మద్యం మత్తులో పోలీసులపై దాడి చేస్తున్న కమల్
శంషాబాద్: మద్యం, గంజాయి మత్తులో ఓ నేపాలీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో బీభత్సం సృష్టించాడు. పోలీసులంతా పాకిస్తాన్ ఏజెంట్లంటూ రెచ్చిపోయాడు. ఓ కానిస్టేబుల్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. మరో కానిస్టేబుల్ వద్ద నుంచి లాఠీ లాక్కుని కనిపించిన పోలీసులందరినీ కొట్టాడు. దాదాపు గంటన్నర పాటు హల్‌చల్ చేసిన కమల్ ఆపై స్టేషన్‌లోనే స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి లేచిన తర్వాత కూడా అదేవిధంగా ప్రవర్తించాడు. వివరాలిలా ఉన్నాయి.
కన్వెన్షన్ సెంటర్‌లో పనిచేస్తూ..
ఇరవై ఐదేళ్ల కమల్ పాయా అనే నేపాలీ శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం 6.30 సమయంలో మద్యం, గంజాయి మత్తులో జోగుతూ చొక్కా కూడా లేకుండా స్టేషన్ వద్దకు వచ్చాడు. లోపలికి ప్రవేశిస్తూ మెట్లపై పడిపోయాడు. అది చూసిన పోలీసు సిబ్బంది లేపి సహకరించడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్క ఉదుటున ఠాణాలోకి ప్రవేశించిన పాయా.. పోలీసులను హిందీలో అసభ్య పదజాలంతో దూషిస్తూ వీరంగం వేశాడు. సిబ్బందిపై దాడికి దిగాడు. శారీరకంగా బలిష్టంగా ఉన్న అతన్ని అదుపు చేసి, స్టేషన్ బయటకు తీసుకువెళ్లడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు.
బీఏసీ కౌంట్ 450
స్టేషన్ ఆవరణలోకి వెళ్లాక కొద్దిసేపు ఆగిన కమల్ మరోసారి పోలీసులపై చేయిచేసుకున్నాడు. మరో సారి ఠాణాలోకి చొరబడి అసభ్య పదజాలంతో పోలీసులను దూషించాడు. తర్వాత అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి లేచి.. తాను శంషాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉంటున్నానని, తనను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొడుతున్నారంటూ అరవడం మొదలుపెట్టాడు. అతన్ని కష్టమ్మీద పట్టుకున్న పోలీసులు యంత్రంతో శ్వాస పరీక్షించగా.. బీఏసీ కౌంట్ 450 వచ్చింది. దీంతో అతడిని స్టేషన్‌లోనే ఉంచి యజమానికి సమాచారమిచ్చారు. మద్యంతో పాటు గంజాయి కూడా సేవించడం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment