మద్యం దుకాణం
రోజంతా కష్టపడి ఆ కష్టాన్ని మరిచి పోయేందుకు కొందరు తాగుతున్న మద్యం మకిలీగా మారింది. జిల్లాలో ప్రధానంగా చీరాల్లోనే కల్తీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. చాలా మద్యం దుకాణాలు అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉండటంతో అడిగేవారెవరూ లేకపోవడంతో నకిలీ మద్యం పరవళ్లు తొక్కుతోంది. 24 గంటలూ మద్యం దుకాణాలు బార్లా తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం దరువు చందంగా కనీసం మంచినీరు దొరక్కునా మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తే తమవి అధికార పార్టీ నేతలకు సంబంధించిన షాపులని యథేచ్ఛగా బెదింపులకు దిగుతున్నారు. చీరాల సబ్‌డివిజన్‌లో 37 వైన్ షాపులు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.
ప్రకాశం, చీరాల:మద్యం దుకాణాల్లో క్వార్టర్ రాయల్‌స్టాగ్ రూ.160, మ్యాన్షన్ హౌస్ రూ.130, సిగ్నేచర్ రూ.220, బ్లాక్‌డాగ్ రూ.375, బ్లెండర్ స్ప్రైడ్ రూ.220, బ్లాక్ గోల్డ్ రూ.170 మార్పిస్ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకే అమ్మకాలు చేస్తుండటంతో మద్యం వ్యాపారులు కల్తీకి అలవాటు పడ్డారు. ఖరీదు మద్యం బాటిళ్లలో క్వార్టర్ రూ.50లు విలువ చేసే చీప్ లిక్కర్‌ను కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల్లోని అన్నీ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. అధిక ధరలు ఉన్న మద్యం బాటిళ్లల్లో హెచ్‌డీ, ఓటీతో పాటు కొన్ని బ్రాండ్లలో మంచినీరు పోసి విక్రయాలు చేస్తున్నారు. క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిళ్లలో మరింత కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా కలుపుతున్నారు.
కథ నడిపేది వీరే..
మద్యం దుకాణాల్లో కౌంటర్‌లో పనిచేసే వారే కల్తీ చేయడంలో సిద్ధ హస్తులు. ఫుల్ బాటిల్‌లో క్వార్టర్ మద్యాన్ని తీసేందుకు రబ్బరు ట్యూబుతో ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రం ద్వారా సీల్ తీసి బాటిల్‌లోని మద్యం తీసేసి అందులో చీప్ లిక్కర్, వాటర్ కలిపి యథాస్థానంలో బాటిళ్లు ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. తమ లాభాలు, బేటాల కోసం దుకాణం నిర్వహకులు, అటెండర్లతో కలిసి అక్రమాలు చేస్తున్నారు.
కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు
చీరాల డివిజన్‌లో ఉన్న అన్నీ మద్యం దుకాణాల్లో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలిసినా దుకాణాల వైపు వెళ్లడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుయాయులకు చెందిన దుకాణాలు కావడంతో తనిఖీలు నిలిపేసి ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తూ తమ వాటాలు పంచుకుంటున్నారు. కల్తీ మద్యం ఏరులై పారుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలయ్యారు ఎక్సైజ్ అధికారులు.
24 గంటలూ మద్యం అమ్మకాలు
చీరాల ప్రాంతంలో మద్యం అమ్మకాలకు నిర్ణీత సమయం, పగలు రాత్రి అన్న తేడాలు లేవు. మద్యం వ్యాపారాలను పెంచుకునేందుకు 24 గంటలూ దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉండగా దుకాణదారులు మాత్రం తెల్లవారు జాము 4 గంటలకు టీ దుకాణాల మాదిరిగా రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే కల్తీ వ్యాపారం ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం:నాసరయ్య, సీఐ, ఎక్సైజ్
చీరాల సబ్ డివిజన్‌లోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం కల్తీ చేసి అమ్మకాలు చేస్తుంటే ఫిర్యాదు చేయవచ్చు. దుకాణాల్లో అమ్మే మద్యంపై అనుమానం ఉంటే వాటిని పరీక్షలు చేయిస్తాం. కల్తీ మద్యం అమ్మకుండా చర్యలు చేపడతాం. కల్తీ మద్యం అమ్మితే దుకాణాన్ని సీజ్ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment