ఆంధ్రా ఉద్యోగులను పంపిస్తాం
బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను త్వరలోనే వారి రాష్ట్రానికి పంపించి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు తీసుకు వస్తామని టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు అన్నారు. గురువారం ఆయన ఎక్సైజ్ భవన్‌లోని తన నూతన కార్యాలయంలో ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు.
కార్పొరేషన్‌లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆంధ్రలో తెలంగాణకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారని, 10–15 రోజుల్లో అక్కడి వారిని ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. ఈమేరకు రెండు రాష్ట్రాల కార్పొరేషన్ ఎండీలు కలసి మాట్లాడుకున్నారని తెలిపారు.
త్వరలోనే 135 పోస్టులకు నోటిఫికేషన్
కార్పొరేషన్‌కు వివిధ స్థాయిల్లో మొత్తం 258 ఉద్యోగులు అవసరం కాగా, ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని దేవీప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిపోల కోసం 55 పోస్టులను కలుపుకొని త్వరలో135 పోస్టులకు నియామకాలు చేపట్టాలను కుంటున్నట్టు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అనుమతి ఇచ్చారని చెప్పారు.
మద్యం విక్రయాలు పెరిగాయి...
రాష్ట్రంలో డిమాండ్‌కు తగినంత మద్యం ఉత్పత్తి ఉందని దేవీప్రసాద్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు పెరిగాయని చెప్పారు. మద్యం పంపిణీ కోసం 18 డిపోలు ఉన్నాయన్నారు. అయితే రవాణా ఇబ్బందిగా మారిందని దుకాణదారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా డిపోలు పెట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.