చిత్తూరు నగరంలో ఐస్‌క్యాండీ తయారీ చేసే ప్రదేశం
చిత్తూరు అర్బన్: ఐస్ క్రీములంటే లొట్టలేసుకుని తినేయడమే తెలుసు. ఇక అందులోంచి వచ్చే మత్తెక్కించే ఫ్లేవర్లు వాటిని ఆస్వాదిస్తూ తినమంటాయి. కళ్లకు ఇంపుగా కనిపించే రంగులు.. వాటిపై అలంకరించే డ్రైఫ్రూట్స్, చివర్లో వేసే తేనె.. అబ్బో చెబుతుంటూనే నోట్లోంచి లాలాజలం ఊరిస్తూ అర్జెంటుగా వెళ్లి ఓ ఐస్ క్రీమ్ తినేయాలన్నంత ఆత్రుతను కలిగిస్తోంది. కానీ గతవారం విజయవాడలో జరిగిన ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీల తనిఖీలను చూస్తే జన్మలో ఐస్ క్రీమ్ వద్దంటారు. అలాగని అన్నింటినీ తప్పు పట్టడం లేదు. పూర్తిగా రసాయనాలతో నింపేసిన ఐస్‌క్రీములు, ఐస్‌బార్లను మార్కెట్‌లోకి వదులుతున్నారు. కనీసం ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను ప్యాక్‌లపై ముద్రించడం కూడాలేదు. ఇక వీటి తయారీలో వాడే రంగులు, ప్రొటీన్లు, కొవ్వులు తదితర పదార్థాల ప్రమాణాలను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు. పేరున్న సంస్థల ఉత్పత్తులు కూడా ప్రమాణాలు పాటించడం లేదని ఆహార నియంత్రణ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది.
కొన్నింటికే అనుమతి
జిల్లా వ్యాప్తంగా ఐస్ క్రీమ్ తయారీ లకు అనుమతులు ఉన్నవి కేవలం 18 మాత్రమే. ఈ కంపెనీలు మాత్రమే డేంజరస్ అండ్ అఫెన్స్ (డీఅండ్‌వో) ట్రేడ్ లైసెన్సు, ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకున్నాయి. ఇందులో 7 ఐస్ క్రీమ్ 8 క్యాండీ తయారీ కంపె నీలున్నాయి. అనధికారింగా వీటి సంఖ్య జిల్లాలో 120 వరకు ఉన్నాయి. ఎటువంటి బ్రాండ్లు లేకుండా నడిచేవి లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.80 కోట్ల వ్యాపారం జరుగుతుంటే ప్రజలకు విషాన్ని తినిపిస్తూ కొందరు వ్యాపారులు 60 శాతం లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్క వేసవి కాలంలో మాత్రం రూ.65 కోట్ల లాభాలు వస్తున్నాయంటే ఈ వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లోంచి అధికారులకు వెళుతున్న వాటాలు 10 శాతం. అంటే రూ.8 కోట్లు. ఇంత జరుగుతున్నా తినే ఐస్ క్రీమ్ ఏ రకమైందో తెలుసుకునే అవకాశం వినియోగదారుడికి ఉండడం లేదు. ఐస్ క్రీమ్‌ల విషయంలో సామాన్యులకు అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
పాటించేది ఎక్కడ?
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌లను తయారు చేసిన తర్వాత ఆ ప్యాక్‌పై తయారీ గడువు తేదీలను ము ద్రించడం లేదు. డిమాండ్ ఉన్నా లేకున్నా భారీగా తయారుచేసి నిల్వ ఉంచుతున్నారు. ఆర్డర్ వచ్చి సరుకును బయటికి పంపించే సమయంలో తయారీ తేదీని వేస్తున్నారు. కృత్రిమ రంగును పరిమితికి మించి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐస్ క్రీమ్ తయారీలో ఎంతో కీలకమైన నీటి నాణ్యత దారుణంగా ఉంటోంది. ఒక్కటంటే ఒక్క చోటకూడా శుద్ధినీటిని ఉపయోగించడం లేదు. కనీ సం తాగేనీళ్లను వాడకపోగా ఇంట్లో అంట్లు తోమడానికి ఉపయోగించేదానికన్నా దారుణంగా ఉంటోంది.
ప్రమాణాలు ఇవీ..
ఐస్ క్రీమ్‌లను పాల పదార్థాలతో తయారు చేయాలి. వీటిని పలు రకాల రుచులతో పాటు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో పరీక్షించి వినియోగించాలి. ఉత్పత్తుల్లోని కొవ్వు శాతం ఆధారంగా సమాచారాన్ని ప్యాకెట్‌పై ముద్రించాలి. ఐస్ క్రీమ్‌లను మరో రకమైన డెజర్ట్ పాలు లేదా కూరగాయల నుంచి తీసిన నూనె, కొవ్వుతో కూడా తయారుచేస్తారు. ఈ రెండింటిని కలిపి కూ డా తయారుచేసే అవకాశం ఉంది. ఈ రకమైన వాటిల్లో తక్కువ, మోస్త రు కొవ్వు అని రెండు రకాలుగా విభజించారు. తప్పనిసరిగా ఈ వివరా లు ప్యాకెట్‌పై ఉండాలి. పలు రకాల రుచుల కోసం ఐస్ క్రీమ్‌ల్లో సహజ, కృత్రిమ, సింతటిక్ రంగులను వాడొచ్చని చట్టం చెబుతోంది. టాట్రాజిన్, కార్మోసిన్, రూడామిన్, సన్‌సెట్ ఎల్లో వంటి వాటిని తయారీదారులు వాడుతున్నారు. వీటి పరిమితి 100 పీపీఎం దాటకూడదు. పాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్రీముల్లో కొవ్వు 2.5 శాతం మించకూడదు. ప్రొటీన్లు 3.5 శాతం, మొత్తం ఘన పదార్థాలు 26 శాతానికి తగ్గకూడదు. చక్కెర 10 శాతానికి మించకూడదు.
నాసిరకం పంచదార
కొంతమంది ఐస్ క్రీమ్ తయారీదారులు నాసిరకం పంచదారను వాడుతున్నారని తెలుస్తోంది. మరి కొంతమంది చక్కెరకు బదులుగా శాక్రీన్ వాడుతారు. దీనిని ఎక్కువగా ఐస్ ఫ్రూట్‌లలో వినియోగిస్తారు. ఇది కేన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుర్తించడం కష్టం
ఐస్ క్రీములు చెడిపోయాయో లేదో గుర్తించడం చాలా కష్టం. బూజు వాసన వచ్చినా, జిగురుగా ఉన్నా తినకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుబయట ఎక్కువసేపు నిల్వ ఉంచి తింటే బ్యాక్టీరియా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment