మందుబాబుల బలహీనతను మద్యంషాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. మద్యాన్ని కల్తీ చేసి జేబులు నింపుకుంటున్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ కల్తీ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు దుకాణాల్లో కల్తీ పెచ్చుమీరినట్లు సమాచారం.
చిత్తూరు, పలమనేరు : జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాల్లో కల్తీ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. రెండేళ్ల లైసెన్సుల గడువు జూన్‌కు ముగియనున్న నేపథ్యంలో నాలుగురాళ్లు వెనకేసుకునేందుకు ఇలాంటి ట్రిక్కులను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో మద్యం బాటిల్ లోని మద్యాన్ని కొంతకొంత తీయడం.. ఖాళీని కల్తీతో నింపేయడం చేస్తున్నట్లు సమాచారం. ఇలా నాలుగు క్వార్టర్ బాటిళ్ల నుంచి అదనంగా మరో క్వార్టర్ బాటిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే కిక్కుకోసం హాన్స్ ప్యాకెట్ల ద్వారా తయారు చేసిన ద్రవాన్ని నింపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. విషయం తెలియని మందుబాబులు ఇచ్చిన బాటిల్‌ను తాగిపోతున్నారు. తద్వారా దుకాణదారులు అడ్డదారుల్లో దోపిడీ చేస్తూ మద్యం బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ తంతు కర్ణాటక సరిహద్దుల్లోని మద్యం షాపులు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది.
సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువ..
జిల్లాలోని గంగవరం, బైరెడ్డిపల్లి, వీకోట, రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడిపల్లి, పెద్దపంజాణి, పుంగనూరు, రామసముద్రం, బి.కొత్తకోట, వాయల్పాడు, ములకలచెరువు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో కల్తీ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు పక్క రాష్ట్రాల నుంచి సైతం మందుబాబులు వస్తుండడంతో కల్తీ వ్యాపారం బాగానే సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంటు ఆధికారులు దీనిపై నిఘా పెట్టాల్సి ఉంది.
ఎలా కల్తీ చేస్తారంటే..
మద్యం సీసాల మూతలను లాఘవంగా విప్పి అందులోని కొంత మద్యాన్ని వేరుచేస్తారు. ఇందులోకి నీరు లేదా పొగాకు నీటిను నింపి తిరిగి బిరడాను యథాతథంగా అమర్చుతారు. అదేవిధంగా బ్రాందీ, విస్కీలోకి సైతం చీప్‌ను మిక్స్ చేస్తారు. దీంతో సీసాను విప్పినట్టు కూడా తెలీదు. ఇలాగే ఫుల్, ఆఫ్, క్వార్టర్ బాటిళ్ల నుంచి విడి అమ్మకాలు చేసేటప్పుడు సైతం ఈ పొగాగు నీళ్లను కల్తీ చేస్తున్నట్టు సమాచారం. మద్యం బాటిళ్లను ఒపెన్ చేసినట్టు తెలియకుండా ఓపెన్ చేసేందుకు కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. ఇలా కల్తీ చేసేందుకు కొందరు చేయితిరిగిన కూలీలుంటారు. వీరికి క్వార్టర్ బాటిల్‌కి ఇంత అని ధర కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పల్లెల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఎక్కువగా ఈ విధానాన్ని అనుసరిస్తుంటారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment