1,095 మద్యం దుకాణాలు రద్దు! | AP Government Canceled 1095 Liquor Stores | Sakshi
Sakshi News home page

1,095 మద్యం దుకాణాలు రద్దు!

Published Fri, Jul 19 2019 3:58 AM | Last Updated on Fri, Jul 19 2019 3:59 AM

AP Government Canceled  1095 Liquor Stores - Sakshi

సాక్షి, అమరావతి : ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న నూతన మద్యం విధానంపై నిర్ణయాన్ని దాదాపు ఖరారు చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలని ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదిలావుంటే.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం పాలసీలను ఎక్సైజ్‌ అధికారుల బృందాలు ఇటీవలే అధ్యయనం చేశాయి. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌కు గురువారం నివేదికలు సైతం అందజేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు మద్యం షాపుల్ని నిర్వహిస్తున్న తీరును పరిశీలించిన అధికారులు సుదీర్ఘ నివేదికలను అందించగా, ఎక్సైజ్‌ కమిషనర్‌ వాటిని ప్రభుత్వానికి పంపించారు.

కేరళలో 306 దుకాణాలే
కేరళ రాష్ట్రంలో కేవలం 306 మద్యం షాపులు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో 36, ప్రభుత్వ అధీనంలో 270  దుకాణాలు ఉన్నాయి. కేరళలోని నగరాల్లో వాకింగ్‌ షాపుల ద్వారానే అధికంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇదిలావుంటే.. తమిళనాడులో అమలవుతున్న మద్యం పాలసీనే ఇంచుమించు ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడులోనూ అక్కడి ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిద్వారా 26,056 మందికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి దుకాణాల్లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 5,152 మద్యం షాపులు, 1,872 బార్లను తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  నిర్వహిస్తోంది. అక్కడ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీలలో షాపునకు ఓ సూపర్‌వైజర్‌ చొప్పున ఉంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని దుకాణాల్లో సేల్స్‌మెన్, అసిస్టెంట్‌ సేల్స్‌మెన్లు నలుగురు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ముగ్గురు, పంచాయతీలలో ఇద్దరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు.

25 శాతం దుకాణాలు కుదింపు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 25 శాతం తగ్గించాలని ప్రాథమికంగా నిర్థారించారు. మన రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. ఈ ఏడాది జూన్‌ నెలాఖరుతో లైసెన్స్‌ కాల పరిమితి ముగిసింది. మూడు నెలల పాటు లైసెన్స్‌ పొడిగించగా.. 700 దుకాణదారులు లైసెన్సుల్ని రెన్యువల్‌ చేసుకోలేదు. నూతన విధానం ప్రకారం 4,380 మద్యం షాపుల్లో 25 శాతం అంటే.. కనీసం 1,095 షాపులను తగ్గించే యోచనలో ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే మద్యం దుకాణాలు ఉంటాయని ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై జిల్లాల వారీగా ఎక్సైజ్‌ డెప్యూటీ కమిషనర్లు పరిశీలన జరుపుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement