వాసుదేవరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దశలవారీగా మద్యం నియంత్రణకు కట్టుబడే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ నిర్వహణలో మద్యం దుకాణాలు ఉండటం ద్వారానే దశలవారీ మద్యం నియంత్రణ సాధించగలమన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని పునరుద్ఘాటించింది.
రాష్ట్రంలో మద్యం దుకాణాలను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి శనివారం స్పష్టం చేశారు. సెబీలో నమోదు చేసుకుని నిబంధనల మేరకే బాండ్ల జారీకి బేవరేజస్ కార్పొరేషన్ సన్నద్ధమవుతున్న తరుణంలో సంస్థ ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఆ చర్యలు ఇలా..
ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనర్థాలే
► మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గుర్తించే ప్రభుత్వం 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను అధీనంలోకి తీసుకుంది.
► మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా అప్పటివరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించింది.
► మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఈ ఏడాది సెబీలో నమోదు చేసుకుని డిబెంచర్లు జారీ చేసింది. సెబీ నిబంధనల మేరకు పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనలతో పూర్తి ఆర్థిక క్రమశిక్షణతో బేవరేజస్ కార్పొరేషన్ లావాదేవీలు నిర్వహిస్తోంది.
► ఇటీవల కొన్ని వర్గాలు, పత్రికలు ప్రభుత్వ పనితీరుపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్థాల అవశేషాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తున్నాయి. అందుకోసమే చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీలో కొన్ని తప్పుడు పరీక్షలు చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
► కానీ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలు ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. కేవలం బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లు జారీ చేస్తున్న తరుణంలో ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు.
► అదే రీతిలో ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందని తాజాగా అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి తప్పుడు ఊహాగానాలను వ్యాప్తిలోకి తెచ్చారు. ఇది శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment