మద్యం షాపుల అద్దెలపై రివర్స్‌ టెండర్లు | Reverse tenders on liquor store rentals | Sakshi
Sakshi News home page

మద్యం షాపుల అద్దెలపై రివర్స్‌ టెండర్లు

Published Thu, Jan 30 2020 4:41 AM | Last Updated on Thu, Jan 30 2020 11:07 AM

Reverse tenders on liquor store rentals - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్‌ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్‌ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

అద్దె టెండర్లలో గోల్‌మాల్‌
కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్‌ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. 

కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు
మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్‌ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు.

విజయవాడలో రూ.లక్షల్లో అద్దె
విజయవాడలో గతంలో లిక్కర్‌ మార్ట్‌లు నిర్వహించిన చోట ఏపీఎస్‌బీసీఎల్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను  ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్‌ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement