కొవ్వూరు మండలం కుమారదేవంలో డెలివరీ వాల్వ్ వద్ద శుభ్రం చేస్తున్న పంచాయతీ సిబ్బంది
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకు డెలివరీ వాల్వ్ ఉన్న గోతిలో పురుగుల మందు కలిపిన సంఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో గ్రామంలో ప్రజలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారదేవం గ్రామంలో ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న డెలివరీ వాల్వ్ గోతిలో గుర్తుతెలియని వ్యక్తులు పురుగు మందును కలిపారు. పంచాయతీ నైట్ వాచ్‌మెన్ దాసరి పోలయ్య వాల్వ్ పక్కన ఉన్న పురుగు మందు సీసాను గుర్తించి వాల్వ్ వద్ద నీరును పరిశీలించడంతో అనుమానపడ్డాడు.
దీంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో హు టాహుటిన ట్యాంకులో ఉన్న నీటిని అవుట్‌లెట్ వాల్వ్ ద్వారా బయటకు వదిలారు. అంతేకాకుండా గ్రామంలో టాంటాం ద్వారా నీటిని పట్టుకున్నవారు వాడవద్దని సమాచారం అందించారు. విషయం కుమారదేవంతో పాటు పరిసర గ్రామాలకు దావాలనంలా వ్యాపించింది. ఎవరు ఈ పని చేసుంటారు అంటూ ప్రతిఒక్కరూ చర్చించుకోవ డం కన్పించింది. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించడంతో పెనుప్రమాదమే తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కార్యదర్శి నాగేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించంతో కొవ్వూరు రూరల్ సీఐ కేవీవీ సత్యనారాయణ, ఎస్సై పి.రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పురుగు మందు ఉన్న సీసాను, నీటి శాంపిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment