
మద్యం విధానంపై అక్రమ కేసులో సీఐడీ బెదిరింపులు
మాట వినకుంటే తీవ్ర పరిణామాలు.. అంతు చూస్తామని హెచ్చరిక
ముఖ్యనేత ఆదేశాలతో పక్కా పన్నాగం
అబద్ధపు వాంగ్మూలం, తప్పుడు సాక్ష్యాలతో తిమ్మిని బమ్మిని చేసే కుట్ర
బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డికి తీవ్ర వేధింపులు
ఇప్పటికే ఉద్యోగి సత్య ప్రసాద్‌ను వేధించి దారికి తెచ్చుకున్న దర్యాప్తు సంస్థ
ఇక వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డిలపై గురి.. హైదరాబాద్ చేరుకున్న సీఐడీ బృందాలు!
టార్గెట్ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి
తనిఖీల పేరిట తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు రంగం సిద్ధం
డీజీపీ కార్యాలయం మార్గదర్శకత్వంలో కుట్రను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్‌పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్‌లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది.
ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!
చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే రెడ్‌బుక్ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది.
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం.
కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది.
రప్పించి.. రహస్యంగా రికార్డింగ్!
రెడ్ బుక్ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యాలయంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సీఐడీ అదుపులో సత్యప్రసాద్...
అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్‌ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.
ఇక టార్గెట్ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!
సత్య ప్రసాద్‌ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల
బృందాలను ఇప్పటికే హైదరాబాద్ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.
అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!
వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్ కార్పొరేషన్‌లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్‌తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్‌పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.
తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!
రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్ డ్రైవ్‌లు, సీడీలు, హార్డ్ డిస్క్‌లలో స్టోర్ చేస్తారు.
అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిలరీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదేరుతారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment