ప్రభుత్వ మద్యం దుకాణాలకు మోకాలడ్డు | Government liquor stores delays | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మద్యం దుకాణాలకు మోకాలడ్డు

Published Sat, Nov 16 2013 4:02 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Government liquor stores delays

సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో ప్రభుత్వమే ఆయా దుకాణాలను (అవుట్‌లెట్లు) నిర్వహించాలని చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యాయి. అద్దె గదులు లభించడం లేదన్న సాకుతో దుకాణాల ఏర్పాటులో ఎక్సైజ్ శాఖాధికారులే జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి  రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. గతంలో సీల్డ్ టెండర్ల ద్వారా మద్యం షాపులకు లెసైన్స్‌లు కేటాయించే ప్రభుత్వం ఇటీవల ఒక్కొక్క ప్రాంతానికి జనాభా దామాషా ప్రకారం కొంత మొత్తాన్ని ఏడాదికి లెసైన్స్ ఫీజుగా చెల్లించాలని నిబంధనలు విధించింది. ఈ నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుచేస్తే ఆదాయం కాదుకదా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని దుకాణాలకు అసలు ఏ ఒక్కరుకూడా ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలనే నిర్ణయానికి వచ్చింది. ఆయిల్ కంపెనీల వారు సొంతంగా నిర్వహించే అవుట్‌లెట్ల మాదిరిగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు మద్యం షాపులను నిర్వహించేందుకు పూనుకున్నారు.
 
 నిర్ణయమైతే తీసుకున్నారు కానీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవసరమయ్యే అద్దె గదులను ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది గుర్తిస్తే అందులో మద్యం షాపులను నిర్వహించే బాధ్యత ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వారిది. అయితే కొద్దిమంది ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది నెలవారీ మామూళ్లు ఇచ్చే మద్యం దుకాణాల వారికి తమవంతు సాయం చేస్తూ అవుట్‌లె ట్లు ఏర్పాటు కాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవసరమయ్యే గది, నిబంధనల మేరకు అందులో గ్రిల్స్ ఏర్పాటు, మద్యం బాటిళ్లు పెట్టుకునేందుకు అవసరమయ్యే రాక్‌లు, బీరు బాటిళ్లు ఉంచుకునేందుకు ఫ్రిజ్, క్యాషియర్ కూర్చునేందుకు టేబుల్, కుర్చీ, తదితర అవసరమైన సామగ్రి మొత్తాన్ని దుకాణం యజమాని ఏర్పాటుచేసి వీటన్నింటికీ కలిపి అద్దె నిర్ణయిస్తారు. ఆ ధరలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే అక్కడ ప్రభుత్వ అవుట్‌లెట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను సంబంధిత బెవరేజెస్ కార్పొరేషన్ వారు పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చేశారు.
 
 ఆసక్తి కలిగిన యజమానులు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బంది ఆయా దుకాణాలను గుర్తించి వాటిని తమకు అద్దెకు ఇచ్చేందుకు యజమానులను ఒప్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ తతంగాన్నంతా గాలికి వదిలి ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలకు అటు ఇటు ఉండే మద్యం షాపులు, బార్ల యజమానులకు ఎక్సైజ్ అధికారులే ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. ‘మేము గానీ దుకాణాలు పెడితే ఇక మీపని గోవిందా’...అంటూ వారిని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల వారైతే నెల మామూళ్లిస్తారు. అదే ప్రభుత్వ దుకాణాలైతే వారి నోట్లో మట్టి పడినట్లే.  ప్రభుత్వమే అవుట్‌లెట్లు ఏర్పాటుచేస్తే అక్కడ లూజు విక్రయాలుండవు. ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తారు. దీంతో మందుబాబులంతా అక్కడ కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతారు.
 జిల్లాలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు (అవుట్‌లెట్లు) నిర్వహించాలని మొత్తం 43 ప్రాంతాలను గుర్తించగా కేవలం ఒక్కటంటే ఒక్కటి (బేస్తవారిపేట) మాత్రమే భర్తీ అయింది. ఒంగోలు పట్టణం అన్నవరప్పాడులో గతేడాది కాలంగా ఒక మద్యం దుకాణాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మళ్లీ లెసైన్స్ ఫీజు గడువు రద్దయ్యే సమయం వస్తున్నప్పటికీ ఆ 42 ప్రాంతాలు అలాగే ఖాళీగానే ఉన్నాయే తప్ప వాటిని త్వరితగతిన భర్తీ చేయాలనే ఆలోచన, తపన ఆ శాఖ అధికారులు, సిబ్బందిలో ఏమాత్రం కనిపించడంలేదు. అయితే తమవంతు కృషి చేస్తున్నప్పటికీ మద్యం దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని సంబంధిత అధికారులు చెప్తున్నారు.
 
 మద్యం అవుట్‌లెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలివే..
 జిల్లా వ్యాప్తంగా మొత్తం 321 మద్యం దుకాణాలకు గాను ప్రస్తుతం 279 మాత్రమే నడుస్తున్నాయి. ఒంగోలు నగరంలోని 12వ వార్డులో ఒకటి, యరజర్ల, వల్లూరు, ఉలిచి, ఎం.నిడమానూరు, బి.నిడమానూరు, కనపర్తి, తిమ్మసముద్రం, సంతనూతలపాడు, పల్లామల్లి, రామతీర్థం, చీరాల మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డులో ఒకటి, 14వ వార్డులో 2, 15వ వార్డులో 2, 21వ వార్డులో 1, జాండ్రపేట, వాడరేవు, కొండమంజులూరు, మేదరమెట్ల, పూనూరు, సాలిపేట, చుండి, సింగరాయకొండలో 3, జరుగుమల్లి, పెదారికట్ల, బొద్దికూరపాడు, లక్కవరం, కురిచేడులో 2, దర్శిగుంటపేట, గణేశునిపల్లి, నందనవనం, మొగళ్లూరు, పెదఅలవలపాడు, వేపగుంపల్లి, కొమరోలుల్లో మద్యం అవుట్‌లెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
 రూ.14 కోట్లకు పైగానే గండి..
 ప్రభుత్వ నిబంధనల మేరకు 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఏడాదికి రూ. 32.50 లక్షలు, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 34 లక్షలు, లక్ష పైన మూడు లక్షలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 42 లక్షల లెసైన్స్ ఫీజును దుకాణదారులు చెల్లించాలి. ఈ ప్రకారం కొద్ది నెలలుగా జిల్లాలో 42 కేంద్రాల్లో దుకాణాలు ఏర్పాటు చేయనందువల్ల ప్రభుత్వానికి రమారమి రూ. 14 కోట్లకు పైగా  రావాల్సిన ఆదాయానికి గండి పడినట్లే.
 
 జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బాక్స్ ఏర్పాటు:
 ఐఎంఎల్ డిపో మేనేజర్ శ్రీనివాసరావు
 మద్యం దుకాణాల అవుట్‌లెట్ల ఏర్పాటుకు దుకాణాలను అద్దెకు ఇచ్చే వారి కోసం పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు ఒక ప్రత్యేక బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశామని ఒంగోలు ఐఎంఎల్ డిపో మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా తమను కూడా సంప్రదించవచ్చన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement