adultry
-
వినోద్ ఖలాల్‌పై పీడీ యాక్ట్
కర్నూలు: నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్ ఖలాల్‌పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇతనిది కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లా హుబ్లీలోని గణేష్ పేట. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్, నకిలీ లేబుళ్లు, నకిలీ మూతలు, కారామిల్ తదితర వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ రవాణా చేస్తుండేవాడు. తద్వారా అటు ఎక్సైజ్, ఇటు సివిల్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతనిపై కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రాష్ట్రంలోని ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించేవాడు. వారికి నకిలీ మద్యం తయారీకి అవసరమైన వస్తువులను సరఫరా చేసేవాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 20న డోన్ పట్టణ శివారులోని కంబాలపాడు వద్ద పేరంటాలమ్మగుడి వెనక సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్‌తో పాటు డోన్ అర్బన్ సీఐ కంబగిరి రాముడు, సిబ్బంది కలిసి వినోద్ ఖలాల్‌ను పట్టుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో మిగిలినముద్దాయిలను కూడా డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి..రిమాండ్‌కు పంపారు. వినోద్ ఖలాల్‌పై ఎక్సైజ్ , సివిల్ పోలీస్ స్టేషన్లలో 2017 నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసుల్లో ముద్దాయిగా ఉండటంతో ఇతనిపై పీడీ చట్టం అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్పీ ఫక్కీరప్ప జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు నివేదిక సమర్పించారు. అందుకు అనుమతి ఇస్తూ ఈ నెల 15న కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జిల్లా ప్రధాన జైల్లో ఉన్న వినోద్ ఖలాల్‌పై శుక్రవారం పీడీ చట్టం కేసు నమోదు చేసి.. సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
కల్తీపాల కలకలం
జగద్గిరిగుట్ట: ప్రగతినగర్‌లో కల్తీ పాల సంఘటన కలకల రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన పవన్, సౌమ్య దంపతులు స్థానిక సాయితేజ మిల్క్ సెంటర్ నుంచి ఈ నెల 8, 9 తేదీల్లో గేదె పాలను కొనుగోలు చేశారు. అందులో ఒక ప్యాకెట్లోని పాలను వేడి చేయగా విరిగి పోయి ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. పాత్ర ప్రభావం కారణంగా పాలు పాడై ఉండవచ్చునని భావించిన వారు మరో ప్యాకెట్పాలను వేడి చేయగా అవి అలాగే మారాయి. దీంతో మిల్క్ సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా అతను దురుసుగా ప్రవర్తించడంతో శుక్రవారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అశోక్ పాలను ల్యాబ్‌కు పంపారు. పరీక్షించిన తరువాత కల్తీగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
చౌక స్పిరిట్.. కాస్ట్లీ లిక్కర్
సాక్షి.సిటీబ్యూరో: కొందరు మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి , ధనార్జనే ధ్యేయంగా తక్కువ ధరలో లభించే రెక్టిఫైడ్ స్పిరిట్‌లో క్యారామిల్ లిక్విడ్‌ను కలిపి పలు బ్రాండ్లకు చెందిన లిక్కర్‌ను తయారు చేస్తు సొమ్ముచేసుకుంటున్నారు. నగరంలోని పలు దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించడంతో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టయ్యింది. ఇప్పటికే పోచంపల్లి, వికారాబాద్, బాలాపూర్‌లలో ఈ ముఠాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరికి ఈ దందాలో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒరిజినల్‌కు తీసిపోని విధంగా... డిస్టిలరీల్లో మద్యం తయారీలో మొలాసిస్‌ను ఉపయోగించగా మిగిలేదే రెక్టిఫైడ్ స్పిరిట్. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్‌ను పలు డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసే వ్యాపారులు నగరంతో పాటు జిల్లాలకు తరలించి రహస్య ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం పలు బ్రాండ్లకు మూతలను సరఫరా చేసే సంస్థలను సంప్రదించి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేస్తున్నారు. అనంతరం మద్యం దుకాణాలు, పాత సీసాల విక్రయదారుల నుంచి పాత సీసాలను సేకరిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఆయా సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నింపి దానికి మద్యం రంగు తీసుకొచ్చేందుకు క్యారామాల్ లిక్విడ్‌ను కలుపుతున్నారు. మద్యం కొనుగోలు చేసే వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు క్యాప్ సీలింగ్ మిషన్లతో ప్యాక్ చేసి, ప్రభుత్వం సరఫరా చేసినట్లుగా లేబుళ్లను అంటిస్తూ ఒరిజినల్ సీసాకు తగ్గకుండా తయారు చేస్తున్నారు. ఇలా తక్కువ ధరలో కాస్ట్లీ మద్యాన్ని అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. వచ్చేనెలాఖరుతో ముగియనున్న గడువు సెప్టెంబర్ నెల 30న ప్రస్తుత మద్యం పాలసీ ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అధిక శాతం మద్యం దుకాణాల ద్వారా వరుస ఎన్నికల ఎఫెక్ట్‌తో టార్గెట్‌కు మించి అమ్మకాలు నిర్వహించారు. టార్గెట్ ముగియడంతో ప్రభుత్వానికి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు చివరి రోజుల్లో అడ్డదారి సంపాదనకు అలవాటు పడి తక్కువ ధరలో దొరికే స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేసే వారితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారుల వరుస దాడులుతో అప్రమత్తమైన వ్యాపారులు దుకాణాల్లో ఉన్న కల్తీ మద్యాన్ని అక్కడి నుంచి తరలించేశారు. మరికొందరు నిర్వాహకులు బెల్డ్ షాపుల నిర్వాహకులకు అప్పు స్టాక్‌ను తరలించినట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదలింది ♦ ఈ నెల 14న భూదాన్ పోచంపల్లిలో రెక్టిపైడ్ స్పిరిట్, క్యారామిల్‌తో మద్యం తయారు చేస్తున్న మద్ది అనిల్ రెడ్డితో పాటు అతడికి సహకరిస్తున్న మద్ది నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి తో పాటు జహీరాబాద్‌కు చెందిన మొగిలప్ప, హైదరాబాద్‌కు చెందిన మీర్ లాయక్ అలీ, ఔరంగాబాద్‌కు చెందిన సునీల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెక్టిఫైడ్ స్పిరిట్, క్యారామిల్, వేల సంఖ్యలో మద్యం సీసాల మూతలను స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్‌తో తయారు చేసిన మద్యం అమ్ముతున్న నారాయణపురంలోని ఓ మద్యం దుకాణాన్నిసీజ్ చేశారు. ♦ వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల 19న వికారాబాద్ జిల్లా, నాగుల పల్లి గ్రామానికి చెందిన బెస్త లక్ష్మణ్ ఇంటిపై దాడులు నిర్వహించి, స్పిరిట్, క్యారమిల్ లిక్విడ్, మద్యం బాటిళ్ల మూతలు, క్యాప్ సీజింగ్ మిషన్లు, 4 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, 150 లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ♦ బాలాపూర్ మండలం, జల్పల్లిలోని పారిశ్రామిక వాడలో ఓ కంపెనీపై దాడి చేసి రెక్టిఫైడ్ స్పిరిట్, కల్తీ మద్యం, 72, 400 సీసా మూతలను స్వాధీనం చేసుకున్నారు. సుధీర్, లాయక్ అలీ, గోపాల్ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొరికిన వారి సమాచారం ఆధారంగా జూలై 11న కొండాపూర్‌లోని దుర్గా వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించగా పలు బ్రాండ్లకు చెందిన 80 మద్యం సీసాలను కల్తీ చేసినట్లు గుర్తించి దుకాణాన్ని సీజ్ చేశారు. నిందితులు ఇచ్చిన ఆధారాల మేరకు అగస్టు 12న కొత్తపేటలోని గున్ను వైన్స్‌పై దాడులు నిర్వహించి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కల్తీకి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసులలో లభించిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. -
పార్శిల్ పరేషాన్
రాంగోపాల్‌పేట్: తమ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది వినూత్న రీతిలో తీవ్ర నిరసనకు దిగారు. కలుషిత జలాలను ప్రభుత్వ పెద్దలు, వీవీఐపీలకు పార్శిల్ చేసి కలకలం సృష్టించారు. మంగళవారం సికింద్రాబాద్ పోస్టాఫీస్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు, ఇటు పోస్టాఫీస్ వర్గాలు ఈ విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ నుంచి పార్శిళ్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొందరు మంత్రుల చిరునామాతో పార్శిళ్లు వచ్చాయి. ఉస్మానియా నుంచి వాటిని ప్రధాన పోస్టాఫీస్ అయిన సికింద్రాబాద్‌కు వచ్చాయి. మంగళవారం ఆ పార్శిళ్ల నుంచి వాసన వస్తుండటంతో పోస్టాఫీస్ వర్గాలకు అనుమానం వచ్చి మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని పార్శిళ్లను విప్పి చూడగా అందులో కలుషిత జలాలు కనిపించాయి. అవి కలుషిత జలాలా.. మరేదైనా కెమికల్ కలిపారా.. అనేది తెలుసుకునేందు క్లూస్ టీం శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వీటిని ఎవరు పంపించారు.. ఏ చిరునామాతో వచ్చాయనే వివరాలు లేవని తెలిసింది. మురుగు నీటి సమస్యపై.. ఉస్మానియా వర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్శిళ్లతో పాటు తమ ప్రాంతంలో ఉండే కలుషిత జలాల సమస్య ఎవరు పట్టించుకోవడం లేదని ఘాటైన లేఖలు కూడా జతచేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని మహంకాళి ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కొన్ని పార్శిళ్లపై పోస్టాఫీస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని వెళ్లి పరిశీలించామన్నారు. -
పా‘పాల’ భైరవుల ఆటకట్టు!
సాక్షి, సిటీబ్యూరో: వెటర్నరీ వినియోగంలో నిషేధించిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కర్ణాటకలోని బీదర్ నుంచి అక్రమ రవాణా చేసి, నగరంలోని డెయిరీ ఫామ్స్‌కు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని పట్టుకుని 100 ఎంఎల్ పరిమాణం కలిగిన 1920 లేబుల్స్ లేని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ప్రసూతి సమయంలో మహిళలకు వినియోగించే ఈ ఇంజెక్షన్లను గతంలో పశువులకు వాడేవారు. అయితే వీటి దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వీటి వినియోగాన్ని నిషేధించింది. దీంతో అధికారికంగా వాటి ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు పుట్టుకొచ్చాయి. బీదర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రసూతి మహిళలకు వాడే వాటినే పశువులకు వినియోగించేందుకు అనువుగా తయారు చేసి నగరంలోని బాబానగర్‌కు చెందిన ఇంతియాజ్ ద్వారా వాటిని మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇంతియాజ్ ఆర్డర్ మేరకు ఈ ఇంజెక్షన్లు తయారు చేసే ఇస్మాయిల్ వాటిని తీసుకుని సిటీకి వచ్చేవాడు. ఇంతియాజ్ సూచన మేరకు డెయిరీ యజమానులకు అప్పగించి వెళ్లేవాడు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇద్దరూ కలిసి పర్యవేక్షిస్తుంటారు. గేదెలు అధికంగా పాలు ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారని, నగరంతో పాటు శివార్లలోని డెయిరీ ఫామ్స్‌లో దాదాపు 70 శాతం వీటిని వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తీసిన పాలు, ఆ పాల ఉత్పత్తులు తీసుకుంటే అనేక అనర్థాలు కలుగుతాయన్నారు. ఈ దందాపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు నరేందర్ తదితరులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. పాతబస్తీలో మాటువేసి ఇస్మాయిల్‌ను పట్టుకుని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న మరో నిందితుడు ఇంతియాజ్ కోసం గాలిస్తోంది. అనర్థాలూ ఎన్నో... ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకంతో అనేక అనర్థాలు ఉన్నాయని పశు వైద్యులు చెబుతున్నారు. వీటిని వినియోగిస్తే గేదెలకే కాకుండా ఆ పాలను వినియోగించే మనుషులకూ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లను అత్యధికంగా గేదెలకే ఇస్తుంటారు. సాధారణంగా గేదెలు పాలు ఇవ్వాలంటే వాటి పొదుగును దూడలు తాకి పాలు తాగాల్సిందే. అప్పుడే ఆ గేదెల మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమై హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. వీటి కారణంగానే గేదె పాలు ఇవ్వడం జరుగుతుంది. దూడలు లేని పశువు నుంచి సామర్థ్యానికి మించి పాలను పిండాలని భావించే యజమానులే ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను వాడతారు. ప్రస్తుతం వీటిపై నిషేధం ఉండటంతో ప్రసూతి సమయంలో మనుషులకు వాడే వాటినే గేదెలకూ వినియోగిస్తున్నారు. ఒక్కో గేదెకు రోజుకు 8 ఎంఎల్ నుంచి 20 ఎమ్ఎల్ వరకు ఇంజెక్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత గేదె ఇచ్చే పాలలోనూ ఆక్సిటోసిన్ ఆనవాళ్ళు ఉంటాయి. ఈ పాలు తాగిన మనుషులూ అనేక రుగ్మతలకు లోనవటంతో పాటు రోగాల బారినపడతారు. చిన్నారులకు ఈ పాలను కొన్నాళ్ళ పాటు తాగిస్తే వారికి ఫిట్స్ వంటి నరాల సంబంధ వ్యాధులు వస్తాయి. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పాలు వాడిన వారిలో అసహజమైన ఎదుగుదల కనిపిస్తుంది. వీరు త్వరగా వృద్ధులుగా మారతారు. నెలలకు నిండక ముందే ప్రసవాలు, చిన్నారులకు బుద్ధిమాంద్యం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్ ఆనవాళ్లను కేవలం ప్రయోగశాలల్లో మాత్రమే గుర్తించగలుగుతామని నిపుణులు పేర్కొన్నారు. ‘కుటీర పరిశ్రమగా’ తయారీ ఒకప్పుడు పశువులకు వినియోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ప్రభుత్వం 2003లో నిషేధించింది. అప్పటి నుంచి పలువురు అక్రమంగా వీటిని సేకరించి విక్రయిస్తున్నారు. ఈ ముఠాలు ప్రసూతి సమయంలో మహిళలకు వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి 300 ఎంఎల్ ఆక్సిటోసిన్‌లో 1200 ఎంఎల్ ఫినాయిల్, కేజీ గళ్ల ఉప్పు, 160 లీటర్ల నీరు కలిసి కృత్రిమ ఆక్సిటోసిన్ ద్రావణం తయారు చేస్తున్నారు. దీనిని 140, 180, 200 ఎంఎల్ బాటిల్స్‌లో ప్యాక్ చేసి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తున్నారు. 160 లీటర్ల ద్రావణం తయారీకి రూ.4 వేల వరకు ఖర్చవుతుండగా.. దానిని ఇంజెక్షన్లుగా మార్చి ఏకంగా రూ.90 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని డెయిరీ ఫామ్స్ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ల నుంచి గేదెల్ని ఖరీదు చేసుకుని వస్తున్నాయి. అక్కడి ఫామ్స్‌లో ఏళ్ల పాటు వినియోగించి, అవసానదశకు చేరిన వాటిని తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. వీటికి దూడలు కూడా ఉండకపోవడంతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వీటి నుంచి పాలు తీసేముందు 4 ఎంఎల్ చొప్పున ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తూ భారీగా పాలు పిండుతున్నారు. ఈ పంథాలో పాలిచ్చిన గేదెలు గరిష్టంగా ఏడాదికే వట్టిపోయి స్లాటర్ హౌస్‌లకు చేరాల్సి వస్తోంది. -
కట్టడి లేని కల్తీ దందా
సాక్షి,సిటీబ్యూరో: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఇటీవల వాహనాల్లో పెట్రోల్ నింపుకుంటే సదరు వాహనాలు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయాయి. ఏం జరిగిందో పరీక్షించగా పెట్రోల్‌లో నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దాంతో కొందరు వాహనదారులు వెనుదిరిగి వచ్చి ఆ బంకులో పెట్రోల్‌ను సీసాల్లో నింపి పరిశీలించగా బాటిల్ అడుగున నీరు కనిపించడంతో కల్తీని నిర్ధారించుకున్నారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న వాహనాలకు సైతం అదే సమస్య తలెత్తడంతో వారూ బంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటికల్తీ సంఘటనలు నగరంలో తరచూ బయటపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపడం తప్ప.. కల్తీ జరిగిందా.. లేదా.. కల్తీ తేలితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల కల్తీ ఆయిల్ మాఫీయా మహానగరంలో పాగా వేస్తున్నట్టు వస్తున్న అనుమానాలకు ఈ ఇంధన కల్తీ బలం చేకూరుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఎగబాగుతుండటంతో గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరిగిపోతోంది. అధికారికంగా అయిల్ కంపెనీల నుంచి పది శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం సరఫరా అవుతుండగా.. మరోవైపు అక్రమంగా ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా, కిరోసిన్ కూడా పెట్రోల్ బంకులకు దిగుమవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పెట్రోల్ బంక్‌ల్లో కల్తీ వ్యవహరానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నాణ్యతపై తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో కల్తీ వ్యవహారం బంకుల ఇష్టారాజ్యమైంది. నగరంలో యథేచ్చగా కల్తీ శివార్లోని బంకులు అధికంగా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు పలు సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. నిత్యం నగరానికి పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున ఇక్కడి పెట్రోల్ బంకులకు ఇంధన డిమాండ్ బాగానే ఉంటుంది. దీంతో వాటి యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కారుచౌకగా బయోడిజిల్, కిరోసిన్, నాఫ్తా ఆయిల్ తెప్పించి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్లు సిటీకి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పెట్రోల్ బంకులు æఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండడంతో ఇంధనంలో కల్తీ జరిగితే రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతుంది. సాధారణంగా రోజుకు 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజీల్ విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌గా మారాలి. అయితే నగరంలోని బంకుల్లో సేల్స్ ఉన్నా.. కొన్ని పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దెబ్బ తీస్తున్న ఇథనాల్ మిళితం ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్ కలిసిన పెట్రోల్ సరఫరా కూడా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీరు కలిస్తే క్రమంగా పెట్రోల్ నీరుగా మారుతుంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీలే చెబుతున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ, చమురు సంస్థలు ఇవేమి పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. శాంపిల్స్ సేకరిస్తున్నారా..? పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ రాగానే ప్రత్యేకంగా శాంపిల్స్ తీసి ఇన్వాయిస్తో సహా భద్రపరచాలి. ఒకవేళ వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బ్లాటింగ్ పేపర్, డెన్సిటీ పరీక్షలు చేయాలి. పరీక్షల్లో ఇన్వాయిస్ డెన్సిటీకి బంక్‌లోని పెట్రోల్ డెన్సిటీకి ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా కల్తీ జరిగినట్టే. ఒకవేళ ట్యాంకర్ శాంపిల్స్ భద్రపర్చలేదంటే ఆ బంకుల్లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించవచ్చు. కంపెనీ ఆయిల్ సరఫరా చేసే సమయంలోనే పెట్రోల్, డీజిల్ సాంధ్రత ఎంతుండాలనేది ధృవీకరిస్తారు. ఇలా పెట్రోల్‌లో డెన్సిటీ నిర్థారించే హైడ్రోమీటర్లు థర్మామీటర్‌తో కూడిన కిట్లను బంక్ యజమానులు అందుబాటులో ఉంంచాలి. వాస్తవంగా పెట్రో, డీజిల్‌లో కల్తీ నిర్థారించే హైడ్రోమీటర్, థర్మామీటర్, జార్లతో కూడిన కిట్లు మెజార్టీ బంకుల్లో కనిపించవు. బంకుల్లో తనిఖీలు అంతంతే.. పెట్రోల్‌లో యథేచ్చగా కల్తీ జరుగుతోందని వినియోగదారులు గగ్గోలుపడుతున్నా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు ఉండాలి. అయితే, గ్రేటర్లో అధికారుల వద్ద అలాంటి పరికరాలు ఉండవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేసి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. సదరు సంస్థ కూడా కల్తీ నిర్థారణ జరిగినట్లు నివేదికలు పంపించిన దఖాలాలు కూడా ఉండడం లేదు. కల్తీపై కఠిన చర్యలు పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తే బంకులపై చర్యలు తప్పవు. కొన్ని బంకుల్లో ఇథనాల్ కారణంగా పెట్రోల్ నీరుగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. శాంపిల్స్ సైతం సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. కల్తీ బయటపడితే బంకులనే సీజ్ చేసి డీలర్లపై చర్యలు తీసుకుంటాం.– రాథోడ్, డీఎస్ఓ, రంగారెడ్డి జిల్లా -
ఐస్‌క్యాండీ ఐస్‌క్రీమ్ తింటున్నారా..?
చిత్తూరు అర్బన్: ఐస్ క్రీములంటే లొట్టలేసుకుని తినేయడమే తెలుసు. ఇక అందులోంచి వచ్చే మత్తెక్కించే ఫ్లేవర్లు వాటిని ఆస్వాదిస్తూ తినమంటాయి. కళ్లకు ఇంపుగా కనిపించే రంగులు.. వాటిపై అలంకరించే డ్రైఫ్రూట్స్, చివర్లో వేసే తేనె.. అబ్బో చెబుతుంటూనే నోట్లోంచి లాలాజలం ఊరిస్తూ అర్జెంటుగా వెళ్లి ఓ ఐస్ క్రీమ్ తినేయాలన్నంత ఆత్రుతను కలిగిస్తోంది. కానీ గతవారం విజయవాడలో జరిగిన ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీల తనిఖీలను చూస్తే జన్మలో ఐస్ క్రీమ్ వద్దంటారు. అలాగని అన్నింటినీ తప్పు పట్టడం లేదు. పూర్తిగా రసాయనాలతో నింపేసిన ఐస్‌క్రీములు, ఐస్బార్లను మార్కెట్లోకి వదులుతున్నారు. కనీసం ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను ప్యాక్‌లపై ముద్రించడం కూడాలేదు. ఇక వీటి తయారీలో వాడే రంగులు, ప్రొటీన్లు, కొవ్వులు తదితర పదార్థాల ప్రమాణాలను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు. పేరున్న సంస్థల ఉత్పత్తులు కూడా ప్రమాణాలు పాటించడం లేదని ఆహార నియంత్రణ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది. కొన్నింటికే అనుమతి జిల్లా వ్యాప్తంగా ఐస్ క్రీమ్ తయారీ లకు అనుమతులు ఉన్నవి కేవలం 18 మాత్రమే. ఈ కంపెనీలు మాత్రమే డేంజరస్ అండ్ అఫెన్స్ (డీఅండ్‌వో) ట్రేడ్ లైసెన్సు, ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకున్నాయి. ఇందులో 7 ఐస్ క్రీమ్ 8 క్యాండీ తయారీ కంపె నీలున్నాయి. అనధికారింగా వీటి సంఖ్య జిల్లాలో 120 వరకు ఉన్నాయి. ఎటువంటి బ్రాండ్లు లేకుండా నడిచేవి లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.80 కోట్ల వ్యాపారం జరుగుతుంటే ప్రజలకు విషాన్ని తినిపిస్తూ కొందరు వ్యాపారులు 60 శాతం లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్క వేసవి కాలంలో మాత్రం రూ.65 కోట్ల లాభాలు వస్తున్నాయంటే ఈ వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లోంచి అధికారులకు వెళుతున్న వాటాలు 10 శాతం. అంటే రూ.8 కోట్లు. ఇంత జరుగుతున్నా తినే ఐస్ క్రీమ్ ఏ రకమైందో తెలుసుకునే అవకాశం వినియోగదారుడికి ఉండడం లేదు. ఐస్ క్రీమ్‌ల విషయంలో సామాన్యులకు అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పాటించేది ఎక్కడ? జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌లను తయారు చేసిన తర్వాత ఆ ప్యాక్‌పై తయారీ గడువు తేదీలను ము ద్రించడం లేదు. డిమాండ్ ఉన్నా లేకున్నా భారీగా తయారుచేసి నిల్వ ఉంచుతున్నారు. ఆర్డర్ వచ్చి సరుకును బయటికి పంపించే సమయంలో తయారీ తేదీని వేస్తున్నారు. కృత్రిమ రంగును పరిమితికి మించి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐస్ క్రీమ్ తయారీలో ఎంతో కీలకమైన నీటి నాణ్యత దారుణంగా ఉంటోంది. ఒక్కటంటే ఒక్క చోటకూడా శుద్ధినీటిని ఉపయోగించడం లేదు. కనీ సం తాగేనీళ్లను వాడకపోగా ఇంట్లో అంట్లు తోమడానికి ఉపయోగించేదానికన్నా దారుణంగా ఉంటోంది. ప్రమాణాలు ఇవీ.. ఐస్ క్రీమ్‌లను పాల పదార్థాలతో తయారు చేయాలి. వీటిని పలు రకాల రుచులతో పాటు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో పరీక్షించి వినియోగించాలి. ఉత్పత్తుల్లోని కొవ్వు శాతం ఆధారంగా సమాచారాన్ని ప్యాకెట్‌పై ముద్రించాలి. ఐస్ క్రీమ్‌లను మరో రకమైన డెజర్ట్ పాలు లేదా కూరగాయల నుంచి తీసిన నూనె, కొవ్వుతో కూడా తయారుచేస్తారు. ఈ రెండింటిని కలిపి కూ డా తయారుచేసే అవకాశం ఉంది. ఈ రకమైన వాటిల్లో తక్కువ, మోస్త రు కొవ్వు అని రెండు రకాలుగా విభజించారు. తప్పనిసరిగా ఈ వివరా లు ప్యాకెట్‌పై ఉండాలి. పలు రకాల రుచుల కోసం ఐస్ క్రీమ్ల్లో సహజ, కృత్రిమ, సింతటిక్ రంగులను వాడొచ్చని చట్టం చెబుతోంది. టాట్రాజిన్, కార్మోసిన్, రూడామిన్, సన్‌సెట్ ఎల్లో వంటి వాటిని తయారీదారులు వాడుతున్నారు. వీటి పరిమితి 100 పీపీఎం దాటకూడదు. పాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్రీముల్లో కొవ్వు 2.5 శాతం మించకూడదు. ప్రొటీన్లు 3.5 శాతం, మొత్తం ఘన పదార్థాలు 26 శాతానికి తగ్గకూడదు. చక్కెర 10 శాతానికి మించకూడదు. నాసిరకం పంచదార కొంతమంది ఐస్ క్రీమ్ తయారీదారులు నాసిరకం పంచదారను వాడుతున్నారని తెలుస్తోంది. మరి కొంతమంది చక్కెరకు బదులుగా శాక్రీన్ వాడుతారు. దీనిని ఎక్కువగా ఐస్ ఫ్రూట్లలో వినియోగిస్తారు. ఇది కేన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తించడం కష్టం ఐస్ క్రీములు చెడిపోయాయో లేదో గుర్తించడం చాలా కష్టం. బూజు వాసన వచ్చినా, జిగురుగా ఉన్నా తినకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుబయట ఎక్కువసేపు నిల్వ ఉంచి తింటే బ్యాక్టీరియా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. -
హోటళ్లలో తనిఖీలు
కర్నూలు: హోటళ్లలో ఆహార పదార్థాల కల్తీపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. హోటళ్లలో పాచిపోయిన పదార్థాలు, రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలోని పలు హోటళ్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విక్టరీ టాకీస్ సమీపంలోని హిందూస్థాన్ హోటల్ గ్రాండ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. కిచెన్, డీఫ్రిజ్, డైనింగ్ రూం తదితర వాటిని పరిశీలించారు. కిచెన్‌లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు లోపాలు గుర్తించారు. ప్లేట్లు సరిగా శుభ్రం చేయకుండా వాడుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. పరిశుభ్రతకు సంబంధించిన విషయాలపై హోటల్ యజమానికి తగిన సూచనలిచ్చారు. ఆహార పదార్థాల నిల్వల్లో లోపాలను గుర్తించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ యజమానికి పై చర్యలుంటాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాసరెడ్డి, ఏఏఓ షన్ముఖ గణేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మినారాయణ, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, రాముడు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ హోటల్లో.. కర్నూలు ఆర్టీసీ బస్టాండులో ఉన్న బాలాజీ హోటల్లో విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. హోటలోని కిచెన్ రూం, డైనింగ్ సెక్షన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. హోటల్లో పరిశుభ్రత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంపిల్స్ సేకరణలో వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ నిర్వాహకులపై చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. వాహనాల తనిఖీ.. జిల్లాలో అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. కర్నూలు యూనిట్ బృందం గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 31 వాహనాలను తనిఖీలు నిర్వహించి తదుపరి చర్యలు నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. లైమ్‌స్టోన్, ఇతర మెటీరియల్‌ను తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేసి, రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. వారి నుంచి రూ.4.62 లక్షలు అపరాధ రుసుం వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. తనిఖీల్లో సీఐ లక్ష్మయ్యతో పాటు ఏఈ మధు, సిబ్బందిపాల్గొన్నారు. -
మంచినీటిలో విష ప్రయోగం
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకు డెలివరీ వాల్వ్ ఉన్న గోతిలో పురుగుల మందు కలిపిన సంఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో గ్రామంలో ప్రజలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారదేవం గ్రామంలో ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న డెలివరీ వాల్వ్ గోతిలో గుర్తుతెలియని వ్యక్తులు పురుగు మందును కలిపారు. పంచాయతీ నైట్ వాచ్మెన్ దాసరి పోలయ్య వాల్వ్ పక్కన ఉన్న పురుగు మందు సీసాను గుర్తించి వాల్వ్ వద్ద నీరును పరిశీలించడంతో అనుమానపడ్డాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో హు టాహుటిన ట్యాంకులో ఉన్న నీటిని అవుట్లెట్ వాల్వ్ ద్వారా బయటకు వదిలారు. అంతేకాకుండా గ్రామంలో టాంటాం ద్వారా నీటిని పట్టుకున్నవారు వాడవద్దని సమాచారం అందించారు. విషయం కుమారదేవంతో పాటు పరిసర గ్రామాలకు దావాలనంలా వ్యాపించింది. ఎవరు ఈ పని చేసుంటారు అంటూ ప్రతిఒక్కరూ చర్చించుకోవ డం కన్పించింది. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించడంతో పెనుప్రమాదమే తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కార్యదర్శి నాగేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించంతో కొవ్వూరు రూరల్ సీఐ కేవీవీ సత్యనారాయణ, ఎస్సై పి.రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పురుగు మందు ఉన్న సీసాను, నీటి శాంపిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కల్తీ కంత్రీలు..!
మందుబాబుల బలహీనతను మద్యంషాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. మద్యాన్ని కల్తీ చేసి జేబులు నింపుకుంటున్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ కల్తీ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు దుకాణాల్లో కల్తీ పెచ్చుమీరినట్లు సమాచారం. చిత్తూరు, పలమనేరు : జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాల్లో కల్తీ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. రెండేళ్ల లైసెన్సుల గడువు జూన్‌కు ముగియనున్న నేపథ్యంలో నాలుగురాళ్లు వెనకేసుకునేందుకు ఇలాంటి ట్రిక్కులను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో మద్యం బాటిల్ లోని మద్యాన్ని కొంతకొంత తీయడం.. ఖాళీని కల్తీతో నింపేయడం చేస్తున్నట్లు సమాచారం. ఇలా నాలుగు క్వార్టర్ బాటిళ్ల నుంచి అదనంగా మరో క్వార్టర్ బాటిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే కిక్కుకోసం హాన్స్ ప్యాకెట్ల ద్వారా తయారు చేసిన ద్రవాన్ని నింపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. విషయం తెలియని మందుబాబులు ఇచ్చిన బాటిల్‌ను తాగిపోతున్నారు. తద్వారా దుకాణదారులు అడ్డదారుల్లో దోపిడీ చేస్తూ మద్యం బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ తంతు కర్ణాటక సరిహద్దుల్లోని మద్యం షాపులు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువ.. జిల్లాలోని గంగవరం, బైరెడ్డిపల్లి, వీకోట, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి, పెద్దపంజాణి, పుంగనూరు, రామసముద్రం, బి.కొత్తకోట, వాయల్పాడు, ములకలచెరువు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో కల్తీ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు పక్క రాష్ట్రాల నుంచి సైతం మందుబాబులు వస్తుండడంతో కల్తీ వ్యాపారం బాగానే సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంటు ఆధికారులు దీనిపై నిఘా పెట్టాల్సి ఉంది. ఎలా కల్తీ చేస్తారంటే.. మద్యం సీసాల మూతలను లాఘవంగా విప్పి అందులోని కొంత మద్యాన్ని వేరుచేస్తారు. ఇందులోకి నీరు లేదా పొగాకు నీటిను నింపి తిరిగి బిరడాను యథాతథంగా అమర్చుతారు. అదేవిధంగా బ్రాందీ, విస్కీలోకి సైతం చీప్‌ను మిక్స్ చేస్తారు. దీంతో సీసాను విప్పినట్టు కూడా తెలీదు. ఇలాగే ఫుల్, ఆఫ్, క్వార్టర్ బాటిళ్ల నుంచి విడి అమ్మకాలు చేసేటప్పుడు సైతం ఈ పొగాగు నీళ్లను కల్తీ చేస్తున్నట్టు సమాచారం. మద్యం బాటిళ్లను ఒపెన్ చేసినట్టు తెలియకుండా ఓపెన్ చేసేందుకు కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. ఇలా కల్తీ చేసేందుకు కొందరు చేయితిరిగిన కూలీలుంటారు. వీరికి క్వార్టర్ బాటిల్‌కి ఇంత అని ధర కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పల్లెల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఎక్కువగా ఈ విధానాన్ని అనుసరిస్తుంటారని సమాచారం. -
మీ ఇంట్లో రెడ్ లేబుల్ టీపొడి వాడుతున్నారా..?
చాదర్‌ఘాట్: నకిలీ టీపొడి విక్రయిస్తున్న ఇద్దరు దుకాణదారులపై చాదర్‌ఘాట్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శేషు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృపామార్కెట్ లోని శ్రీపవన్ స్తుతి స్టోర్స్ నిర్వాహకుడు దినేశ్‌కుమార్ గోయెల్ నకిలీ రెడ్ లేబుల్ టీపొడి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడం తో కంపెనీ వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ నేపథ్యంలో షాప్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు రూ.2 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి సరఫరా.. ఈ నకిలీ టీ పొడి మధ్య ప్రదేశ్ నుంచి నగరానికి సరఫరా అవుతుందని, బేగం బజార్ లోని సుమిత్రన్ ఏజెన్సీ అధినేత సర్దా క్రాంతి ద్వారా మలక్‌పేటలోని కృపామార్కెట్కు తరలించి అక్కడ నుంచి హోల్‌సేల్‌గా నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులు సర్దా క్రాంతి, దినేశ్ కుమార్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏమి'టీ'దారుణం
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఉదయాన్నే లేవగానే టీ తాగడం అనేది చాలామందికి ఉన్న ఓ అలవాటు.. అధికశాతం మంది ఇళ్లలో కంటే బయటే దుకాణా ల్లో టీ ఎక్కువగా తాగుతుంటారు. పనిఒత్తిడి మీద ఉన్నవారు అయితే వెంట, వెంటనే టీ తాగుతుంటారు. మానవ జీవితంతో విడదీయలేనంతగా ఈ అలవాటు కొందరితో పెనవేసుకుంది. ఇదే ఆసరాగా కొందరు స్వార్థపరులు లాభాలే ధ్యేయంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. రంగు ఎక్కువగా కనిపించేందుకు గాను టీ పొడి కల్తీలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యానికి హానికరం చేసే పదార్థాలు కలుపుతున్నారు. జీడిపిక్కల పొడి వినియోగం జిల్లాలోని తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో టీ దుకాణాల్లో కల్తీ టీపొడి వినియోగించడంతో పాటు విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా రంగు కోసం జీడిపిక్కల పొడి, ఒకసారి వినియోగించేసిన పొడి, రసాయనాలు కలుపుతున్నట్టు ఆహార తనిఖీ అధికారులు ఇటీవల దాడుల్లో గుర్తించారు. విజిలెన్స్ అధికారుల దాడుల్లోనూ ఇవి బయటపడుతున్నాయి. అయినప్పటికీ ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జిల్లాకు దిగుమతి చేసుకుంటూ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన టీపొడి కిలో రూ.600 పలుకుతుంది. అయితే అదే మొత్తంలో నకిలీది అయితే రూ.300లకే లభ్యం అవుతోంది. ధర తక్కువ కారణంగా తమ దుకాణాల్లో ఈ కల్తీ టీ పొడిని విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాల ద్వారా సుమారు రోజుకు 8 వేల కిలోల టీపొడిని విక్రయిస్తున్నట్టు అంచనా. దీంతో పాటుగా రోజురోజుకూ టీ తాగేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రతి వీధిలోనూ విక్రయించే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇవిగో ఉదాహరణలు గత నెలలో జిల్లా కేంద్రమైన ఏలూరులో తమరాల శ్రీను అనే వ్యక్తి వద్ద నుంచి 845 కిలోల నకిలీ టీ పొడిని విజిలెన్స్ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇదే వ్యక్తి గతేడాది కూడా వందల కిలోల నకిలీ టీపొడిని తయారు చేస్తూ పట్టుబడ్డాడు. అదే విధంగా తణుకులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ, పామాయిల్ ప్యాకెట్లలో వేరుశనగ నూనెలు నింపుతూ ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఆహార ప్రమాణాల చట్టం 2011లోని 3, 1, 2 (6) ప్రకారం టీ పొడిలో హానికరమైన టార్టాజిన్, సన్‌సెట్ ఎల్లో రంగులు కలవడం నిషేధం. వీటిని వినియోగిస్తే అన్నవాహికల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు కేన్సర్ సోకే అవకాశమూ ఉంది. కాలేయం, కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అడ్డుకునేందుకు చర్యలు శూన్యం ఎన్నిసార్లు విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా ఈ కేసులు సాధారణమైనవి కావడంతో వ్యాపారులు కల్తీ కొనసాగిస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే రసాయనాలను కలిపి విక్రయించే దుకాణాలతో పాటు వాటి యజమానులపై కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. -
ఎనీ సెంటర్..ఎనీ వేర్!
రోజంతా కష్టపడి ఆ కష్టాన్ని మరిచి పోయేందుకు కొందరు తాగుతున్న మద్యం మకిలీగా మారింది. జిల్లాలో ప్రధానంగా చీరాల్లోనే కల్తీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. చాలా మద్యం దుకాణాలు అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉండటంతో అడిగేవారెవరూ లేకపోవడంతో నకిలీ మద్యం పరవళ్లు తొక్కుతోంది. 24 గంటలూ మద్యం దుకాణాలు బార్లా తెరచి అమ్మకాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం దరువు చందంగా కనీసం మంచినీరు దొరక్కునా మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తే తమవి అధికార పార్టీ నేతలకు సంబంధించిన షాపులని యథేచ్ఛగా బెదింపులకు దిగుతున్నారు. చీరాల సబ్‌డివిజన్‌లో 37 వైన్ షాపులు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రకాశం, చీరాల:మద్యం దుకాణాల్లో క్వార్టర్ రాయల్‌స్టాగ్ రూ.160, మ్యాన్షన్ హౌస్ రూ.130, సిగ్నేచర్ రూ.220, బ్లాక్‌డాగ్ రూ.375, బ్లెండర్ స్ప్రైడ్ రూ.220, బ్లాక్ గోల్డ్ రూ.170 మార్పిస్ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకే అమ్మకాలు చేస్తుండటంతో మద్యం వ్యాపారులు కల్తీకి అలవాటు పడ్డారు. ఖరీదు మద్యం బాటిళ్లలో క్వార్టర్ రూ.50లు విలువ చేసే చీప్ లిక్కర్‌ను కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల్లోని అన్నీ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. అధిక ధరలు ఉన్న మద్యం బాటిళ్లల్లో హెచ్డీ, ఓటీతో పాటు కొన్ని బ్రాండ్లలో మంచినీరు పోసి విక్రయాలు చేస్తున్నారు. క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిళ్లలో మరింత కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా కలుపుతున్నారు. కథ నడిపేది వీరే.. మద్యం దుకాణాల్లో కౌంటర్లో పనిచేసే వారే కల్తీ చేయడంలో సిద్ధ హస్తులు. ఫుల్ బాటిల్లో క్వార్టర్ మద్యాన్ని తీసేందుకు రబ్బరు ట్యూబుతో ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రం ద్వారా సీల్ తీసి బాటిల్లోని మద్యం తీసేసి అందులో చీప్ లిక్కర్, వాటర్ కలిపి యథాస్థానంలో బాటిళ్లు ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. తమ లాభాలు, బేటాల కోసం దుకాణం నిర్వహకులు, అటెండర్లతో కలిసి అక్రమాలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు చీరాల డివిజన్లో ఉన్న అన్నీ మద్యం దుకాణాల్లో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలిసినా దుకాణాల వైపు వెళ్లడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుయాయులకు చెందిన దుకాణాలు కావడంతో తనిఖీలు నిలిపేసి ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తూ తమ వాటాలు పంచుకుంటున్నారు. కల్తీ మద్యం ఏరులై పారుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలయ్యారు ఎక్సైజ్ అధికారులు. 24 గంటలూ మద్యం అమ్మకాలు చీరాల ప్రాంతంలో మద్యం అమ్మకాలకు నిర్ణీత సమయం, పగలు రాత్రి అన్న తేడాలు లేవు. మద్యం వ్యాపారాలను పెంచుకునేందుకు 24 గంటలూ దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉండగా దుకాణదారులు మాత్రం తెల్లవారు జాము 4 గంటలకు టీ దుకాణాల మాదిరిగా రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నారంటే కల్తీ వ్యాపారం ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం:నాసరయ్య, సీఐ, ఎక్సైజ్ చీరాల సబ్ డివిజన్లోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం కల్తీ చేసి అమ్మకాలు చేస్తుంటే ఫిర్యాదు చేయవచ్చు. దుకాణాల్లో అమ్మే మద్యంపై అనుమానం ఉంటే వాటిని పరీక్షలు చేయిస్తాం. కల్తీ మద్యం అమ్మకుండా చర్యలు చేపడతాం. కల్తీ మద్యం అమ్మితే దుకాణాన్ని సీజ్ చేస్తాం. -
వ్యభిచార ముఠాలపై కఠిన చర్యలు
రాంగోపాల్‌పేట: విద్య, ఉపాధి తదితర అవసరాల కోసం నగరానికి వచ్చే మహిళలు, యువతులను వ్యభిచార కూపంలోకి మళ్లించే ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా అన్నారు. బుధవారం రెజిమెంటల్ బజార్‌లోని ‘వికల్ప క్రైసిస్ కౌన్సెలింగ్ సెంటర్’ను ఉత్తర మండలం డీసీపీ సుమతితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రధాన రద్దీ ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు అధికంగా కార్యకలాపాలు సాగిస్తుండటం వల్ల అసాంఘి కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజ్వల లాంటి ఎన్జీవోతో కలిసి కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా తాము సెక్స్‌వర్కర్లలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న 129 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇద్దరిపై పీడీ యాక్ట్, మరో ముగ్గురు నిందితులపై పీటా యాక్ట్ ప్రయోగించామన్నారు. ఇలాంటి వారికి ఇల్లు, హోటళ్లల్లో గది అద్దెకు ఇచ్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చే మహిళలు, యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార ఊబిలోకి నెట్టే ముఠాలు నగరంలో 70 నుంచి 80 మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. వీరిపై ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టామని, పక్కా ఆధారాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో మొట్టమొదటి సారిగా వికల్ప కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇతర జోన్లలో కూడా ఇలాంటి కేంద్రాలను నెలకొల్పే ఆలోచన ఉందన్నారు. షీ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా నగరం మొత్తం షీ టీమ్స్‌తో మహిళలు, యువతుల భద్రత కోసం షీటీమ్స్‌తో ప్రత్యేక నిఘా కొనసాగుతూనే ఉందని స్వాతి లక్రా తెలిపారు. వికల్ప సెంటర్ పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నకు సమాధానమిచ్చారు. కళాశాలలు, బస్టాండ్ల వద్ద మహిళలను వేధించే పోకిరీలను పట్టుకొనేందుకు షీ–టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. ఉత్తర మండలంలో 72 కళాశాలున్నాయని, 17 కళాశాలలో విద్యార్థులకు షీ–టీమ్స్ అవగాహన కల్పించడం, మొబైల్ యాప్స్ ఉపయోగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించామన్నారు.