వణికిస్తున్న మలేరియా
- గుమ్మడిగుంటలో ఒకే ఇంట్లో నలుగురికి జ్వరాలు
- ఏజెన్సీలో 3 వేల మలేరియా పాజిటివ్ కేసులు నమోదు
- ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని గిరిజనుల వినతి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో మళ్లీ మలేరియా విజృంభిస్తోంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన చీకుమద్దెల పంచాయితీ గుమ్మడిగుంట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిరిజనులు మలేరియా బారిన పడ్డారు. ఈ గ్రామంలో పలువురు కొద్ది రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఆశ వర్కర్ లేకపోవడం వల్ల గ్రామంలో జ్వరాలు ప్రబలిన సంగతి తెలియరాలేదు. శనివారం పొరుగూరి నుంచి బంధువులు ఇంటికి వెళ్లిన ఒక ఆశా వర్కర్ జ్వరబాధితులకు రక్తపరీక్షలు చేయగా జ్వరాలతో బాధపడుతున్న ఒక కుటుంబంలోని వలసనైని చిన్నమ్మి(35), వలసనైని మచ్చులు(40), వి.కుమారి(22), విష్ణు(6)లకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఇంకా పలువురు జ్వరబాధితులు ఉన్నారని వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వర్షాలే కారణం..
విశాఖ మన్యంలో మలేరియా ముంచుకొస్తోంది. గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మన్యంలో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏజెన్సీలో ఈ ఏడాది మలేరియా జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహిస్తు గ్రామాల్లో జ్వర బాధితులకు రక్తపూతల ద్వారా మలేరియా పాజిటివ్ కేసులను గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నారు. పాడేరు, అరకు ఏరియా ఆస్పత్రులకు, చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి మలేరియా జ్వరబాధితుల తాకిడి ఎక్కువగా ఉంది.
ఏజెన్సీలో ఇప్పటి వరకు 3 వేల వరకు మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వర్షాలు పడుతుండటంతో మన్యంలో గిరిజనులు వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా పాల్గొంటుంటారు. వాతావరణ పరిస్థితులు మారడమే కాకుండా వర్షాల మూలంగా పంట పొలాల్లో దోమలు ప్రబలుతున్నాయి. సహజంగా పంట పొలాల్లోని వర్షపునీరు మీద మలేరియా కారకమైన అనాఫిలస్ దోమలు పెరుగుతాయని, దీని వల్ల ఎక్కువగా గిరిజనులు మలేరియా జ్వరాల బారిన పడే పరిస్థితి ఉందని జిల్లా మలేరియా అధికారి కె.ప్రసాదరావు తెలిపారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే వెంటనే ఏసీటీ మందులు 3 రోజులు వాడాలని సూచించారు.