వికల్ప కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా, డీసీపీ సుమతి
రాంగోపాల్‌పేట: విద్య, ఉపాధి తదితర అవసరాల కోసం నగరానికి వచ్చే మహిళలు, యువతులను వ్యభిచార కూపంలోకి మళ్లించే ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా అన్నారు. బుధవారం రెజిమెంటల్ బజార్‌లోని ‘వికల్ప క్రైసిస్ కౌన్సెలింగ్ సెంటర్’ను ఉత్తర మండలం డీసీపీ సుమతితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రధాన రద్దీ ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు అధికంగా కార్యకలాపాలు సాగిస్తుండటం వల్ల అసాంఘి కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రజ్వల లాంటి ఎన్జీవోతో కలిసి కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా తాము సెక్స్‌వర్కర్లలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న 129 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇద్దరిపై పీడీ యాక్ట్, మరో ముగ్గురు నిందితులపై పీటా యాక్ట్ ప్రయోగించామన్నారు. ఇలాంటి వారికి ఇల్లు, హోటళ్లల్లో గది అద్దెకు ఇచ్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జీవనోపాధి కోసం నగరానికి వచ్చే మహిళలు, యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార ఊబిలోకి నెట్టే ముఠాలు నగరంలో 70 నుంచి 80 మంది ఉన్నట్టు గుర్తించామన్నారు. వీరిపై ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టామని, పక్కా ఆధారాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో మొట్టమొదటి సారిగా వికల్ప కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇతర జోన్లలో కూడా ఇలాంటి కేంద్రాలను నెలకొల్పే ఆలోచన ఉందన్నారు.
షీ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా
నగరం మొత్తం షీ టీమ్స్‌తో మహిళలు, యువతుల భద్రత కోసం షీటీమ్స్‌తో ప్రత్యేక నిఘా కొనసాగుతూనే ఉందని స్వాతి లక్రా తెలిపారు. వికల్ప సెంటర్ పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నకు సమాధానమిచ్చారు. కళాశాలలు, బస్టాండ్‌ల వద్ద మహిళలను వేధించే పోకిరీలను పట్టుకొనేందుకు షీ–టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. ఉత్తర మండలంలో 72 కళాశాలున్నాయని, 17 కళాశాలలో విద్యార్థులకు షీ–టీమ్స్ అవగాహన కల్పించడం, మొబైల్ యాప్స్ ఉపయోగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించామన్నారు.