మద్యంపై సర్వీస్‌ట్యాక్స్ తప్పించుకునేదెలా?
- ఢిల్లీస్థాయిలో సర్కార్ యత్నం
- ఢిల్లీ వెళ్లిన ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్
సాక్షి, హైదరాబాద్: సర్వీస్‌ట్యాక్స్ నిబంధనలను కేంద్రం సవరించిన నేపథ్యంలో మద్యం విక్రయాలపై పన్నుభారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సర్వీస్ ట్యాక్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అనుబంధ సంస్థ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ను మినహాయింపు పొందేందుకు ఢిల్లీలో ఓ కన్సల్టెన్సీని సంప్రదించడంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ(ఎక్సైజ్)శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్, టీఎస్‌బీసీఎల్ ఎండీ ఆర్.వి. చంద్రవదన్, డెరైక్టర్ సంతోష్‌రెడ్డి, ఓ న్యాయవాదితో కలసి సోమవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వ రంగ సంస్థగా, ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తే ఏటా సుమారు రూ. 600 కోట్లకు పైగానే సమర్పించుకోవాలి. దీన్ని నివారించేందుకు కన్సల్టెన్సీ ద్వారా తతంగం నడపాలని అధికారులు నిర్ణయించారు.
చివరికి కన్సల్టెన్సీ సాయంతో...
రాష్ట్రంలో టీఎస్‌బీసీఎల్ ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయి. గత ఏడాది సుమారు రూ. 12 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలను టీఎస్‌బీసీఎల్‌కు చెం దిన 17 డిపోల ద్వారా నే జరిపారు. కంపెనీల చట్టం ప్రకారం ఆదా యం పొందే ఏ సంస్థ అయినా ఆదాయపు పన్ను తోపాటు సర్వీస్ ట్యాక్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ మేరకు గత ఏడాది ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వ ఖాతా నుంచి రూ.1,240 కోట్లు లాగేసుకుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సర్కార్ తంటాలు పడింది. కేంద్రస్థాయిలో పైరవీలు జరిపి ఆర్థికశాఖ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి తెప్పించుకుంది.
సర్వీస్‌ట్యాక్స్‌కు సంబంధించి కూడా టీఎస్‌బీసీఎల్‌కు నోటీసులు జారీ కాగా, అప్రమత్తమైన ప్రభుత్వం కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అధికారులతో చర్చించి పన్ను మినహాయిం పు పొందారు. ఇటీవల కేంద్రం సర్వీస్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం టీఎస్‌బీసీఎల్ కూడా పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ రెవె న్యూ(ఎక్సైజ్), టీఎస్‌బీసీఎల్ ఎండీ చంద్రవదన్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. సర్వీస్‌ట్యాక్స్ చెల్లించకుండా మినహాయింపు పొంద డానికి మల్లగుల్లాలు పడ్డ అధికారులు కన్సల్టెన్సీ ద్వారా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.