సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): మద్యం విక్రయాల్లో చెల్లింపులు సక్రమంగా లేవంటూ ఒక చోట ప్రచారం.. మద్యం అమ్మకాల వల్లే ప్రజల ఆరోగ్యం చెడిపోతోందంటూ మరోచోట విమర్శలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఆమె విమర్శల తీరు ఉందని ఆపార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నరసాపురంలో ఓ ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి పురందేశ్వరి హడావుడి చేశారు. అక్కడ ఆమె చేసిన దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గట్టిగా తిప్పికొట్టింది.
నరసాపురం మద్యం దుకాణంలో రూ. లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్లో కేవలం రూ. 700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని ఆమె అసత్య ఆరోపణలు చేశారు. అయితే ఆ మద్యం దుకాణంలో గురువారం రూ. 2,60,330 విలువైన మద్యాన్ని విక్రయించి ఆమేరకు ఖజానాకు జమ చేసినట్టు బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పురందేశ్వరి నరసాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ రోజు ఎంత విలువైన మద్యాన్ని విక్రయించారని ప్రశ్నించారు.అందుకు ఆ సిబ్బంది రూ. లక్షకు పైగా మద్యాన్ని విక్రయించినట్టు తెలిపారు. ఆ దుకాణంలో అప్పటికి డిజిటల్ చెల్లింపులు రూ. 700 మేరకు జరిగాయి.
అదే విషయాన్ని సిబ్బంది చెప్పారు. ఆ విషయాన్ని పురందేశ్వరి వక్రీకరిస్తూ రూ. లక్షకుపైగా మద్యం అమ్మినప్పటికీ కేవలం రూ. 700 మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేశారు. ఆ మద్యం దుకాణంలో నగదు, డిజిటల్ చెల్లింపులు కలిపి గురువారం మొత్తం రూ. 2,60,330 విలువైన మద్యం విక్రయానికి సంబంధించి శనివారం చలానా తీయడం ద్వారా రాష్ట్ర బెవరేజస్‌న్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఖజానాలో జమ చేసింది. ఆ చలానా కాపీని కూడా మీడియాకు విడుదల చేసింది. దాంతో పురందేశ్వరి ఆరోపణలు కేవలం దు్రష్పచారమన్నది స్పష్టమైంది.
కేజీహెచ్‌లో అబద్ధాలు ఇలా..
శనివారం విశాఖలో పర్యటించిన పురందేశ్వరి.. కేజీహెచ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డును సందర్శించి లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్ల లివర్ పాడైపోయిందా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. 52 మంది వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కాగా, పురందేశ్వరి వ్యాఖ్యల్లో వాస్తవ పరిస్థితుల్ని వైద్యుల సమక్షంలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు ఆమె మీడియాతో అబద్ధాలు మాట్లాడినట్లు స్పష్టమైంది. వార్డులో మొత్తం 52 పడకలున్నాయి. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ.. పురందేశ్వరి మాత్రం 52 మంది ఉన్నారని 39 మంది పరిస్థితి విషమంగా ఉందని అబద్ధం చెప్పారు.
వార్డులో కేవలం 30 మంది మాత్రమే లివర్ సమస్యతో బాధపడుతున్నారని.. ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇందులో కొంతమంది ఆరోగ్యం కుదుట పడగా.. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని కూడా పురందేశ్వరి దవక్రీకరించి మీడియా ముందు తప్పుడు ప్రచారం చేశారు. ఉన్న రోగుల్లో చాలా మంది ఆహార నియమాలు పాటించకపోవడం, మసాలా, జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల అడ్మిట్ అయ్యారనీ.. ఐదుగురు మాత్రమే మద్యం బాధితులు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు.
బీజేపీని నిందించడం సరికాదు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని బీజేపీని నిందించడం సరికాదని, ఆయన అరెస్టుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసు రాష్ట్ర పరిధిలోని సీఐడీ విచారిస్తోందన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మద్యం విక్రయాల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment