హోటల్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
కర్నూలు: హోటళ్లలో ఆహార పదార్థాల కల్తీపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. హోటళ్లలో పాచిపోయిన పదార్థాలు, రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలోని పలు హోటళ్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విక్టరీ టాకీస్ సమీపంలోని హిందూస్థాన్ హోటల్ గ్రాండ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. కిచెన్, డీఫ్రిజ్, డైనింగ్ రూం తదితర వాటిని పరిశీలించారు. కిచెన్‌లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు లోపాలు గుర్తించారు. ప్లేట్లు సరిగా శుభ్రం చేయకుండా వాడుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. పరిశుభ్రతకు సంబంధించిన విషయాలపై హోటల్ యజమానికి తగిన సూచనలిచ్చారు. ఆహార పదార్థాల నిల్వల్లో లోపాలను గుర్తించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ యజమానికి పై చర్యలుంటాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాసరెడ్డి, ఏఏఓ షన్ముఖ గణేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మినారాయణ, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, రాముడు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ హోటల్‌లో..
కర్నూలు ఆర్టీసీ బస్టాండులో ఉన్న బాలాజీ హోటల్‌లో విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. హోటలోని కిచెన్ రూం, డైనింగ్ సెక్షన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. హోటల్‌లో పరిశుభ్రత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంపిల్స్ సేకరణలో వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ నిర్వాహకులపై చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు.
వాహనాల తనిఖీ..
జిల్లాలో అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. కర్నూలు యూనిట్ బృందం గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 31 వాహనాలను తనిఖీలు నిర్వహించి తదుపరి చర్యలు నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. లైమ్‌స్టోన్, ఇతర మెటీరియల్‌ను తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేసి, రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. వారి నుంచి రూ.4.62 లక్షలు అపరాధ రుసుం వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. తనిఖీల్లో సీఐ లక్ష్మయ్యతో పాటు ఏఈ మధు, సిబ్బందిపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment