బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి బెదిరింపులు
ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్లు చెప్పాలని వేధింపులు
మద్యం అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రభుత్వ పెద్దల పన్నాగం
‘ముఖ్య’నేత ఆదేశంతో సీఐడీ ఉన్నతాధికారి దాదాగిరీ ఇదీ
డీజీపీ పోస్టు ఎర వేయడంతో బరితెగించి వేధింపులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది! అందుకోసం సీఐడీ విభాగాన్ని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పదును పెట్టింది! వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నుతోంది.
ప్రభుత్వ ‘ముఖ్య’ నేత ఆదేశాలతో స్వయంగా సీఐడీ ఉన్నతాధికారి తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధికారిక దాదాగిరీకి తెగబడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ క్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.
సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్లు చెబుతావా... లేదా?
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టిన మొదటి అక్రమ కేసు మద్యం కేసే! జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా... వైఎస్సార్‌సీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అక్రమాలకు పాల్పడ్డారంటూ జూన్ 24న సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు.
అయితే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు పెట్టేందుకు సీఐడీ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఉన్నతాధికారి ఒకరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారు. తన కింది స్థాయి అధికారి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ‘మీకు ఓ కేసులో బెయిల్ వస్తే... మరో కేసు బనాయించి మరీ అరెస్ట్ చేస్తాం...! మీ సంగతి తేలుస్తాం..!’ అని బెదిరించారు. అనంతరం అసలు విషయాన్ని చెప్పేశారు! ‘మీరు ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోవాలి.
మద్యం వ్యవహారం అంతా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి చేశారని వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్లిద్దరూ చెప్పినట్టే చేశానని 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలంలో పేర్కొనాలి..’ అని ఆదేశించారు. అలా కాదంటే లెక్కలేనన్ని కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తామన్నారు.
వాస్తవాలతో పని లేదు.. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలి!
సీఐడీ ఉన్నతాధికారి వేధింపులతో వాసుదేవరెడ్డి ఓ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే పారదర్శకంగా వాస్తవ విషయాలను ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించ లేదు. దాంతో సీఐడీ ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కారు. ‘వాస్తవాలు ఎవరు అడిగారు...? నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డే అంతా చేశారు...! వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వాలి.
అది వాస్తవమా... అవాస్తవమా అన్నది నాకు అనవసరం. నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించారు. అంతేకాదు... వాసుదేవరెడ్డి సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘నేను చెప్పినట్టు తప్పుడు వాంగ్మూలం ఇస్తే... ఆమె చికిత్స వ్యవహారాలను ప్రశాంతంగా పర్యవేక్షించుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడతావ్’ అని బెదిరించడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.
డీజీపీ పోస్టు ఎర.. అందుకే అంత బరితెగింపా...!
వైఎస్సార్‌సీపీ ఎంపీలను అక్రమ కేసులతో వేధించేందుకు ‘ముఖ్య’ నేత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ఎర వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు తదుపరి డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే అంతకంటే ఒక మెట్టు తక్కువ స్థాయిలో ఉన్న సీఐడీ ఉన్నతాధికారికి డీజీపీ పోస్టు ఆశ చూపించడం గమనార్హం.
ప్రస్తుత డీజీపీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఆ పోస్టును ఆశిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా కూడా వచ్చే ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తను చెప్పినట్టుగా ఆ ఇద్దరు విపక్ష ఎంపీలను అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆ ఉన్నతాధికారి బరితెగించి అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment