సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కార్మికనగర్‌లో నివసించే మల్లె రామారావు(35) సెంట్రింగ్ వర్కర్. భార్య, పిల్లలు ఈ నెల 7న పెద్దపల్లిలో ప్రార్థనకు వెళ్లగా రామారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి జవహర్‌నగర్‌లోని సతీష్ వైన్స్ వద్ద మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే స్నేహితులతో జరిగిన గొడవలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు పిడిగుద్దులు గుద్దడం వల్లే రామారావు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు యువకులు గొడవ పడుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆ గొడవకు రామారావు చాలా దూరంలో ఉన్నట్లు గుర్తించారు.
ఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవని కార్డియక్ అరెస్ట్ వల్లే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులో గుండెపోటు రాగా వెనక్కి కుప్పకూలాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడి భార్య వరలక్ష్మి ఇచి్చన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment