తిరుగుబాటు
- దళసభ్యులపై ఆదివాసీల్లో పెరుగుతున్న అసంతృప్తి
- మావోయిస్టు నేతతో పాటు ఇద్దరు మిలీషియా సభ్యుల హతం
- ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో సంచలనం
మావోయిస్టులను పోలీసులు చంపేస్తే ఎన్‌కౌంటర్.. అదే గిరిజనుల చేతిలో మరణిస్తే ఎదురుదాడి.. 2013 ఫిబ్రవరి 19నే జీకేవీధి మండలం సాగులలో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు చింతపల్లి మండలం వీరవరంలో కట్టలు తెంచుకుంది. ఆదివాసీలు ఏకంగా దళసభ్యులపై ఎదురుదాడి చేశారు. కత్తులతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. శరత్ వద్ద ఉన్న ఏకే 47ను బలవంతంగా లాక్కుని చంపేశారు. ఇలా మావోయిస్టులకు తొలిసారిగా విశాఖ ఏజెన్సీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం వారికి రక్షణగా ఉన్నవారే తిరగబడ్డారు.
చింతపల్లి/ చింతపల్లి రూరల్ : జీకె వీధి మండలం సాగులలో గతంలో మావోయిస్టులపై గిరిజనులు తిరుగుబాటు చేసినప్పటికీ అప్పట్లో దళసభ్యులదే పైచేయి అయింది. ముగ్గురు గిరిజనులు హతమయ్యారు. తాజాగా బలపం పంచాయతీ కోరుకొండలో ఆదివారం సాయంత్రం గిరిజనుల తిరగుబాటులో మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండెంట్‌తోపాటు మరో ఇద్దరు మిలీషియా సభ్యులు చనిపోవడం సంచలనం.
మావోయిస్టుల చరిత్రలో తొలిసారిగా విశాఖ ఏజెన్సీలో తీవ్ర ప్రతిఘటన చవిచూశారు. ఇప్పుడు వారు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో కొన్నేళ్లుగా మావోయిస్టులకు అనుకూలంగా గిరిజనులు నడుచుకుంటున్నారు. జీకేవీధి మండలం సాగులలో 2013 ఫిబ్రవరి 19న ప్రజా కోర్టు నిర్వహించిన మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరిట ముగ్గురిని చంపేయడంతో గిరిజనులు తిరుగుబాటు చేశారు. ఎదురుదాడికి దిగారు.
అనంతరం పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు గిరిజనులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా ఆదివారం బలపం పంచాతీయలో తులసీమాల ధరించిన సంజీవరావును రాళ్లగెడ్డ వద్ద హతమార్చడంతో పాటు గురుస్వామి సింహాచలం సిద్ధిని ప్రజాకోర్టులో చంపేందుకు ప్రయత్నించడంతో ప్రజల నుంచి మరోసారి తిరుగుబాటు ఎదురైంది.
మావోయిస్టుల అడ్డాగా పేరొందిన కోరుకొండలో మావోయిస్టునేత శరత్‌తో పాటు మిలీషియా సభ్యులు నాగేశ్వరరావు, గణపతిలు గిరిజనుల చేతిలో హతమయ్యారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మరో మిలీషియా సభ్యుడు నాగేశ్వరరావు మృతదేహాన్ని గెడ్డలోకి నెట్టేశారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మావోయిస్టులపై తిరుగబడి దాడి చేసిన గిరిజనులకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ కె.ప్రవీణ్ అన్నారు.