పోలీసుల వేధింపులు ఆపాలి
తూర్పు గోదావరి ఎస్పీకి పాడేరు ఎమ్మెల్యే వినతి
పాడేరు: తూర్పుగోదావరి జిల్లా పోలీసుల చర్యలతో విశాఖ ఏజెన్సీ మారుమూల కొయ్యూరు మండలంలోని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారని, పోలీసుల వేధింపుల నుంచి గిరిజనులను కాపాడాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి ఆ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. రంప చోడవరం ఎమ్మెల్యే వి.రాజేశ్వరితోకలిసి బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని కాకినాడలో కలిశారు. ఆ జిల్లా సరిహద్దులో ఉన్న కొయ్యూరు మండలమఠం భీమవరం, యు.చీడిపాలెం, పలకజీడి, బూదరాళ్ళ పంచాయతీల్లో ఇటీవల పోలీసుల బీభత్సాన్ని వివరించారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసు పార్టీలు గ్రామాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించడంతో అమాయకులైన గిరిజనులు భయాందోళనలతో గ్రామాలను వదిలి అడవులకు పారిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. విచారణ పేరుతో గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం, వారి ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. తరచూ కూంబింగ్ పార్టీలు గ్రామాల్లో చొరబరడడంతో గిరిజనులు భీతిల్లుతున్నారని ఎమ్మెల్యే ఎస్పీకి వివరించారు. అనుమానం ఉన్న వ్యక్తులను గ్రామ పెద్దల సమక్షంలో సామరస్యంగానే విచారించాలని, గిరిజనులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీని కోరారు.