నారాయణవనం, పుత్తూరు మండలాల్లో పోలీçసులు స్వాధీనం చేసుకున్న సారా తయారీ సామగ్రి
సాక్షి, తిరుపతి : లాక్ డౌన్ వేళ జిల్లాలో టీడీపీ శ్రేణులు సారాతో పాటు కల్తీ మద్యం తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా మద్యం ప్రియులకు విక్రయించి జేబులు నింపుకుంటున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సారా, కల్తీ మద్యం తయారీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించడంతో ఎక్సైజ్ శాఖ ముమ్మరంగా దాడులు చేస్తోంది. గత నెల 22 నుంచి లాక్ డౌన్ అమలు నేపథ్యంలో నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులకు మినహా మిగిలిన వాటిపై నిషేధం విధించారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను టీడీపీ శ్రేణులు అనుకూలంగా మలచుకున్నాయి.
కుప్పం, పలమనేరు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, పూతలపట్టు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సారా, కల్తీ మద్యం తయారీలో దృష్టి కేంద్రీకరించారు. స్పిరిట్, యూరియా, ఇత్తడి పాత్రల తయారీకి ఉపయోగించే పౌడర్, బెల్లం కొనుగోలు చేస్తున్నారు. అలాగే పాత చెప్పులను సేకరించి వాటిని సారా తయారీకి వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కల్తీ మద్యం తయారీకి ప్రత్యేకంగా ద్రావణాన్ని తీసుకొచ్చి వాడుతున్నట్టు తెలిసింది. మద్యం ఖాళీ బాటిళ్లను సేకరించి కల్తీ మద్యాన్ని వాటిల్లో నింపి విక్రయాలకు తెరదీశారు. అలా కల్తీ మద్యం తయారు చేసే పూతలపట్టుకు చెందిన ముఠాను చిత్తూరు రూరల్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠాలో టీడీపీ నాయకులు హేమాద్రి, యోగేశ్వర్, ప్రకాష్‌నాయుడు, పురుషోత్తం, జయప్రకాష్‌ని అరెస్టు చేశారు. వీరి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్తీ మద్యం ముఠా వివరాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
అటవీ మారుమూల గ్రామాలే స్థావరాలు!
లాక్‌డౌన్ సమయంలో అధికారులు అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు రాలేరని గ్రహించిన టీడీపీ శ్రేణులు సారా తయారీకి ఆ ప్రాంతాలను ఎంచుకున్నాయి. భారీ ఎత్తున సారా బట్టీలను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్, పోలీసులు మెరుపు దాడులుచేశారు. నారాయణవనం పరిధిలో పుత్తూరు రూరల్ పోలీసులు, ఎస్టీఎఫ్, రిజర్వు పోలీసులు నిర్వహించిన దాడుల్లో 10వేల లీటర్ల ఊట, 300 లీటర్ల సారా ధ్వంసం చేశారు. అలాగే, 100 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున సారా, ఊట, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పీడీ యాక్ట్ కింద కేసులు
సారా, కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. గతంలో ప్రకటించినట్లు రేషన్ కట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం. ఈ యాక్ట్ కింద కేసు నమోదైతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఇచ్చే డబ్బుకు ఆశపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఏదైనా అవసరమైతే నేరుగా నన్ను కలిసినా సాయం చేస్తాను. – నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి
ప్రత్యేక బృందాలతో దాడులు
సారా, కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశాం. ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు, ఎస్టీఎఫ్, రిజర్వు పోలీసులను కూడా రంగంలోకి దించాం. అటవీ, మారుమూల ప్రాంతాలపై నిఘా పెట్టాం. ఇకపై రోజూ మెరుపు దాడులు చేస్తాం.– నాగలక్ష్మి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment