బాక్సైట్ గనులపై బాబు గురి! | Chandrababu eyeing on bauxite Mines | Sakshi
Sakshi News home page

బాక్సైట్ గనులపై బాబు గురి!

Published Sat, Aug 16 2014 12:54 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

బాక్సైట్  గనులపై బాబు గురి! - Sakshi

బాక్సైట్ గనులపై బాబు గురి!

  • కార్యాచరణ వేగవంతం చేసిన ప్రభుత్వం
  •   గిరిజనుల వ్యతిరేకత బేఖాతరు
  •   అస్మదీయులతోనే గ్రామసభల ఏర్పాటుకు వ్యూహం
  •   బాక్సైట్ తవ్వకాలకు అనుమతులే అసలు లక్ష్యం
  •   ఒడిశా ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని ప్రభుత్వం
  •   బాక్సైట్ తవ్వకాలతో ఏటా 3,600 కోట్ల ఆదాయం
  •   కానీ అందులో సర్కారుకు దక్కేది రూ.75కోట్ల రాయల్టీ మాత్రమే
  •  
     విశాఖ ఏజెన్సీలో మూడు గ్రూపుల కింద అరకు, చింతపల్లి ప్రాంతాల్లో 3,561  హెక్టార్లలో దాదాపు 564.9మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. 
     
     విశాఖ ఏజెన్సీలో తవ్వకాలు చేపట్టిన కంపెనీకి ఏడాదికి 3,600 కోట్ల రూపాయల నికరలాభం వస్తుందని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) అంచనా.  కానీ దీనిలో ప్రభుత్వానికి ఏడాదికి 75 కోట్ల రూపాయల రాయల్టీ మాత్రమే వస్తుంది. 
     
     బాక్సైట్ ఖనిజాన్ని అల్యూమినియం ఉత్పత్తిలో వాడతారు. ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తి చేయాలంటే 5.6 టన్నుల బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అల్యూమినియం ఉత్పత్తి క్రమంలో 1.2 టన్నుల అత్యంత విషపూరితమైన రెడ్‌మడ్ కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనిపై గిరిజనులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
     
     సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది... గిరిజన ప్రాంతాలు, గిరిజనుల హక్కుల పరిరక్షణకోసం పీసా చట్టం ఉంటే మాత్రం లెక్కేముంది... గిరిజనులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గిరిజనుల చేతివేళ్లతోనే వారి కళ్లు పొడిచేందుకు ఆగమేఘాలమీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడూ ఈ గ్రామసభల గురించి పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. ఐటీడీఏ, ఏపీఎండీసీ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుపుతామని చెబుతున్నప్పటికీ, ఆ పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమే లక్ష్యమని తెలుస్తోంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో నెలరోజుల్లోనే గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఈ నెల 8, 9 తేదీలలో విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీంతో పాడేరు ఐటీడీయే అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌ను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
     
     564.9 మిలియన్ టన్నులు
     విశాఖ ఏజెన్సీలో 564.9 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 75 సంవత్సరాలు తవ్వుకోవచ్చు. పీసా చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదం లేకుండా తవ్వకాలు సాధ్యంకాదు. దీంతో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులతోనే గ్రామ సభలను ఏర్పాటు చేసి, అనంతరం ఆ సభల ద్వారా తవ్వకాలకు ఆమోదం పొందేలా సర్కారు అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీలతోపాటు నాతవరం మండలంలోని నాలుగు పంచాయతీల పరిధిలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ పరిధిలో 3 నుంచి 7 వరకు గ్రామాలు ఉన్నాయి. అందుకే మొత్తం 288 పంచాయతీలలో సగటున పంచాయతీకి 3 చొప్పున దాదాపు 776 గ్రామసభలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆగస్టు 16న ఈ ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబర్ 9నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశారు. 
     
     గతంలో బోల్తాపడ్డ ఒడిశా ప్రభుత్వం
     
     ఒడిశాలోని నియోమగిరి పర్వతాల్లో అపారంగా ఉన్న  బాక్సైట్ నిక్షేపాల తవ్వకాల కోసం ఒడిశా ప్రభుత్వం కూడా గ్రామసభలను మేనేజ్ చేసింది. తమ పార్టీ సానుభూతిపరులతో ఏర్పాటు చేసిన గ్రామసభల ఆమోదాన్ని పొంది వేదాంత సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చేసింది. కానీ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన గిరిజనులు సుప్రీంకోర్డును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో మళ్లీ గ్రామసభలు నిర్వహించగా అసలు వ్యవహారం బట్టబయలైంది. దాంతో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి వచ్చింది. మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ వేస్తే అలాంటి పరిణామమే పునరావృతమవుతుందని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయమూర్తి సమక్షంలోనే పారదర్శకంగా గ్రామసభలు తీర్మానం చేసేలా తాము ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నాయి. 
     
     ఆనాడే చంద్రబాబు దొంగాట
     కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పరిశీలిస్తున్న సమయంలో గిరిజనులు, ప్రజాసంఘాలు ఉద్యమించాయి. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ ప్రజాసంఘాల నేతకు ఫోన్ చేసి తాను బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో కలసి పనిచేస్తానని చెప్పారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘‘మీరు అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు చేపట్టమని హామీ ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని మాతో ఉద్యమంలో కలుపుకుని వెళతాం’’అని ఆయన షరతు విధించారు. ఆ వెంటనే చంద్రబాబు మాటమార్చేసి అంతటితో ఆ ఫోన్ సంభాషణను అర్ధంతరంగా ముగించేశారు. ఆ ఉదంతాన్నే ఆ సామాజిక కార్యకర్త చెబుతూ చంద్రబాబు వైఖరి మొదటి నుంచీ అంతేనని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఒడిశాలో మాదిరిగానే ఇక్కడ కూడా తాము న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేస్తామని చెప్పారు. 
     
     పీసా చట్టం ఏం చెప్తోంది?
     కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 1996లో పంచాయతీ(షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరీకరణ) చట్టాన్ని రూపొందించింది. దీన్నే పీసా చట్టం అంటారు. అందుకు అనుగుణంగా 1998లో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ (సవరణ) చట్టం చేసింది. ఆ ప్రకారం గ్రామసభలకు విశేష అధికారాలు అప్పగించింది. తదనుగుణంగా 2011లో ప్రభుత్వం ఈ విషయాన్ని గెజిట్‌లో కూడా పొందుపరిచింది. ఈ పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సంబంధిత పంచాయతీ సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కొందరు సభ్యులు ఉంటారు. గ్రామానికి ఒకరుచొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలపై ఈ గ్రామసభలకే విశేష అధికారాలు ఇచ్చారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజికవనరులు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం-విక్రయం తదితర అన్నింటిపైనా గ్రామసభలదే అంతిమ నిర్ణయం. గిరిజన ప్రాంతాల్లో  ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల పనితీరు, మద్యం దుకాణాల ఏర్పాటు, గనుల తవ్వకాలు, భూసేకరణ తదితర అన్నింటిపైనా  నిర్ణయాధికారం గ్రామసభలదే. ఈ గ్రామసభల అనుమతి లేకుండా ఏదీ చేయడానికి వీల్లేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement