మద్యం సిండికేట్లతో ఎక్సైజ్ మిలాఖత్
మద్యం సిండికేట్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీ ఆచరణలో విఫలమవుతోంది. ఎమ్మార్పీకి మద్యం విక్రయించేందుకు ప్రతి మండలానికి ఏర్పాటుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం సిండికేట్ల కనుసన్నల్లో నడుస్తున్నాయి. వీటిలో డిమాండ్ ఉన్న బ్రాండ్ల మద్యాన్ని విక్రయించకపోవడంతో అధిక ధరలకు విక్రయిస్తూ సిండికేట్లు దోచుకుంటున్నారు.
- మొక్కుబడిగా ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ
- కానరాని డిమాండ్ బ్రాండ్లు, ఎమ్మార్పీ బోర్డులు
- మద్యం వ్యాపారుల కనుసన్నల్లో అధికారులు
- సిండికేట్ల దోపిడీకి సహకారం
మాకవరపాలెం : జిల్లాలో మండలానికొకటి చొప్పున ఏర్పాటుచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మొక్కుబడిగా ఉన్నాయి. ఈ దుకాణాల్లో డిమాండ్‌లేని మద్యం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో ఎమ్మార్పీకే మద్యం కొనుక్కోవచ్చునన్న మద్యం ప్రియులకు నిరాశే మిగిలింది. నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం మండలాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు. వీటిని అధికారులు కేవలం సాదాసీదాగానే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం ప్రభుత్వ దుకాణలనే బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
డిమాండ్ లేని బ్రాండ్లే విక్రయాలు
ప్రభుత్వ దుకాణాల్లో డిమాండ్ లేని బ్రాండ్లనే విక్రయిస్తున్నారు. మద్యంలో సుమారు 27 రకాల బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో కేవలం పది రకాల బ్రాండ్లు కూడా ఈ ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం లేదు. తక్కువ ధరలు ఉండే ఛీప్ మద్యం మాత్రమే ఉంటోంది. ఎమ్మార్పీకి మద్యం పొందవచ్చునని ప్రభుత్వ దుకాణాల దగ్గరకు వస్తున్న వారు ఇక్కడ అమ్మే మద్యాన్ని చూసి కంగుతింటున్నారు. దీంతోపాటు దుకాణంలో ఉన్న బ్రాండ్లు, ఎమ్మార్పీకి సంబంధించి బోర్డులను ఏర్పాటుచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఇదంతా స్థానికంగా ఉన్న మద్యం సిండికేట్లతో ఎక్సైజ్ అధికారులు మిలాఖత్ అయి డిమాండ్ లేని బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎక్సైజ్ విధానానికి తూట్లు
మద్యం ఉకాణాల్లో అత్యధికంగా పది రకాల బ్రాండ్లకు డిమాండ్ ఉంది. వీటిలో ఒక్క బ్రాండు కూడా ప్రభుత్వ దుకాణంలో ఉండటం లేదు. ప్రస్తుతం ఉన్న 27 రకాల మద్యం బ్రాండ్లలో ప్రధానంగా ఐబీ, ఏసీపీ, ఓసీ, జీఆర్, ఎంసీవిస్కీ, బ్రాందీ, ఎంమెచ్ బ్రాంది, రమ్, బీజర్, బ్లెండర్‌స్పైడ్, రాయల్ స్టాగ్, నాకౌట్, కింగ్‌ఫిషర్ బీర్లకు డిమాండ్ ఉంది. కానీ ఈ బ్రాండ్లు ప్రభుత్వ దుకాణాల్లో ఉండటం లేదు. ఇక బీర్లు పెద్దవి కాకుండా చిన్న బీర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. డిమాండ్ ఉన్న అన్ని రకాల బ్రాండ్ల మద్యం ప్రైవేటు షాపుల్లో పుష్కలంగా లభిస్తుంది. ఎమ్మార్పీకి ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయిస్తే ప్రైవేట్ దుకాణాలకు మందుబాబులు వెళ్లరన్న కారణంతో సిండికేట్ల ఒత్తిడికి ఎక్సైజ్ అధికారులు తలొగ్గి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు.