
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఓ పార్టీ నేత చేసిన ఆరోపణలను సోమవారం ఓ ప్రకటనలో ఖండించింది. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టామని.. సక్రమంగా అమలవుతోందని వెల్లడించింది.
మద్యం నియంత్రణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని కూడా పేర్కొంది. కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్‌లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహిస్తుండగా మరికొన్ని దుకాణాల్లో ఎస్‌బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. జూలై 8న ఒక్కరోజే అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం 67,818 డిజిటల్ చెల్లింపులు చేశారు. దాదాపు రూ.1.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను డిజిటల్ చెల్లింపుల ద్వారానే నిర్వహించారు.
నగదు చెల్లింపులకు అనుమతి
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులతో పాటు నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. పేదలు తక్కువ ధర ఉన్న మద్యం కొనుగోలు చేసేందుకు గాను నగదు చెల్లింపులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు స్మార్ట్ ఫోన్లు, యూపీఐ యాప్‌లు ఉండవు. అందువల్ల నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment