్వారా 26,056 మందికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి దుకాణాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 5,152 మద్యం షాపులు, 1,872 బార్లను తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. అక్కడ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీలలో షాపునకు ఓ సూపర్వైజర్ చొప్పున ఉంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని దుకాణాల్లో సేల్స్‌మెన్, అసిస్టెంట్ సేల్స్మెన్లు నలుగురు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ముగ్గురు, పంచాయతీలలో ఇద్దరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. 25 శాతం దుకాణాలు కుదింపు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 25 శాతం తగ్గించాలని ప్రాథమికంగా నిర్థారించారు. మన రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. ఈ ఏడాది జూన్ నెలాఖరుతో లైసెన్స్ కాల పరిమితి ముగిసింది. మూడు నెలల పాటు లైసెన్స్ పొడిగించగా.. 700 దుకాణదారులు లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోలేదు. నూతన విధానం ప్రకారం 4,380 మద్యం షాపుల్లో 25 శాతం అంటే.. కనీసం 1,095 షాపులను తగ్గించే యోచనలో ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే మద్యం దుకాణాలు ఉంటాయని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై జిల్లాల వారీగా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు పరిశీలన జరుపుతున్నారు. -
మద్యం సిండికేట్లతో ఎక్సైజ్ మిలాఖత్
మద్యం సిండికేట్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీ ఆచరణలో విఫలమవుతోంది. ఎమ్మార్పీకి మద్యం విక్రయించేందుకు ప్రతి మండలానికి ఏర్పాటుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం సిండికేట్ల కనుసన్నల్లో నడుస్తున్నాయి. వీటిలో డిమాండ్ ఉన్న బ్రాండ్ల మద్యాన్ని విక్రయించకపోవడంతో అధిక ధరలకు విక్రయిస్తూ సిండికేట్లు దోచుకుంటున్నారు. - మొక్కుబడిగా ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ - కానరాని డిమాండ్ బ్రాండ్లు, ఎమ్మార్పీ బోర్డులు - మద్యం వ్యాపారుల కనుసన్నల్లో అధికారులు - సిండికేట్ల దోపిడీకి సహకారం మాకవరపాలెం : జిల్లాలో మండలానికొకటి చొప్పున ఏర్పాటుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మొక్కుబడిగా ఉన్నాయి. ఈ దుకాణాల్లో డిమాండ్‌లేని మద్యం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో ఎమ్మార్పీకే మద్యం కొనుక్కోవచ్చునన్న మద్యం ప్రియులకు నిరాశే మిగిలింది. నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం మండలాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు. వీటిని అధికారులు కేవలం సాదాసీదాగానే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం ప్రభుత్వ దుకాణలనే బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. డిమాండ్ లేని బ్రాండ్లే విక్రయాలు ప్రభుత్వ దుకాణాల్లో డిమాండ్ లేని బ్రాండ్లనే విక్రయిస్తున్నారు. మద్యంలో సుమారు 27 రకాల బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో కేవలం పది రకాల బ్రాండ్లు కూడా ఈ ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం లేదు. తక్కువ ధరలు ఉండే ఛీప్ మద్యం మాత్రమే ఉంటోంది. ఎమ్మార్పీకి మద్యం పొందవచ్చునని ప్రభుత్వ దుకాణాల దగ్గరకు వస్తున్న వారు ఇక్కడ అమ్మే మద్యాన్ని చూసి కంగుతింటున్నారు. దీంతోపాటు దుకాణంలో ఉన్న బ్రాండ్లు, ఎమ్మార్పీకి సంబంధించి బోర్డులను ఏర్పాటుచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఇదంతా స్థానికంగా ఉన్న మద్యం సిండికేట్లతో ఎక్సైజ్ అధికారులు మిలాఖత్ అయి డిమాండ్ లేని బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ విధానానికి తూట్లు మద్యం ఉకాణాల్లో అత్యధికంగా పది రకాల బ్రాండ్లకు డిమాండ్ ఉంది. వీటిలో ఒక్క బ్రాండు కూడా ప్రభుత్వ దుకాణంలో ఉండటం లేదు. ప్రస్తుతం ఉన్న 27 రకాల మద్యం బ్రాండ్లలో ప్రధానంగా ఐబీ, ఏసీపీ, ఓసీ, జీఆర్, ఎంసీవిస్కీ, బ్రాందీ, ఎంమెచ్ బ్రాంది, రమ్, బీజర్, బ్లెండర్‌స్పైడ్, రాయల్ స్టాగ్, నాకౌట్, కింగ్‌ఫిషర్ బీర్లకు డిమాండ్ ఉంది. కానీ ఈ బ్రాండ్లు ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం లేదు. ఇక బీర్లు పెద్దవి కాకుండా చిన్న బీర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. డిమాండ్ ఉన్న అన్ని రకాల బ్రాండ్ల మద్యం ప్రైవేటు షాపుల్లో పుష్కలంగా లభిస్తుంది. ఎమ్మార్పీకి ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయిస్తే ప్రైవేట్ దుకాణాలకు మందుబాబులు వెళ్లరన్న కారణంతో సిండికేట్ల ఒత్తిడికి ఎక్సైజ్ అధికారులు తలొగ్గి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. -
ప్రభుత్వ మద్యం దుకాణాలకు మోకాలడ్డు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో ప్రభుత్వమే ఆయా దుకాణాలను (అవుట్లెట్లు) నిర్వహించాలని చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యాయి. అద్దె గదులు లభించడం లేదన్న సాకుతో దుకాణాల ఏర్పాటులో ఎక్సైజ్ శాఖాధికారులే జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. గతంలో సీల్డ్ టెండర్ల ద్వారా మద్యం షాపులకు లెసైన్స్‌లు కేటాయించే ప్రభుత్వం ఇటీవల ఒక్కొక్క ప్రాంతానికి జనాభా దామాషా ప్రకారం కొంత మొత్తాన్ని ఏడాదికి లెసైన్స్ ఫీజుగా చెల్లించాలని నిబంధనలు విధించింది. ఈ నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుచేస్తే ఆదాయం కాదుకదా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని దుకాణాలకు అసలు ఏ ఒక్కరుకూడా ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయిల్ కంపెనీల వారు సొంతంగా నిర్వహించే అవుట్లెట్ల మాదిరిగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు మద్యం షాపులను నిర్వహించేందుకు పూనుకున్నారు. నిర్ణయమైతే తీసుకున్నారు కానీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవసరమయ్యే అద్దె గదులను ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది గుర్తిస్తే అందులో మద్యం షాపులను నిర్వహించే బాధ్యత ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వారిది. అయితే కొద్దిమంది ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది నెలవారీ మామూళ్లు ఇచ్చే మద్యం దుకాణాల వారికి తమవంతు సాయం చేస్తూ అవుట్‌లె ట్లు ఏర్పాటు కాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవసరమయ్యే గది, నిబంధనల మేరకు అందులో గ్రిల్స్ ఏర్పాటు, మద్యం బాటిళ్లు పెట్టుకునేందుకు అవసరమయ్యే రాక్లు, బీరు బాటిళ్లు ఉంచుకునేందుకు ఫ్రిజ్, క్యాషియర్ కూర్చునేందుకు టేబుల్, కుర్చీ, తదితర అవసరమైన సామగ్రి మొత్తాన్ని దుకాణం యజమాని ఏర్పాటుచేసి వీటన్నింటికీ కలిపి అద్దె నిర్ణయిస్తారు. ఆ ధరలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే అక్కడ ప్రభుత్వ అవుట్లెట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను సంబంధిత బెవరేజెస్ కార్పొరేషన్ వారు పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చేశారు. ఆసక్తి కలిగిన యజమానులు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బంది ఆయా దుకాణాలను గుర్తించి వాటిని తమకు అద్దెకు ఇచ్చేందుకు యజమానులను ఒప్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ తతంగాన్నంతా గాలికి వదిలి ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలకు అటు ఇటు ఉండే మద్యం షాపులు, బార్ల యజమానులకు ఎక్సైజ్ అధికారులే ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. ‘మేము గానీ దుకాణాలు పెడితే ఇక మీపని గోవిందా’...అంటూ వారిని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల వారైతే నెల మామూళ్లిస్తారు. అదే ప్రభుత్వ దుకాణాలైతే వారి నోట్లో మట్టి పడినట్లే. ప్రభుత్వమే అవుట్లెట్లు ఏర్పాటుచేస్తే అక్కడ లూజు విక్రయాలుండవు. ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తారు. దీంతో మందుబాబులంతా అక్కడ కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతారు. జిల్లాలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు (అవుట్లెట్లు) నిర్వహించాలని మొత్తం 43 ప్రాంతాలను గుర్తించగా కేవలం ఒక్కటంటే ఒక్కటి (బేస్తవారిపేట) మాత్రమే భర్తీ అయింది. ఒంగోలు పట్టణం అన్నవరప్పాడులో గతేడాది కాలంగా ఒక మద్యం దుకాణాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మళ్లీ లెసైన్స్ ఫీజు గడువు రద్దయ్యే సమయం వస్తున్నప్పటికీ ఆ 42 ప్రాంతాలు అలాగే ఖాళీగానే ఉన్నాయే తప్ప వాటిని త్వరితగతిన భర్తీ చేయాలనే ఆలోచన, తపన ఆ శాఖ అధికారులు, సిబ్బందిలో ఏమాత్రం కనిపించడంలేదు. అయితే తమవంతు కృషి చేస్తున్నప్పటికీ మద్యం దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని సంబంధిత అధికారులు చెప్తున్నారు. మద్యం అవుట్లెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలివే.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 321 మద్యం దుకాణాలకు గాను ప్రస్తుతం 279 మాత్రమే నడుస్తున్నాయి. ఒంగోలు నగరంలోని 12వ వార్డులో ఒకటి, యరజర్ల, వల్లూరు, ఉలిచి, ఎం.నిడమానూరు, బి.నిడమానూరు, కనపర్తి, తిమ్మసముద్రం, సంతనూతలపాడు, పల్లామల్లి, రామతీర్థం, చీరాల మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డులో ఒకటి, 14వ వార్డులో 2, 15వ వార్డులో 2, 21వ వార్డులో 1, జాండ్రపేట, వాడరేవు, కొండమంజులూరు, మేదరమెట్ల, పూనూరు, సాలిపేట, చుండి, సింగరాయకొండలో 3, జరుగుమల్లి, పెదారికట్ల, బొద్దికూరపాడు, లక్కవరం, కురిచేడులో 2, దర్శిగుంటపేట, గణేశునిపల్లి, నందనవనం, మొగళ్లూరు, పెదఅలవలపాడు, వేపగుంపల్లి, కొమరోలుల్లో మద్యం అవుట్లెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.14 కోట్లకు పైగానే గండి.. ప్రభుత్వ నిబంధనల మేరకు 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఏడాదికి రూ. 32.50 లక్షలు, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 34 లక్షలు, లక్ష పైన మూడు లక్షలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 42 లక్షల లెసైన్స్ ఫీజును దుకాణదారులు చెల్లించాలి. ఈ ప్రకారం కొద్ది నెలలుగా జిల్లాలో 42 కేంద్రాల్లో దుకాణాలు ఏర్పాటు చేయనందువల్ల ప్రభుత్వానికి రమారమి రూ. 14 కోట్లకు పైగా రావాల్సిన ఆదాయానికి గండి పడినట్లే. జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బాక్స్ ఏర్పాటు: ఐఎంఎల్ డిపో మేనేజర్ శ్రీనివాసరావు మద్యం దుకాణాల అవుట్లెట్ల ఏర్పాటుకు దుకాణాలను అద్దెకు ఇచ్చే వారి కోసం పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు ఒక ప్రత్యేక బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశామని ఒంగోలు ఐఎంఎల్ డిపో మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా తమను కూడా సంప్రదించవచ్చన్నారు.