
కర్నూలు: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల వద్దనున్న చెక్‌పోస్టు వద్ద బుధవారం తెల్లవారుజామున ఎస్‌ఈబీ సిబ్బంది హైదరాబాద్ నుంచి మధురై వెళుతోన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును తనిఖీలు చేశారు. అందులో ప్రయాణిస్తోన్న హైదరాబాద్ (తిరుమలగిరి అస్మత్‌పేట)కు చెందిన యశ్వంత్‌సోని, మహారాష్ట్రలోని వాజర్‌కి చెందిన నిఖిల్ రాజ్‌కుమార్ బోండే వద్ద రూ.1,04,94,132 విలువ చేసే వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి.
వీరు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని క్రిష్ ఇంటర్నేషనల్ జ్యువెలర్స్ నుంచి బంగారు ఆభరణాలను మధురైకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో నగలను సీజ్ చేసి..ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. నగలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.