beverages corporation
-
తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది! అందుకోసం సీఐడీ విభాగాన్ని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పదును పెట్టింది! వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నుతోంది.ప్రభుత్వ ‘ముఖ్య’ నేత ఆదేశాలతో స్వయంగా సీఐడీ ఉన్నతాధికారి తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధికారిక దాదాగిరీకి తెగబడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ క్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్లు చెబుతావా... లేదా?రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టిన మొదటి అక్రమ కేసు మద్యం కేసే! జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా... వైఎస్సార్సీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అక్రమాలకు పాల్పడ్డారంటూ జూన్ 24న సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు.అయితే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు పెట్టేందుకు సీఐడీ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఉన్నతాధికారి ఒకరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారు. తన కింది స్థాయి అధికారి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ‘మీకు ఓ కేసులో బెయిల్ వస్తే... మరో కేసు బనాయించి మరీ అరెస్ట్ చేస్తాం...! మీ సంగతి తేలుస్తాం..!’ అని బెదిరించారు. అనంతరం అసలు విషయాన్ని చెప్పేశారు! ‘మీరు ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోవాలి.మద్యం వ్యవహారం అంతా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి చేశారని వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్లిద్దరూ చెప్పినట్టే చేశానని 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలంలో పేర్కొనాలి..’ అని ఆదేశించారు. అలా కాదంటే లెక్కలేనన్ని కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తామన్నారు. వాస్తవాలతో పని లేదు.. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలి!సీఐడీ ఉన్నతాధికారి వేధింపులతో వాసుదేవరెడ్డి ఓ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే పారదర్శకంగా వాస్తవ విషయాలను ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించ లేదు. దాంతో సీఐడీ ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కారు. ‘వాస్తవాలు ఎవరు అడిగారు...? నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డే అంతా చేశారు...! వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వాలి.అది వాస్తవమా... అవాస్తవమా అన్నది నాకు అనవసరం. నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించారు. అంతేకాదు... వాసుదేవరెడ్డి సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘నేను చెప్పినట్టు తప్పుడు వాంగ్మూలం ఇస్తే... ఆమె చికిత్స వ్యవహారాలను ప్రశాంతంగా పర్యవేక్షించుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడతావ్’ అని బెదిరించడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.డీజీపీ పోస్టు ఎర.. అందుకే అంత బరితెగింపా...!వైఎస్సార్సీపీ ఎంపీలను అక్రమ కేసులతో వేధించేందుకు ‘ముఖ్య’ నేత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ఎర వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు తదుపరి డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే అంతకంటే ఒక మెట్టు తక్కువ స్థాయిలో ఉన్న సీఐడీ ఉన్నతాధికారికి డీజీపీ పోస్టు ఆశ చూపించడం గమనార్హం.ప్రస్తుత డీజీపీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఆ పోస్టును ఆశిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా కూడా వచ్చే ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తను చెప్పినట్టుగా ఆ ఇద్దరు విపక్ష ఎంపీలను అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆ ఉన్నతాధికారి బరితెగించి అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
మద్యం విక్రయాలపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): మద్యం విక్రయాల్లో చెల్లింపులు సక్రమంగా లేవంటూ ఒక చోట ప్రచారం.. మద్యం అమ్మకాల వల్లే ప్రజల ఆరోగ్యం చెడిపోతోందంటూ మరోచోట విమర్శలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఆమె విమర్శల తీరు ఉందని ఆపార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నరసాపురంలో ఓ ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి పురందేశ్వరి హడావుడి చేశారు. అక్కడ ఆమె చేసిన దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గట్టిగా తిప్పికొట్టింది. నరసాపురం మద్యం దుకాణంలో రూ. లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్లో కేవలం రూ. 700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని ఆమె అసత్య ఆరోపణలు చేశారు. అయితే ఆ మద్యం దుకాణంలో గురువారం రూ. 2,60,330 విలువైన మద్యాన్ని విక్రయించి ఆమేరకు ఖజానాకు జమ చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పురందేశ్వరి నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ రోజు ఎంత విలువైన మద్యాన్ని విక్రయించారని ప్రశ్నించారు.అందుకు ఆ సిబ్బంది రూ. లక్షకు పైగా మద్యాన్ని విక్రయించినట్టు తెలిపారు. ఆ దుకాణంలో అప్పటికి డిజిటల్ చెల్లింపులు రూ. 700 మేరకు జరిగాయి. అదే విషయాన్ని సిబ్బంది చెప్పారు. ఆ విషయాన్ని పురందేశ్వరి వక్రీకరిస్తూ రూ. లక్షకుపైగా మద్యం అమ్మినప్పటికీ కేవలం రూ. 700 మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. ఆ మద్యం దుకాణంలో నగదు, డిజిటల్ చెల్లింపులు కలిపి గురువారం మొత్తం రూ. 2,60,330 విలువైన మద్యం విక్రయానికి సంబంధించి శనివారం చలానా తీయడం ద్వారా రాష్ట్ర బెవరేజస్న్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేసింది. ఆ చలానా కాపీని కూడా మీడియాకు విడుదల చేసింది. దాంతో పురందేశ్వరి ఆరోపణలు కేవలం దు్రష్పచారమన్నది స్పష్టమైంది. కేజీహెచ్‌లో అబద్ధాలు ఇలా.. శనివారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి.. కేజీహెచ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్ల లివర్ పాడైపోయిందా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. 52 మంది వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, పురందేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవ పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఆమె మీడియాతో అబద్ధాలు మాట్లాడినట్లు స్పష్టమైంది. వార్డులో మొత్తం 52 పడకలున్నాయి. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ.. పురందేశ్వరి మాత్రం 52 మంది ఉన్నారని 39 మంది పరిస్థితి విషమంగా ఉందని అబద్ధం చెప్పారు. వార్డులో కేవలం 30 మంది మాత్రమే లివర్ సమస్యతో బాధపడుతున్నారని.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇందులో కొంతమంది ఆరోగ్యం కుదుట పడగా.. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని కూడా పురందేశ్వరి దవక్రీకరించి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేశారు. ఉన్న రోగుల్లో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడం, మసాలా, జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల అడ్మిట్ అయ్యారనీ.. ఐదుగురు మాత్రమే మద్యం బాధితులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. బీజేపీని నిందించడం సరికాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీని నిందించడం సరికాదని, ఆయన అరెస్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు రాష్ట్ర పరిధిలోని సీఐడీ విచారిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. -
Fact Check: అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఓ పార్టీ నేత చేసిన ఆరోపణలను సోమవారం ఓ ప్రకటనలో ఖండించింది. రాష్ట్రంలోని 2,934 మద్యం దుకాణాల్లోనూ ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టామని.. సక్రమంగా అమలవుతోందని వెల్లడించింది. మద్యం నియంత్రణకు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని కూడా పేర్కొంది. కొన్ని దుకాణాల్లో ఏపీ ఆన్లైన్ పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహిస్తుండగా మరికొన్ని దుకాణాల్లో ఎస్బీఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. జూలై 8న ఒక్కరోజే అన్ని దుకాణాల్లో కలిపి మొత్తం 67,818 డిజిటల్ చెల్లింపులు చేశారు. దాదాపు రూ.1.81 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను డిజిటల్ చెల్లింపుల ద్వారానే నిర్వహించారు. నగదు చెల్లింపులకు అనుమతి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులతో పాటు నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. పేదలు తక్కువ ధర ఉన్న మద్యం కొనుగోలు చేసేందుకు గాను నగదు చెల్లింపులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద డిజిటల్ చెల్లింపులు చేసేందుకు స్మార్ట్ ఫోన్లు, యూపీఐ యాప్‌లు ఉండవు. అందువల్ల నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. -
మద్యంపై మతిలేని ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు విపక్ష టీడీపీ రోజుకో కొత్త కుట్రకు తెర తీస్తోంది. ఇటీవల మార్ఫింగ్ వీడియోలు బెడిసికొట్టగా.. ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం ‘లిక్కర్ పర్చేజ్ ఐడీ కార్డులు’ ప్రవేశపెడుతోందంటూ అసత్యాలతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. టీవీ వార్త మాదిరిగా భ్రమింపజేసేలా రూపొందించిన ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి తప్పుదోవ పట్టిస్తోంది. వీడియోలో ఉన్న కథనాన్ని రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఖండించింది. ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగుతుందని పేర్కొంది. ఆదాయం కోసమంటూ బురద చల్లుడు.. రాష్ట్రంలో మద్యం కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ‘లిక్కర్ పర్చేజ్ ఐడీ కార్డులు’ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తెస్తోందని యూట్యూబ్ వీడియోలో విపక్షం దుష్ప్రచారం చేస్తోంది. ఏడాది కాలపరిమితితో రూ.5 వేల చొప్పున ఒక్కో కార్డు విక్రయిస్తారని, అది చూపిస్తేనే మద్యం విక్రయిస్తారని, ఆదాయం కోసం ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చిందని బురద చల్లుతోంది. అది పూర్తిగా ఆవాస్తవం ‘లిక్కర్ పర్చేజ్ కార్డులు’ జారీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో దురుద్దేశంతో కూడుకున్నదని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్రమాలు, సిండికేట్లకు తావివ్వకూడదనే మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయాల విధానంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. -
మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసే ఉద్దేశమే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దశలవారీగా మద్యం నియంత్రణకు కట్టుబడే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ నిర్వహణలో మద్యం దుకాణాలు ఉండటం ద్వారానే దశలవారీ మద్యం నియంత్రణ సాధించగలమన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి శనివారం స్పష్టం చేశారు. సెబీలో నమోదు చేసుకుని నిబంధనల మేరకే బాండ్ల జారీకి బేవరేజస్ కార్పొరేషన్ సన్నద్ధమవుతున్న తరుణంలో సంస్థ ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఆ చర్యలు ఇలా.. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనర్థాలే ► మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గుర్తించే ప్రభుత్వం 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను అధీనంలోకి తీసుకుంది. ► మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా అప్పటివరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించింది. ► మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఈ ఏడాది సెబీలో నమోదు చేసుకుని డిబెంచర్లు జారీ చేసింది. సెబీ నిబంధనల మేరకు పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనలతో పూర్తి ఆర్థిక క్రమశిక్షణతో బేవరేజస్ కార్పొరేషన్ లావాదేవీలు నిర్వహిస్తోంది. ► ఇటీవల కొన్ని వర్గాలు, పత్రికలు ప్రభుత్వ పనితీరుపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్థాల అవశేషాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తున్నాయి. అందుకోసమే చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీలో కొన్ని తప్పుడు పరీక్షలు చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ► కానీ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలు ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. కేవలం బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లు జారీ చేస్తున్న తరుణంలో ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ► అదే రీతిలో ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందని తాజాగా అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి తప్పుడు ఊహాగానాలను వ్యాప్తిలోకి తెచ్చారు. ఇది శోచనీయం. -
కల్తీ, అక్రమ మద్యానికి చెక్
సాక్షి, అమరావతి: కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త హోలోగ్రామ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విభిన్న ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్ రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2011 నుంచి మద్యం సీసాల మీద ముద్రిస్తున్న హోలోగ్రామ్ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో మద్యం కల్తీ, అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యపడటం లేదు. దీంతో దశాబ్దకాలంగా రాష్ట్రంలో మద్యం మాఫియా వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటంలేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం సీసాలపై ముద్రించేందుకు.. పాత విధానంలోని లోపాలను సరిదిద్ది 19 ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్‌ను రూపొందించింది. అధికారులు తనిఖీల్లో మద్యం సీసాలపై కొత్త హోలోగ్రామ్‌ను పరిశీలించగానే అవి అసలైనవా, కల్తీవా అన్నది సులభంగా గుర్తించవచ్చు. కొత్త హోలోగ్రామ్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.. ప్రస్తుతం ఉన్న హోలోగ్రామ్ కంటే కొత్తదాన్లో ‘డాట్స్ పర్ ఇంచ్ (డీపీఐ) రెండింతలు పెద్దగా పెట్టారు. పాత హోలోగ్రామ్‌లో డీపీఐ 6 వేలు ఉండగా కొత్తదాంట్లో 12 వేలు ఉంది. ప్రస్తుత హోలోగ్రామ్ సైజు 60*15 మిల్లీమీటర్లు ఉండగా కొత్తది 65*15 మిల్లీమీటర్లు ఉంది. కొత్త హోలోగ్రామ్‌లో ట్యాగంట్ ఆప్షన్ ఉంది. మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌పై రీడర్ పెట్టగానే అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మద్యం సీసాను అటూ ఇటూ కదిపితే ఆ హోలోగ్రామ్‌పై ఓ అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది. ‘ఓకే’ అనే పదం ఓ వైపునకు ‘టిక్ మార్కు’ మరోవైపునకు కదులుతాయి. దీన్లో కొత్తగా ‘టూ చానల్ ఎఫెక్ట్’ ఉంది. ‘రాస్టర్ టెక్ట్స్’ ఫీచర్ ఉంది. దానిపై కోడర్ ఫిల్మ్ పెడితే ‘ఎక్సైజ్’ అనే పదం కనిపిస్తుంది. కొత్త హోలోగ్రామ్‌పై 10 ఎక్స్ లెన్స్‌తో చూస్తేనే కనిపించే సూక్ష్మ అక్షరాలను ముద్రించారు. దీనిపై ‘వర్టికల్ స్విచ్ ఎఫెక్ట్’ పొందుపరిచారు. వీటిని పరిశీలించి ఆ మద్యం సీసా అసలైనదా.. కల్తీదా అనేది నిర్ధారిస్తారు. కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం రాష్ట్రంలో మద్యం సీసాలపై 2011 నుంచి ముద్రిస్తున్న హోలోగ్రామ్ విధానం లోపాలను సరిదిద్దుతూ కొత్త హోలోగ్రామ్ రూపొందించాం. టెక్నాలజీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని కొత్త భద్రతా ఫీచర్లను పొందుపరిచాం. కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా హోలోగ్రామ్‌ను డిజైన్ చేశాం. దీన్ని త్వరలోనే ప్రవేశపెడతాం. – డి.వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ -
మత్తు దిగాలి..
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుడుతోంది. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు దిశగా అడుగులు వే స్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ నూతన విధా నం అమల్లోకి వస్తుంది. ఈ నూతన పాలసీ అమలుకు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎచ్చెర్లలోని జిల్లా బేవరేజెస్ కార్యాలయం, గోదాం నుంచి మద్యం సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం మద్యం లైసెన్స్డ్ దుకాణాల నుంచి బెల్టుషాపులకు సరఫరా ప్రోత్సహిం చింది. తాగునీరు అందని గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారింది. ప్రస్తుతం జిల్లాలో 239 మద్యం షాపులున్నాయి. అవి 20 శాతం తగ్గనున్నాయి. జిల్లాలోని 14 ఎక్సైజ్ శాఖ సర్కిళ్ల పరిధిలో ప్రభుత్వమే 191 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. 20 శాతం దుకాణాలు తగ్గుతాయి. సెప్టెంబర్ చివరి వారంనాటికి షాపుల గుర్తింపు, ప్రతి షాపులో పనిచేసేందుకు సేల్స్ సూపర్వైజర్, గార్డులు, షాపు సామర్థ్యం మేరకు ఇద్దరు ముగ్గురు సేల్స్ సూపర్వైజర్లను నియమిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడ కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఎంపిక నిర్వహిస్తారు. ప్రతి మద్యం సీసా కొనుగోలుకు రశీదు తప్పనిసరి ఇస్తారు. ప్రభుత్వం పక్కాగా మద్యం రిటైల్ షాపులను నిర్వహిస్తుంది. అక్రమాలకు చరమగీతం.. గత ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్ మిక్సింగ్ కల్తీ చేయడం, ఎంఆర్పీ నిబంధనలు అమలు చేయకపోవటం, మద్యం దుకాణాలో లూజ్ సేల్, బెల్టుషాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాల వల్ల ఇటువంటి అక్రమాలకు అవకాశం ఉండదు. ప్రస్తుతం మద్యం దుకాణా లను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీలో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అమ్ముతారు. గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేది. వాస్తవంగా హైకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. హైకోర్టు ఆదేశాలను సైతం గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలున్నాయి. నూతన మద్యం పాలసీలో మద్యం షాపులు 20 శాతం కుదింపు, విచ్చలవిడి మద్యం అమ్మకాల నియంత్రణ, కచ్చితమైన సమయపాలన వంటివి ఉంటాయి. కసరత్తు ప్రారంభించాం.. నూతన మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభించాం. అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తాం. 191 మద్యం రిటైల్ దుకాణాలు ప్రారంభిస్తాం. పక్కాగా నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపులు నిర్వహిస్తాం. సమయపాలన ఉంటుంది. కొనుగోలుకు పక్కా రశీదులు ఇస్తాం. మొదటి దశలో 20 శాతం షాపుల కుదింపు జరుగుతుంది. –కె.కుమారస్వామి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ జిల్లా డిపో మేనేజర్ -
ఆంధ్రా ఉద్యోగులను పంపిస్తాం
బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను త్వరలోనే వారి రాష్ట్రానికి పంపించి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు తీసుకు వస్తామని టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు అన్నారు. గురువారం ఆయన ఎక్సైజ్ భవన్‌లోని తన నూతన కార్యాలయంలో ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేషన్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆంధ్రలో తెలంగాణకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారని, 10–15 రోజుల్లో అక్కడి వారిని ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. ఈమేరకు రెండు రాష్ట్రాల కార్పొరేషన్ ఎండీలు కలసి మాట్లాడుకున్నారని తెలిపారు. త్వరలోనే 135 పోస్టులకు నోటిఫికేషన్ కార్పొరేషన్‌కు వివిధ స్థాయిల్లో మొత్తం 258 ఉద్యోగులు అవసరం కాగా, ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని దేవీప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిపోల కోసం 55 పోస్టులను కలుపుకొని త్వరలో135 పోస్టులకు నియామకాలు చేపట్టాలను కుంటున్నట్టు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అనుమతి ఇచ్చారని చెప్పారు. మద్యం విక్రయాలు పెరిగాయి... రాష్ట్రంలో డిమాండ్‌కు తగినంత మద్యం ఉత్పత్తి ఉందని దేవీప్రసాద్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు పెరిగాయని చెప్పారు. మద్యం పంపిణీ కోసం 18 డిపోలు ఉన్నాయన్నారు. అయితే రవాణా ఇబ్బందిగా మారిందని దుకాణదారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా డిపోలు పెట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. -
వెయ్యి కోట్లు కట్టాల్సిందేనా?
రాష్ట్ర ఆబ్కారీకి సర్వీస్ ట్యాక్స్ చిక్కులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖకు సర్వీస్ ట్యాక్స్ విభాగం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, బాట్లింగ్‌కు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించ లేదని నిర్ధారించిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మూడు రోజుల క్రితం సెర్చ్ వారెంట్లతో రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం సరఫరా, డిపోల నిర్వహణ చూసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే బకాయిలను వసూలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ విభాగం భావించింది. రెండు రాష్ట్రాలకు కలిపి సర్వీస్ ట్యాక్స్ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉన్నట్లు లెక్కలు తేలడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎక్సైజ్ శాఖ ద్వారా సర్వీస్ ట్యాక్స్ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిర్దేశిత అంశాలు, ఇప్పటి వరకు వివిధ శాఖల్లో జరిగిన పంపకాల తీరును సర్వీస్టాక్స్ అధికారులకు వివరించడంతో 2010-11 నుంచి 2013-14 వరకు చెల్లించాల్సిన సర్వీస్ ట్యాక్స్‌ను రెండు రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు జనాభా, మద్యం డిపోల్లో నిర్దేశిత సేవల ఆధారంగా పన్నును విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తదనుగుణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విలువను మదింపు చేసిన అధికారులు సోమవారం డిమాండ్ తుది నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో కూడా నోటీసుల్లో పేర్కొని, 30 రోజుల గడువిచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. -
పన్ను చెల్లించమంటే.. పళ్లూడగొట్టే యత్నం!
ఎచ్చెర్ల : కంచే చేను మేస్తోంది. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఐటీ శాఖకు చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టేందుకు దొడ్డిదారులు వెతుకుతోంది. బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన పన్ను బకాయిల నేపథ్యంలో ఐటీ శాఖ గోదాములను సీజ్ చేయడంతో.. ఆ గోదాములతో పని లేకుండా ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో నేరుగా మద్యం షాపులకు సరుకు సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రూ. 154 కోట్లు ఆదాయ పన్ను బకాయిపడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆదాయ పన్ను శాఖ నోటీ సులు చేయడంతోపాటు ఈ నెల రెండో తేదీన బేవరేజెస్ కార్పొరేషన్ గోదాములను సీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినందున ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని అందరూ భావించారు. అయితే కేంద్ర ఐటీ శాఖ పన్ను చెల్లించాల్సిందేనని పట్టుపడుతుండగా.. అంత మొత్తం చెల్లించలేక బేవరేజెస్ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఫలితంగా కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకు గత ఆరు రోజులుగా సరుకు సరఫరా నిలిచిపోయింది. కార్పొరేషన్‌కు మంగళం? మద్యం కంపెనీల నుంచి వచ్చిన నిల్వలను స్వీకరించి జిల్లాలోని 157 మద్యం షాపులకు, 16 బార్లకు బేవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుండగా, మిగతా వ్యవహారాలన్నింటినీ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. పన్ను చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి అప్పులు తీర్చే బాధ్యత ఏపీ బేవరేజెస్‌కు అప్పగించి, దాన్ని అంచెలంచెలుగా ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఐదు నెలల నుంచి ఏపీ బేవరే జెస్ ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించకపోవడం ఇందులో భాగమేనని ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేషన్‌ను ఎత్తేవేసి ఎక్సైజ్ శాఖకు మొత్తం బాధ్యతలు అప్పగించటం, కేంద్ర ప్రభుత్వ టాక్స్‌ను సైతం ఎగ్గొట్టడం ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎచ్చెర్లలోని ఈ కార్పొరేషన్ గోదాం వద్ద మద్యం నిల్వలతో వచ్చిన 45 వరకు లారీలు అన్ లోడింగ్ కోసం కొన్ని రోజులుగా నిరీక్షిస్తున్నాయి. వీటిని వేరే చోటుకు తరలించి వైన్‌షాపులు, బార్లకు సరుకు తరలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేసే పనిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపు విషయాన్ని పట్టించుకోకుండా అడ్డదారిలో మద్యం ప్రయత్నాల్లో నిమగ్నమైంది. మరోవైపు కొద్దిరోజులుగా మద్యం సరఫరా నిలిచిపోవడాన్ని మద్యం షాపుల వారు సొమ్ము చేసుకుంటున్నారు. సరుకు లేదని చెప్పి ధరలు పెంచేశారు. క్వార్టర్ బాటిల్ ధరను 15 నుంచి 20 వరకు పెంచి అమ్ముతున్నారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే ఎక్సైజ్ అధికారులే అమ్మమంటున్నారని నిర్భీతిగా సమాధానం చెబుతున్నారు. ఒకపక్క ఏడు శాతం పెరిగిన రేటు.. మరోవైపు సరఫరా లేదన్న సాకుతో పెంచిన ధర.. వెరసి మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. దీనిపై ఎచ్చెర్ల బేవరేజెస్ డిపో మేనేజర్ కె.విక్టోరియారాణి మాట్లాడుతే గోదాం తెరిచే విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. మరోపక్క సరుకుతో వచ్చిన లారీల సిబ్బంది బేవరేజెస్ కార్పొరేషన్ గోదాం వద్ద కనీస సౌకర్యాలు గానీ, నిలువ నీడ గానీ లేక నానా అవస్థలు పడుతున్నారు. -
హమాలీలకు పని భద్రత కల్పించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బేవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న హమాలీలకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చే స్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవారానికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హమాలీలు, సీఐటీయూ నాయకులు కలెక్టరేట్ వద్ద ఉన్న దీక్ష శిబిరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు. బేవరేజస్ కార్పొరేషన్ ఐఎంఎఫ్ఎల్ గౌడన్లలో టెండర్ విధానాన్ని రద్దుచేయాలని, హమాలీలకు పనిభద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి బత్తుల గణపతి మాట్లాడుతూ హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా పని చేస్తున్న హమాలీలను వెళ్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితం లేదని అన్నారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికులకు పీఎఫ్‌తో పాటు యూనిఫాం, జనశ్రీ బీమా పథకం, బోనస్, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దిగుమతి రేటును రూ.5 లకు పెంచాలని, డిపోల వద్ద కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు భూక్యా శ్రీను, విష్ణువర్ధన్, నర్సింహరావు, కుమారి, హమాలీల సంఘం నాయకులు మట్టయ్య, కిరణ్‌కుమార్, రామారావు, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.