
నూజివీడు: ఓ పోలీస్ దొంగలా మారాడు. పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తుకు కాపాలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ జనార్దన్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించిన నగదు సుమారు రూ.16 లక్షలను గత నెల చివరి వారంలో బ్యాంకులకు సెలవులు కావడంతో పోలీస్‌స్టేషన్‌లోని ఓ పెట్టెలో భద్రపరిచారు. దాని తాళాలను ఆయన వద్దే ఉంచారు. అయితే ఈ నగదుతో పాటు, వేరే కేసులో రికవరీ చేసిన నగలను కూడా తీసుకుని 29వ తేదీ రాత్రి జనార్దన్ వెళ్లిపోయాడు.
అతను వెళ్లిన రెండు రోజుల తర్వాత విషయం వెలుగు చూడటంతో సీఐ వెంకటనారాయణ, పట్టణ ఎస్‌ఐ తలారి రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ లక్ష్మణ్ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లిన కానిస్టేబుల్ స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీపురం కావడంతో అక్కడకు ఒక బృందం వెళ్లింది. జనార్దన్ తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. ఈ సంఘటనపై సీఐ వెంకటనారాయణను వివరణ కోరగా.. కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. సొత్తు తీసుకుని వెళ్లాడా, లేక ఇంకెక్కడైనా దాచాడా.. అనే విషయం అతను దొరికితేగానీ తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment