చౌక స్పిరిట్‌.. కాస్ట్‌లీ లిక్కర్‌ | Adulteration Liquor Sale in Hyderabad | Sakshi
Sakshi News home page

చౌక స్పిరిట్‌.. కాస్ట్‌లీ లిక్కర్‌

Published Mon, Aug 26 2019 10:46 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

Adulteration Liquor Sale in Hyderabad - Sakshi

ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల మూతలు, స్టిక్కర్లు (ఫైల్‌)

సాక్షి.సిటీబ్యూరో: కొందరు మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి , ధనార్జనే ధ్యేయంగా తక్కువ ధరలో లభించే రెక్టిఫైడ్‌ స్పిరిట్‌లో క్యారామిల్‌ లిక్విడ్‌ను కలిపి పలు బ్రాండ్లకు చెందిన లిక్కర్‌ను తయారు చేస్తు సొమ్ముచేసుకుంటున్నారు. నగరంలోని పలు దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్వహించడంతో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టయ్యింది. ఇప్పటికే పోచంపల్లి, వికారాబాద్, బాలాపూర్‌లలో ఈ ముఠాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరికి ఈ దందాలో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

ఒరిజినల్‌కు తీసిపోని విధంగా...
డిస్టిలరీల్లో మద్యం తయారీలో  మొలాసిస్‌ను ఉపయోగించగా  మిగిలేదే రెక్టిఫైడ్‌ స్పిరిట్‌. ఈ రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను పలు డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసే వ్యాపారులు నగరంతో పాటు జిల్లాలకు తరలించి రహస్య ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం పలు బ్రాండ్లకు మూతలను సరఫరా చేసే సంస్థలను సంప్రదించి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేస్తున్నారు. అనంతరం మద్యం దుకాణాలు, పాత సీసాల విక్రయదారుల నుంచి పాత సీసాలను సేకరిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఆయా సీసాల్లో రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను నింపి దానికి మద్యం రంగు తీసుకొచ్చేందుకు క్యారామాల్‌ లిక్విడ్‌ను కలుపుతున్నారు. మద్యం కొనుగోలు చేసే వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు క్యాప్‌ సీలింగ్‌ మిషన్లతో ప్యాక్‌ చేసి, ప్రభుత్వం సరఫరా చేసినట్లుగా లేబుళ్లను అంటిస్తూ ఒరిజినల్‌ సీసాకు తగ్గకుండా తయారు చేస్తున్నారు.  ఇలా తక్కువ ధరలో కాస్ట్‌లీ మద్యాన్ని అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. 

వచ్చేనెలాఖరుతో ముగియనున్న గడువు
సెప్టెంబర్‌ నెల 30న ప్రస్తుత మద్యం పాలసీ ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అధిక శాతం మద్యం దుకాణాల ద్వారా వరుస ఎన్నికల ఎఫెక్ట్‌తో టార్గెట్‌కు మించి అమ్మకాలు నిర్వహించారు. టార్గెట్‌ ముగియడంతో ప్రభుత్వానికి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు చివరి రోజుల్లో అడ్డదారి సంపాదనకు అలవాటు పడి తక్కువ ధరలో దొరికే స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేసే వారితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారుల వరుస దాడులుతో అప్రమత్తమైన వ్యాపారులు దుకాణాల్లో ఉన్న కల్తీ మద్యాన్ని అక్కడి నుంచి తరలించేశారు. మరికొందరు నిర్వాహకులు బెల్డ్‌ షాపుల నిర్వాహకులకు అప్పు స్టాక్‌ను తరలించినట్లు సమాచారం. 

తీగ లాగితే డొంక కదలింది
ఈ నెల 14న భూదాన్‌ పోచంపల్లిలో రెక్టిపైడ్‌ స్పిరిట్, క్యారామిల్‌తో మద్యం తయారు చేస్తున్న మద్ది అనిల్‌ రెడ్డితో పాటు అతడికి సహకరిస్తున్న మద్ది నరేందర్‌ రెడ్డి, విక్రమ్‌ రెడ్డి తో పాటు జహీరాబాద్‌కు చెందిన మొగిలప్ప, హైదరాబాద్‌కు చెందిన మీర్‌ లాయక్‌ అలీ, ఔరంగాబాద్‌కు చెందిన సునీల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెక్టిఫైడ్‌ స్పిరిట్, క్యారామిల్, వేల సంఖ్యలో మద్యం సీసాల మూతలను స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్‌తో తయారు చేసిన మద్యం అమ్ముతున్న నారాయణపురంలోని ఓ మద్యం దుకాణాన్నిసీజ్‌ చేశారు.  
వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల  19న వికారాబాద్‌ జిల్లా, నాగుల పల్లి గ్రామానికి చెందిన బెస్త లక్ష్మణ్‌ ఇంటిపై దాడులు నిర్వహించి, స్పిరిట్, క్యారమిల్‌ లిక్విడ్, మద్యం బాటిళ్ల మూతలు, క్యాప్‌ సీజింగ్‌ మిషన్లు, 4 లీటర్ల రెక్టిఫైడ్‌ స్పిరిట్,   150 లేబుల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.  
బాలాపూర్‌ మండలం, జల్‌పల్లిలోని పారిశ్రామిక వాడలో ఓ   కంపెనీపై దాడి చేసి రెక్టిఫైడ్‌ స్పిరిట్, కల్తీ మద్యం, 72, 400 సీసా మూతలను స్వాధీనం చేసుకున్నారు. సుధీర్, లాయక్‌ అలీ, గోపాల్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

దొరికిన వారి సమాచారం ఆధారంగా
జూలై 11న కొండాపూర్‌లోని దుర్గా వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించగా పలు బ్రాండ్లకు చెందిన 80 మద్యం సీసాలను కల్తీ చేసినట్లు గుర్తించి దుకాణాన్ని సీజ్‌ చేశారు. నిందితులు ఇచ్చిన ఆధారాల మేరకు అగస్టు 12న కొత్తపేటలోని గున్ను వైన్స్‌పై దాడులు నిర్వహించి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కల్తీకి పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసులలో లభించిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ వేగవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement